పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం

– మంత్రి సత్య కుమార్ యాదవ్

ధర్మవరం, మహానాడు: అకాల వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ధర్మవరం చెరువు తోపాటు గోట్లూరు చెరువు, కనగని పల్లి చెరువులు ఏర్లు పొంగిపొర్లుతున్న చెరువుల్ని మంత్రి సత్య కుమార్ కార్యాలయ సిబ్బంది పర్యవేక్షించింది. అలాగే ధర్మవరం మండలం నడిమిగడ్డపల్లి తండాలో వి.అప్పనాయక్ అనే రైతు అయిదు ఎకరాలలో సాగుచేసిన ద్రాక్ష తోట, దర్శనమల, ఏలుకుంట్ల, ముదిగుబ్బ, నర్సింపల్లిలలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి చాలావరకు పంట నష్టం వాటిలిందని మంత్రి కార్యాలయ సిబ్బంది ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి సత్య కుమార్ యాదవ్ కి వివరించారు. ఆయన వెంటనే స్పందించారు. సంబంధిత అధికారులతో ఫోన్లో సంప్రదింపులు జరిపి ఈ వర్షాల కారణంగా ఎటువంటి ప్రాణ నష్టం,ఆస్తి నష్టం కలగకుండా చూడాలని అధికారులను కోరారు, అలాగే పలుచోట్ల రైతులు సాగుచేసిన పంటలు తీవ్రంగా దెబ్బ తినడంతో, నష్టపోయిన రైతుల వివరాలు సేకరించి వారందరికీ ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.