– మీడియా సమావేశంలో ఎంపీ విజయసాయి రెడ్డి
నెల్లూరు, ఫిబ్రవరి 24: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలనుద్దేశించి ప్రసంగించే సిద్ధం మహాసభలకు ప్రజల నుండి అనూహ్య రీతిలో స్పందన లభిస్తోందని, మార్చి 3న అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గం,కొర్సిపాడు మండలం, పిచ్చికలగుడిపాడు గ్రామం, జాతీయ రహదారి పక్కన జరగనున్న చివరి సిద్ధం మహాసభకు 15 లక్షల మంది వరకు హాజరు కానున్నారని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి తెలిపారు.
ఈ మేరకు శనివారం నాడు నెల్లూరు పార్టీ కార్యలయంలో నెల్లూరు, ప్రకాశం, తిరుపతి పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో 21 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మంత్రులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సమన్వయకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. మార్చి 3 తేదీన జరగనున్న సిద్ధం సభలో సాయంత్రం 3 గంటలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని అన్నారు. ఎన్నికల ముందు కొందరు పార్టీలను వీడడం, మరికొందరు పార్టీల్లో చేరడం సర్వసాధారణమని, దీనిని బూతద్దంలో చూడకూడదని అన్నారు. పార్టీలను వీడడానికి, కొత్త పార్టీల్లో చేరడానికి అనేక కారణాలు ఉంటాయని అన్నారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి,రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, మేకపాటి విక్రం రెడ్డి, కిలివేటి సంజీవయ్య,అన్న రాంబాబు, నాగార్జున రెడ్డి,ఎమ్మెల్సీలు పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, బల్లి కళ్యాణ్ చక్రవర్తి,పార్టీ సమన్వయకర్తలు పాల్గొన్నారు..