- అమరావతి బ్రాండింగ్ తో ఐపీఎల్ క్రికెట్ టీంను ప్రమోట్ చేస్తాం
- గల్లీ నుండి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తాం
- క్రీడామైదానాలు, స్టేడియంల ఏర్పాటుకు కృషి
- క్రీడాకారులకు సౌకర్యాలు కల్పించడంతో పాటు వారిని ప్రోత్సహిస్తాం
- ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు అనే తేడా లేకుండ విద్యార్థులకు ఒక గంట క్రీడలకు కేటాయించాల్సిందే
- సర్టిఫికెట్ల కుంభకోణంపై దృష్టి పెట్టి నిజమైన క్రీడాకారులకు పూర్తి న్యాయం చేస్తాం
- సీఎంతో మాట్లాడి అతి త్వరలోనే సరికొత్త క్రీడాపాలసీని రూపొందిస్తాము
- గత ఐదేళ్లలో క్రీడలకు అన్యాయం జరిగింది.
- గత ప్రభుత్వం ఆడుదాం ఆంధ్రా అంటూ అభాసుపాలు కార్యక్రమం నిర్వహించారు
- రవాణా మరియు యువజన, క్రీడాశాఖామాత్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
విజయవాడ: రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్ గా వచ్చే ఐదేళ్లలో తయారు చేస్తామని, అందుకు అవసరమైన అన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, క్రీడాకారుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని రవాణా మరియు యువజన, క్రీడా శాఖా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ క్రీడా సాధికార సంస్థ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించిన అనంతరం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఆవరణలోని SAAP సమావేశ మందిరంలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం క్రీడలను పూర్తిగా విస్మరించిందని, చివరలో ఆడుదాం ఆంధ్రా అంటూ అబాసుపాలు కార్యక్రమం నిర్వహించి, అందులో కూడా రూ. 120 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై ఆధారాలను సేకరిస్తున్నామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.
అమరావతి పేరుతో వచ్చే ఐదేళ్లలో ఐపీఎల్ క్రికెట్ జట్టును ప్రమోట్ చేయనున్నమని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. గల్లీ నుండి జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు క్రీడల ప్రోత్సహకానికి కృషి చేస్తామని తెలిపారు. క్రీడాకారులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించి వారిలో క్రీడాసక్తి పెంపొందించి ఉత్తమ క్రీడాకారులుగా రాణించేలా చర్యలు తీసుకుంటామన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించడంలో భాగంగా అవసరమైన క్రీడా మైదానాలు, స్టేడియంల నిర్మాణానికి పెద్దపీట వేస్తామన్నారు. క్రీడా వికాస కేంద్రాలు, గ్రామ స్థాయిలో క్రీడల నిర్వహణ, ప్రోత్సాహంపై సీఎంతో చర్చిస్తామన్నారు.
అలాగే క్రీడాకారులకు నకిలీ సర్టిఫికెట్ల వల్ల నష్టం జరుగుతుందని తమ దృష్టికి వచ్చిందని, సర్టిఫికెట్ల కుంభకోణంపై విచారణ చేసి అసలైన క్రీడాకారులకు పూర్తి న్యాయం చేస్తామన్నారు. క్రీడలకు ప్రధాన్యత ఇవ్వడంలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు అనే తేడా లేకుండ విద్యార్థులు ఆడుకోవడానికి ఒక గంట సమయం కేటాయించేలా టైం టేబుల్ ఏర్పాటు ఉండేలా ఆదేశాలు ఇవ్వనున్నట్లు మంత్రి చెప్పారు. అలాగే క్రీడామైదానాలు లేని ప్రైవేటు పాఠశాలలకు నోటీసులు ఇస్తామని, అవసరమైతే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులు మానసిక ఉల్లాసం, శారీరక దృడత్వం సాధించాలంటే క్రీడలు జీవితంలో భాగం కావాలన్న నినాదమే లక్ష్యంగా ముందుకు సాగుతామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పెర్కొన్నారు.
క్రీడాపరంగా ప్రధాన సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామన్నారు. దేశ బడ్జెట్ లో క్రీడలకు ప్రాధాన్యత ఉంటుందని, సీఎం చంద్రబాబు సహకారంతో మన రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి అధిక నిధులు తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటామని అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఉమ్మడి ఏపీలో గోపిచంద్ వంటి మేటీ క్రీడాకారులను ప్రోత్సహించడంతో పాటు అకాడమి ఏర్పాటుకు తోడ్పాడు అందించడంతో దేశం గర్విచే క్రీడాకారులను తయారుచేయగలిగారని, అదేవిధంగా అమరావతి, వైజాగ్ లలో అకాడమి ఏర్పాటుకు చంద్రబాబు భూమి కేటాయిస్తే గత వైసీపీ ప్రభుత్వం దానిని తుంగలో తొక్కి క్రీడలకు అన్యాయం చేసిందన్నారు.
కొత్త స్పోర్ట్స్ పాలసిపై సీఎం చంద్రబాబుతో చర్చించి త్వరలోనే విడుదల చేస్తామన్నారు. రాష్ట్రంలో అనుమతి లేని క్రీడా అకాడమీల అనుమతులు రద్దు చేస్తామని అన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నిర్వహణ కార్పొరేషన్ పరిధిలో ఉందని, దీంతో గత ప్రభుత్వం కేవలం రాజకీయ కార్యక్రమాలకు ఎక్కువగా ఉపయోగించిందని, శాప్ పరిధిలోకి వచ్చే విధంగా కార్పొరేషన్ అధికారులతో చర్చిస్తామన్నారు. అలాగే పే అండ్ ప్లే జీవో వల్ల ఇబ్బందులుంటే దానిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి రాంప్రసాద్ అన్నారు. సమావేశంలో శాప్ అధికారులు పాల్గొన్నారు.