న్యాయవాదులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటాం

– విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై సీఎంతో చర్చించి నిర్ణయం
– న్యాయవాదులకు ఆరోగ్యభద్రతతో పాటు ప్రత్యేక రక్షణ చట్టం
– విశాఖకు టీసీఎస్ రాక ప్రారంభం మాత్రమే
– విశాఖపట్నం బార్ అసోసియేషన్ సమావేశంలో మంత్రి నారా లోకేష్

విశాఖపట్నం, మహానాడు: ఎన్నికల ముందు న్యాయవాదులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటామని విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. జిల్లా కోర్టు నూతన భవన సముదాయంలో శుక్రవారం నిర్వహించిన విశాఖపట్నం బార్ అసోసియేషన్ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులం అందరం చట్టాన్ని గౌరవిస్తాం. ఇక్కడ రాజకీయాలు మాట్లాడటం లేదు. యువగళం పేరుతో 222 రోజుల పాటు 3,132 కి.మీల పాదయాత్ర చేశా. ప్రతిరోజూ ఎంతోమందిని కలిసి వారి సమస్యలు తెలుసుకున్నా. అందులో భాగంగానే న్యాయవాదులు పడుతున్న ఇబ్బందులు, కష్టాల గురించి తెలుసుకున్నా. నాపైన కూడా బాధ్యత పెరిగింది. న్యాయవాదులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటాం.

న్యాయవాదులకు హెల్త్ కార్డులు మంజూరు విషయంలో ఆరోగ్యశ్రీయే కాకుండా కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకంతో అనుసంధానం చేసి మెరుగైన స్కీమ్ తీసుకురావాలనేది మా లక్ష్యం. కొంచెం సమయం ఇవ్వండి. సంక్షేమ పథకాలకు సంబంధించి వయస్సు పరిమితిని సడలించాలని కోరారు. దీనిపైనా చర్యలు తీసుకుంటాం. పెండింగ్ లో ఉన్న కోర్టు భవనాల పనులు పూర్తిచేస్తాం. ఇళ్ల నిర్మాణం, ఇంటి పట్టాలు అందిస్తాం. న్యాయవాదులకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ రోజు నా ప్రత్యర్థి లాయర్ నన్ను ఏమైనా ప్రశ్నించే స్వేచ్ఛ ఉంది. కానీ, గతంలో అలాంటి స్వేచ్ఛ ఉండేది కాదు. కోర్టులో వాదించి బయటకు వస్తే లాయర్లపై దాడిచేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. మీరందరూ మర్చిపోయారు. కార్యకర్తలను కాపాడేందుకు మాచర్లకు వెళ్లిన మా లాయర్ పారా కిషోర్ పై తీవ్రంగా దాడికి తెగబడ్డారు. వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఫ్రొఫెషనల్ ట్యాక్స్ రద్దుపై పరిశీలన చేస్తాం.

విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై సీఎంతో చర్చించి నిర్ణయం

విశాఖపట్నంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై అందరూ అడిగారు. ముఖ్యమంత్రితో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకుంటాం. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై న్యాయవాదులు పెద్దఎత్తున పోరాడారు. ఆ చట్టం అమలై ఉంటే మన భూములు మన చేతుల్లో ఉండేవి కావు. గత పాలకులు ఎప్పుడూ ఈ విధంగా కూర్చొని మాట్లాడలేదు. పరదాలు కట్టుకుని తిరిగే ప్రభుత్వం కాదు మాది. చేయగలిగినది తప్పకుండా చేస్తాం.

విశాఖలో టీసీఎస్ రాక ప్రారంభం మాత్రమే

విశాఖలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. రాజకీయంగా, కొన్ని కారణాల వల్ల నేను మంగళగిరిని ఎంచుకున్నా. విశాఖను అభివృద్ధి చేసేందుకు మెరుగైన అవకాశాలు ఉన్నాయి. మొదటి వంద రోజుల్లో ఒక్క ఐటీ కంపెనీ అయినా ఇక్కడకు తీసుకువస్తానని హామీ ఇచ్చా. 120 రోజులు పట్టింది. టీసీఎస్ ను గర్వంగా తీసుకువచ్చాం. ఇది ప్రారంభం మాత్రమే. బాబుకి విశాఖపై ఎనలేని ప్రేమ ఉంది. ఇక్కడ అనేక పరిశ్రమలు తీసుకువస్తాం. ఐటీ కంపెనీలు, డేటా సెంటర్ వస్తాయి. సెజ్ ను కూడా తీసుకువస్తాం. 2019లో ఆర్థికంగా అభివృద్ధి చెందిన పట్టణాల్లో విశాఖ 9వ స్థానంలో ఉంటే గత పాలనలో 10వ స్థానానికి పడిపోయింది. ఎకనామిక్ యాక్టివిటీ ఆగిపోయింది. దీనిని పునరుద్ధరిస్తాం. పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకువస్తాం. ఎయిర్ పోర్ట్, మెట్రో ప్రాజెక్టు, స్పెషల్ ఎకనమిక్ జోన్లు తీసుకువస్తాం. గతంలోనే విశాఖలో మాకు 4 స్థానాలు కట్టబెట్టారు. అలాంటి విశాఖను మేం మర్చిపోం.

విశాఖ ప్రజలు ఆశీర్వదించారు, దీవించారు..

కుప్పం కంటే మంగళగిరిలో నాకు ఒక్క ఓటైనా ఎక్కువ వస్తుందని నేను బాబుతో ఛాలెంజ్ చేశా. ఫలితాల రోజు మంచి మెజార్టీ ఇచ్చారని ఆనందపడ్డా. కానీ విశాఖ ప్రజల వల్ల ఆ ఆనందం ఎక్కువ సేపు లేదు. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ సాధించిన నియోజకవర్గాలు గాజువాక, భీమిలి తర్వాత మూడో స్థానంలో మంగళగిరి నిలిచింది. విశాఖ ప్రజలు ఆశీర్వదించారు, దీవించారు. విశాఖను అభివృద్ధి చేస్తాం. అందులో భాగంగానే తొలి అడుగు టీసీఎస్. కమ్యూనిటీ హాల్ నిర్మాణంపై వివరాలు తీసుకుని ముందుకువెళ్తాం.

రాష్ట్రం మైనస్ నుంచి మొదలైంది

ఈ రోజు రాష్ట్రం మైనస్ నుంచి మొదలైంది. 2014లో జీరోలో ఉంటే 2024లో మైనస్ లో ఉన్నాం. కేంద్రం సహకారం వల్లే ప్రభుత్వం నడిపించుకోగలుగుతున్నాం. లేకపోతే పరిస్థితి దారుణంగా ఉండేది. ఫీజు రీ యింబర్స్ మెంట్ కు 2,500 కోట్లు బకాయిలు పెట్టారు. చిక్కీ, గుడ్లకు రూ.250 కోట్లు బకాయిలు పెట్టారు. ఆరోగ్యశ్రీకి రూ.2వేల కోట్లు బకాయిలు పెట్టారు. వ్యవస్థలన్నింటినీ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఎంపీ ముతుకుమిల్లి శ్రీ భరత్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో న్యాయవాదులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం. జిల్లా కోర్టులో అటెండర్లకు జీతాలు సక్రమంగా అందడం లేదని చెబుతున్నారు. త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తాం. వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామనే హామీకి కట్టుబడి ఉన్నాం. ఇప్పటికే టీసీఎస్ ద్వారా 10వేల ఉద్యోగాలు రాబోతున్నాయి. లాయర్లకు నిరుద్యోగ భృతి కింద ఇచ్చే రూ.3వేలు లాయర్లకు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తాం.

విశాఖపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.సత్యనారాయణ మాట్లాడుతూ.. విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటుచేయాలని కోరారు. దీంతో పాటు లాయర్లకు కమ్యూనిటీ భవనం నిర్మించాలని, హెల్త్ ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలని మంత్రి నారా లోకేష్ కు విజ్ఞప్తి చేశారు. విశాఖ ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఆదరించారన్నారు. అనంతరం మంత్రి నారా లోకేష్ ను బార్ అసోసియేషన్ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ప్రత్యేక జ్ఞాపికను అందజేశారు.