– డ్రగ్స్ నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత
– సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టీకరణ
హైదరాబాద్ : డ్రగ్స్‌తో కలిగే నష్టాలపై ఇటీవల ప్రముఖ నటుడు చిరంజీవి ఓ వీడియో తీసి పంపారని, ఆయనను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. చిరంజీవిని ఇతర నటులు ఆదర్శంగా తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రతి సినిమా ప్రదర్శనకు ముందు ఆ సినిమాలో నటించే తారాగణంతో సైబర్ నేరాలు, డ్రగ్స్ దుష్పలితాలపై అవగాహన కల్పించే ఒకటిన్నర రెం డు నిమిషాలు నిడివి గల్లిగన వీడియోలను తీసి ఉచితంగా ప్రదర్శించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
సినిమా థియేటర్లలోనూ ఈ రెండు రకాల వీడియోలను ఉచితంగా ప్రదర్శించాలని థియేటర్ యజమానులకు ముఖ్యమంత్రి సూచించారు. సినిమా అనేది రూ.వందల కోట్ల పెట్టుబడితో చేసే వ్యాపారమని, వారి వ్యాపారాన్ని తాము కాదనమని, కానీ అదంతా ప్రజల నుంచే వచ్చేదనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. సినిమా విడుదలకు ముందు డ్రగ్స్, సైబర్ నేరాల అవగాహన వీడియోలు ప్రదర్శిస్తేనే సినిమా టిక్కెట్ ధరల పెంపు, ఇతర అనుమతులు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు.
సమాజాన్ని కాపాడాల్సిన సామాజిక బాధ్యత సినీ పరిశ్రమపై ఉందన్నారు. మీడియా సైతం రాజకీయ వివాదాలపై కాకుండా సామాజిక సమస్యలపైనా దృష్టిసారించాలని ముఖ్యమంత్రి హితవుపలికారు. డ్రగ్స్, సైబర్ నేరాలపై టీవీలు, పత్రికల్లో అప్పుడప్పుడు ఉచితంగా ప్రకటనలు వేయాలని ముఖ్యమంత్రి సూచించారు. మీడియా సామాజిక బాధ్యతగా ఈ అంశాన్ని పరిగణించాలని ఆయన కోరారు.