హ్యాండ్ లూమ్ పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకొస్తాం

-చేనేతలే పట్టుచీరలను విక్రయించేలా చేస్తాం
-ప్రత్యేక వెబ్ సైట్ ద్వారా మార్కెటింగ్ అవకాశాలను పరిశీలిస్తున్నాం
-మన ఆడ బిడ్డ సవితమ్మ చేనేత మంత్రిగా ఉన్నారు
-మంత్రులు లోకేష్, సత్యకుమార్ ల దృష్టికి సమస్యల్ని తీసుకెళ్తా
-చేనేతల సమావేశంలో పరిటాల శ్రీరామ్ హామీ

ధర్మవరం: చేనేతల్ని ప్రపంచ పటంలో నిలిపిన హ్యాడ్ లూమ్స్ వ్యవస్థ మసకబారుతోందని.. దీనికి మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తామని ధర్మవరం టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చేనేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. హ్యాండ్ లూమ్స్ పై ఆధారపడ్డ చేనేతలు తమ సమస్యలు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేశారు. ముడిసరకు ధరలు పెరిగిపోయాయని, కూలీల ధరలు కూడా పెరిగాయాయని.. అందునా పవర్ లూమ్స్ వలన హ్యాండ్ లూమ్స్ కి గిరాకీ తగ్గుతోందన్నారు.

ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ గత ఐదేళ్లుగా చేనేతలు ఈ సమస్యలు తన దృష్టికి తీసుకొస్తున్నారని.. గత ప్రభుత్వ నిర్వాకం వలన చేనేతలకు మరింత అన్యాయం జరిగిందన్నారు. అందుకే ఇప్పుడు హ్యాండ్ లూమ్స్ ను పరిరక్షించడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు.

ధర్మవరంలో నేతన్నలే పట్టు చీరలను రిటైల్ లో అమ్ముకునేందుకు ప్రత్యేక వసతిని ఏర్పాటు చేయబోతున్నామన్నారు. చేనేతలకు నైపుణ్య శిక్షణ కేంద్రాల ద్వారా శిక్షణ ఇప్పించి.. మెరుగైన పట్టు చీరల తయారీకి అవకాశాలు పరిశీలిస్తామన్నారు.

ధర్మవరం పట్టుచీరలకు ప్రత్యేక వెబ్ సైట్ ద్వారా మార్కెటింగ్ అవకాశాలను పరిశీలిస్తున్నామని వివరించారు. చేనేత మంత్రిగా మన ఇంటి ఆడబిడ్డ సవితమ్మ కావడం మనకు మరింత మంచి కల్గుతుందన్నారు. త్వరలోనే చేనేత సమస్యలను మంత్రులు నారాలోకేష్, సత్య కుమార్, సవితమ్మ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకుందామన్నారు. చేనేత కార్మికుల పిల్లలకు ఉన్నత విద్యను అందించడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి.. ప్రత్యేక ప్రణాళిక అమలు చేయాలని కోరుతామన్నారు.

పార్టీలకతీతంగా పట్టణ స్థాయిలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి.. చేనేత సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించే విధంగా ముందుకు వెళ్తామని శ్రీరామ్ వారికి భరోసా కల్పించారు. చేనేత కార్మికులకు ఇంటి నిర్మాణంతో పాటు సొంత మగ్గం ఏర్పాటు చేసుకోవడానికి ప్రత్యేక వర్క్ షెడ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తామన్నారు.