కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం

– బైక్ మెకానిక్‌లకు టూల్ కిట్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే జీవీ

వినుకొండ, మహానాడు: మెకానిక్‌లు, నిర్మాణరంగ కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉండి వారికి గౌరవప్రదమై జీవితం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. కష్టపడి పనిచేసే ప్రతికుటుంబం సంతోషంగా ఉండాలని…., అందులో తమవంతు సాయం ఉండడం ఎంతో సంతృప్తినిచ్చే విషయంగా భావిస్తానన్నారు. స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం పెద్దసంఖ్యలో బైక్ మెకానిక్‌లకు ఆయన టూల్ కిట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది.

శివశక్తి ఫౌండేషన్ ద్వారా నవ్యాంధ్ర టూ వీలర్స్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు చెందిన 120 మంది బైక్ మెకానిక్‌లకు 120 టూల్ కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మక్కెన మల్లికార్జునరావు ముఖ్య అతిథులుగా పాల్గొని టూల్ కిట్లు అందించారు. అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే జీవీ మాట్లాడారు. విజయవాడలో వరద ఉద్ధృతికి వేలాది వాహనాలు దెబ్బతిన్నాయని, వాటికి మరమ్మతులు చేయడానికి మెకానిక్‌లు సరిపోవడం లేదని, ఇలాంటి తరుణంలో నవ్యాంధ్ర టూ వీలర్స్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్‌ సభ్యులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి అక్కడకు వెళ్ళి బైక్‌లకు ఉచిత మరమ్మతులు చేస్తామనడం సంతోషంగా ఉందన్నారు. వారు భవిష్యత్తులో ఇదే తరహా సేవాభావంతో ముందుకెళ్లాలని కోరుకుంటున్నానని, తన అండదండలు ఎల్లప్పుడూ యువతకు ఉంటాయన్నారు.

విజయవాడ వరద సహాయక చర్యల్లో పాల్గొని విశేష సేవలందించిన వినుకొండ పురపాలక కమిషనర్, సిబ్బందిని కూడా ఈ వేదిక ద్వారా జీవీ ఆంజనేయులు అభినందించారు. కమిషనర్ సుభాష్ చంద్రబోస్‌ను శాలువాతో సత్కరించారు. అనంతరం మాట్లాడుతూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లోనే సీఎం చంద్రబాబును అడిగి వినుకొండ ఘాట్ రోడ్ నుంచి షాదీఖానా, తితిదే కల్యాణ మండపానికి రూ.3 కోట్లు, రామలింగేశ్వరస్వామి గుడి నిర్మాణానికి రూ.2 కోట్లు సాధించుకున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.