– పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర రెడ్డి
చిత్తూరు, మహానాడు: తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలుచేయలేదని ప్రశ్నిస్తున్న ప్రజలపై, వైస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి అక్రమ అరెస్టులు చేయాలని దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నదని ఆ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర రెడ్డి అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సాంకేతిక ప్రచారమాధ్యమాలు పెరిగిన దృష్ట్యా ప్రభుత్వ వ్యతిరేక పనులను ఎంతోమంది ప్రసారమాద్యమాలలో ఎత్తిచూపడం సర్వసాధారణ విషయమని ఆయన అన్నారు.
ప్రభుత్వ తప్పిదాలను సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్న వైస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలని దోషులుగా చిత్రీకరిస్తూ కోర్టు ఆదేశాలను కూడా లెక్కచేయకుండా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ వ్యతిరేక పనులపై వైస్సార్సీపీ సానుభూతిపరులు పెడుతున్న పోస్టులకంటే టీడీపీ, జనసేన కార్యకర్తలు వైయస్ జగన్ మోహన్ రెడ్డి, వారి కుటుంపై పెడుతున్న దుర్మార్గపు పోస్టులపై పోలీస్ ఏం చర్యలు తీసుకున్నారు? అని భూమన ప్రశ్నించారు. పవన్ కల్యాణ్, చంద్రబాబు వైస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై ప్రతిరోజు పెడుతున్న తప్పుడు కేసులకు మేం భయపడం, రోడ్ల బైఠాయించి ప్రతిఘటిస్తామని కరుణాకర రెడ్డి హెచ్చరించారు.