ప్రతి ఒక్క సమస్యను పరిష్కరిస్తా
మీ ఆదరణతో బాధ్యత పెరిగింది
దర్శి ప్రజల రుణం తీర్చుకుంటా
టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి
కురిచేడు/దర్శి, మహానాడు : కురిచేడు మండలం పడమర గంగవరం, గంగదొనకొండ గ్రామాలలో బుధవారం ఉదయం దర్శి టీడీపీ అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంతర్గత రోడ్లను పూర్తి చేస్తాం…మండల కేంద్రానికి రహదారి వ్యవస్థను ఏర్పా టు చేస్తామని తెలిపారు. కురిచేడు మండలం గంగదొనకొండ పడమరగంగవరం గ్రామాలలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేకపోయారు. అవి చూస్తే నాకు అర్థమవుతున్నాయి. అంతర్గత రోడ్లు లేవు, డ్రైన్లు లేవు, తాగునీరు లేదు, సాగునీటి కష్టాలు ఉండనే ఉన్నాయి. మండల కేంద్రానికి రోడ్డు వసతి కూడా లేదంటే గత వైసీపీ ప్రభుత్వం ఎలా నిర్లక్ష్యం చేసిందో అర్థం చేసుకోవచ్చు.
నవరత్నాల పేరుతో నవ దోపిడీ చేసి ఒక చేత్తో ఇస్తూ మరో చేత్తో ఆస్తులు లాక్కుంటూ జీవన ప్రమాణాలు కూడా లేకుండా చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సమస్యలు తీరుస్తాను. దర్శిలోనే ఉంటాను. నాడి తెలిసిన డాక్టరును… ఇక్కడే ఆసుపత్రి పెట్టి పేద ప్రజలకు సేవ చేయడమే నా మొదటి ప్రాధాన్యం. రాజకీయమంటే సేవ అని ఆనాడు మా తాతయ్య గొట్టిపాటి హనుమంతరావు మాకు నేర్పారు. అదే బాటలో నాలుగో తరంలో ఉన్న నేను దర్శి ప్రజల రుణం తీర్చుకుంటా. మీ ఆదరణ బాధ్యత మరింత పెంచే విధంగా ఉంది. నేను రాజకీయాలంటే అక్రమ సంపాదన, అవినీతి కోసం రాలేదు. ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని అభ్యర్థించారు. ఈ ప్రచారంలో నియోజకవర్గ నాయకులు, కురిచేడు మండల టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.