మార్చి 2026 లోపు ‘దేవాదుల’ పనులు పూర్తి చేస్తాం

– మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి హామీ

ములుగు, మహానాడు: దేవాదుల ప్రాజెక్టు పెండింగ్‌ పనులు మార్చి 2026లోగా వంద శాతం పూర్తి చేస్తామని, ఆ నెలలో సోనియా గాంధీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తామని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేరకు వారు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును సందర్శించారు. వీరితోపాటు మంత్రి సీతక్క, నీటిపారుదల శాఖ నిపుణులు ఉన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌, పొంగులేటి మీడియాతో ఏమన్నారంటే.. ఇరిగేషన్ శాఖను అడ్డుపెట్టుకొని కేసీఆర్ డెకాయిట్ లా వ్యవహరించారు.

ప్రతీ ప్రాజెక్టులో వేల కోట్ల స్కాం జరిగింది. ప్రాజెక్ట్ ల పేరుతో 1.81 లక్షల నిధులు కేసీఆర్ హయాంలో ఖర్చుపెట్టారు. 14వేల కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉంచారు. కమిషన్ల కక్కుర్తితో ప్రాజెక్టులు కట్టారు. కాళేశ్వరం, పాలమూరు, దేవాదుల, సీతారామ అన్నిట్లో దోచుకున్నారు. తెలంగాణ గ్రామీణ ముఖ చిత్రం మార్చడమే మా లక్ష్యం. కాళేశ్వరం ప్రాజెక్టును నాశనం చేశారు.

నిర్దేశిత గడువులోపు దేవాదుల పూర్తి చేసి, 5.57 లక్షల ఎకరాలకు నీళ్ళు అందిస్తాం. సమ్మక్క బ్యారేజ్ కట్టడం వల్ల దేవాదుల ద్వారా 300 రోజులు, 60 టీఎంసీల నీళ్ళు లిఫ్ట్ చేస్తాం.. ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాలను సస్యశ్యామలం చేస్తాం.

ఇరిగేషన్ ప్రాజెక్టులపై కేసీఆర్ కు అవగాహన లేకుండా తీరని అన్యాయం చేశారు. సమ్మక్క సారక్క బ్యారేజ్ ఎన్వోసీ కోసం ఛత్తీస్‌గఢ్‌ను ఒప్పిస్తాం. ఉత్తుత్తి హామీలు మేము ఇవ్వం, చెప్పింది చేసి తీరుతాం. ఫార్మ్ హౌజ్ లో కూర్చొని నిర్ణయాలు తీసుకోం.. 24 గంటలు ప్రజలకు, అధికారులకు అందుబాటులో ఉంటాం. దేవాదుల ప్రాజెక్టు పెండింగ్ బిల్లులు త్వరలో చెల్లిస్తాం. ధరలు పెరగడంతో భూసేకరణ ఇబ్బందిగా మారింది. ఇరిగేషన్ ప్రాజెక్టుల భూసేకరణ కోసం ప్రత్యేక ఐఏఎస్ అధికారిణి నియమిస్తున్నాం. ఇరిగేషన్ శాఖ బలోపేతం కోసం 700 మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లను నియమించాం.