పేదలకు రెండు సెంట్లలో ఇళ్లు కట్టిస్తాం

అన్ని వసతులతో ఎన్టీఆర్‌ కాలనీలు ఏర్పాటు చేస్తాం
బొల్లా అరాచకాల వల్లే వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు
వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు

వినుకొండ, మహానాడు : తమ ప్రభుత్వం రాగానే పేదలందరికీ రెండు సెంట్ల స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణం చేసి అన్ని వసతులతో ఎన్టీఆర్‌ కాలనీలు ఏర్పాటు చేస్తామని వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు హామీ ఇచ్చారు. కాలనీలతో పాటు నియోజకవర్గం మొత్తం కొళాయి కనెక్షన్‌ ద్వారా ప్రతి ఇంటికీ సురక్షిత మంచినీటిని సరఫరా చేస్తామని మాట ఇచ్చారు. వినుకొండ సుందరయ్య కాలనీ, మిద్దెబాయి కాలనీ, వడ్డెర కాలనీకి చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం తెలుగుదేశంలో చేరారు. 60 కుటుంబా లు ఆ పార్టీని వీడి ఆంజనేయులు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొల్లా చేసిన అరాచకాలే వినుకొండలో వైకాపాను భూస్థాపితం చేయబోతున్నాయన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఐదేళ్లలో కబ్జాల కోసం భూముల వేట తప్ప ఇక్కడున్న ప్రజల మొహం కూడా చూడని బొల్లాకు ఎవరైనా ఎందుకు మద్దతుగా నిలుస్తారని ప్రశ్నించారు.

అందుకే స్థానిక వైకాపా నాయకులంతా పేదలకు అన్యాయం చేసిన బొల్లాకి వ్యతిరేకంగా తెలుగుదేశంలో చేరుతున్నా రని తెలిపారు. తెలుగుదేశం హయాంలో టిడ్కో ఇళ్లను 90 శాతం పూర్తి చేస్తే… రెండు నెలల్లో పూర్తి చేయాల్సిన పనిని ఐదేళ్లు అయినా చేయలేదని మండిపడ్డారు. ఫలితంగా ఇప్పటివరకు ఇళ్లు లేకుండా మిగిలిన పేదలకు కూటమి ప్రజా ప్రభుత్వం రాగానే ఎన్టీఆర్‌ కాలనీలు నిర్మించి ఇళ్లు ఇస్తామన్నారు. స్థానికంగా రహదారులు, డ్రైనేజీలు సరిగా లేవని.. వాటిని పరిష్కరించేందుకు అండగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యదర్శి షమీం ఖాన్‌, గోల్డ్‌ కరీముల్లా, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.