వృద్ధులను సైతం మోసం చేసిన ఘనుడు జగన్

  • సూపర్ సిక్స్ హామీలు అమలు చేసి జగన్ కి సూపర్ స్ట్రోక్ ఇస్తాం
  • మాది మంచి ప్రభుత్వం, వైసీపీది ప్రజలను ముంచిన ప్రభుత్వం
  • మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి

పింఛన్ల పెంపుపై మాట తప్పి వృద్ధులను సైతం మోసం చేసిన ఘనుడు జగన్మోహన్ రెడ్డని, జగన్ లాగా తాము ప్రజలను మోసం చేయకుండా ఇచ్చిన అన్ని హామీల అమలు చేస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. శుక్రవారం నాడు ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కారుమంచిలో మంత్రి ఇంటింటికి తిరిగి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు లబ్ధిదారులకు అందజేశారు.

అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ….పింఛన్ల పెంపుపై మాట తప్పి వృద్దులను సైతం మోసం చేసిన ఘనుడు జగన్. సొంత తల్లినీ, చెల్లిని మోసం చేసిన జగన్ కి ప్రజలను మోసం చేయడం ఓ లెక్కా ? ఎన్ని ఇబ్బందులున్నా ప్రతి నెల ఒకటో తేదీనే ఫించన్లు ఇస్తున్నాం. దీపం పధకం కింద రాష్ట్రంలో 1.48 కోట్ల మంది మహిళలకు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు. గుంతలు లేని రోడ్లు అనే కార్యక్రమాన్ని రేపటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తున్నామని, దీనికి రూ. 800 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. సొంత వాహనం కలిగిన ప్రతి ఒక్కరికి తమ సొంత గృహ నిర్మాణ అవసరాలకు ఉచితంగా ఇసుకను ఇస్తున్నామని, సొంతవాహనం లేని వారికి ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకు ఉచిత ఇసుకను సరఫరా చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. గతంలో కంటే నేడు ఇసుక ధర బాగా తగ్గిందన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన రేట్ల కంటే ఎక్కువ రేట్లకు ఉచిత ఇసుక సరఫరా చేస్తే వారిపై చర్యలు తప్పవన్నారు.

గత ప్రభుత్వం ఎస్.సి కార్పోరేషన్ ను నిర్వీర్యం చేసిందని, వచ్చే నెలలో రూ. 50 వేల సబ్సిడీ తో ఎస్.సి కార్పోరేషన్ ద్వారా అర్హత కలిగిన వారికి రుణాలు మంజూరు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని అన్నీ గ్రామాలకు కృష్ణా జలాలు సరఫరా అయ్యేలా రూ. 450 కోట్లతో ప్రతిపాదనలు పంపడం జరిగిందని మంత్రి వివరించారు. జగన్ లాగా మేము ప్రజలను మోసం చేయం ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామన్నారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేసి జగన్ కి సూపర్ స్ట్రోక్ ఇస్తామన్నారు. మాది మంచి ప్రభుత్వం, వైసీపీది ప్రజలను ముంచిన ప్రభుత్వమని మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి విమర్శించారు.