వావిలాల సంస్థకు అండగా ఉంటాం

– ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
– సీఎంను కలిసిన వావిలాల కుటుంబం
– వరద బాధితులకు రూ. లక్ష విరాళం
– 500 మందికి సరిపడా దుస్తుల పంపిణీ
– వావిలాల ఆశయ సాధనకు కృషి చేయాలని సూచించిన ముఖ్యమంత్రి
– మీరు అదేశించండి, సిద్ధంగా ఉన్నామన్న వావిలాల వారసుడు సోడెకర్

సత్తెనపల్లి, మహానాడు: స్వాతంత్య్ర సమరయోధుడు, పద్మభూషణ్ వావిలాల గోపాలకృష్ణయ్య ఆశయ సాధనకు కృషి చేయాలని వావిలాల స్థాపించిన సంస్థకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో వరదల కారణంగా ఇబ్బంది పడ్డ బాధితులకు అండగా నిలిచేందుకు వావిలాల గోపాలకృష్ణయ్య కుటుంబ సభ్యులు మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి లక్ష రూపాయలు విరాళంగా చెక్ ను ఇచ్చారు. దాంతోపాటు 500 మంది బాధితులకు సరిపడా దుస్తులను అందించారు.

ఈ సందర్భంగా వావిలాల వారసుడు, వావిలాల సంస్థ ఉప కార్యదర్శి మన్నవ సోడేకర్ ముఖ్యమంత్రితో మాట్లాడుతూ వావిలాల తెలుగు భాష కోసం, గ్రంథాలయాల స్థాపన కోసం, మద్యపానం నిషేధం కోసం చేసిన పోరాటాన్ని గుర్తు చేశారు. గ్రామీణ అభివృద్దే.. దేశ అభివృద్ధి అని భావించిన ఆయన ఆలోచనలను, ఆశయాలను ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్లాలని విజ్ఞప్తి చేశారు. వావిలాల సంస్థ నుండి చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. సత్తనపల్లి నియోజకవర్గంలో వావిలాల స్మృతి వనం అభివృద్ధి చేయటం అక్కడ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నామని, దీనికి కారణం గతంలో మీరే అక్కడ స్థలం కేటాయించడం మీ హయాంలోనే అభివృద్ధి చేయటం కారణమని చంద్రబాబుకు తెలిపారు. భవిష్యత్తులో కూడా వావిలాల వారి జీవితాన్ని అందరికీ తెలిసేలా ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. మీరు ఆదేశించండి..ఏ పని చెప్పినా చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామని సోడేకర్ చెప్పారు.

దీనికి స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కచ్చితంగా తాను వావిలాల సంస్థకు అండగా ఉంటానని, తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని, తనకు అందుబాటులో ఉండాలని చెప్పారు. రూరల్ డెవలప్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో వావిలాల సంస్థను భాగస్వామ్యం చేస్తామని పేర్కొన్నారు. వావిలాల గోపాలకృష్ణయ్య 118 వ జయంతి సందర్భంగా సీఎం శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో వావిలాల సంస్థ చైర్మన్ వావిలాల లీలా మహేశ్వరి, అధ్యక్షుడు వావిలాల సత్యం, కార్యదర్శి వావిలాల రమా ఉన్నారు.