– ఎమ్మెల్యే చదలవాడ
నరసరావుపేట, మహానాడు: పల్లెల అభివృద్ధికి అభివృద్ధి బాటలు వేస్తామని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన “పల్లె పండుగ” వారోత్సవాల్లో భాగంగా సోమవారం నరసరావుపేట మండలం రావిపాడు, లింగంగుంట్ల, అల్లూరివారిపాలెం, ఇక్కుర్రు గ్రామాల్లో జడివానలోనే తడుస్తూ ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ. 4500 కోట్లతో గ్రామాల అభివృద్ధికి ఈ ప్రభుత్వం బాటలు వేస్తోందని పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 30వేల పనులకు సుమారు 4500 కోట్లతో అభివృద్ధి పనులుకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. గత ఐదేళ్ల వైసిపి పాలనలో గ్రామాల్లో ఒక అభివృద్ధి పని జరగలేదని పేర్కొన్నారు. జగన్ పాలనలో పంచాయతీలను నిర్వీర్యం చేశారని ఎద్దేవా చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నాయకత్వంలో రాష్ట్ర ప్రగతికి బాటలు వేశారని తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో రోడ్లు మంచినీరు, పారిశుద్ధ్యం, వీధిలైట్లు ఏర్పాటు చేసి పలు అభివృద్ధి పనులు వేగవంతం చేస్తామని చదలవాడ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గోనుగుంట్ల కోటేశ్వరరావు, బండారుపల్లి విశ్వేశ్వరరావు, నియోజకవర్గ కూటమి నేతలు, కార్యకర్తలు, మహిళలు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.