-ప్రతి పైసలు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా పంపిణీ చేయడమే మా ప్రభుత్వ ఉద్దేశం
-రైతు భరోసా పై విధివిధానాలు రూపొందించడానికే ప్రజాభిప్రాయ సేకరణ
-పది జిల్లాల రైతుల నుంచి వచ్చిన అభిప్రాయాలను చట్టసభలో పెట్టి చర్చిస్తాం
-చట్టసభలు చర్చ జరిగిన తర్వాత రైతు భరోసా పై విధివిధానాల రూపకల్పన
-ఉమ్మడి ఖమ్మం జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో వెల్లడించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
-సమావేశానికి హాజరైన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
-సాగు చేస్తున్న భూములకే రైతు భరోసా ఇవ్వాలని కోరిన పలువురు రైతులు
ఖమ్మం: రాష్ట్ర వనరులు, సంపదను న్యాయంగా ధర్మబద్ధంగా ప్రజలకు పంచడమే ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం ఉద్దేశమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ప్రజల చెమట, శ్రమ ద్వారా పన్నుల రూపేణా రాష్ట్ర ఖజానాకు వచ్చిన ప్రతి పైసను దుర్వినియోగం కాకుండా న్యాయబద్ధంగా ధర్మం ప్రకారంగా ప్రజలకు పంపిణీ చేయడం కోసమే ప్రజల అభిప్రాయ సేకరణకు 10 జిల్లాల్లో పర్యటించి రైతు భరోసా విధివిధానాలను రూపొందిస్తున్నామని వెల్లడించారు.
ప్రజా ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత నిచ్చి కాపాడుకుంటుందని వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రజల జీవన భృతి కి దోహదపడుతున్న రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని దృఢ సంకల్పంతో నెరవేర్చడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. బుధవారం ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయంలో రైతు భరోసా పథకంపై రాష్ట్ర కేబినెట్ కమిటీ చైర్మన్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి భట్టి విక్రమార్క మల్లు అధ్యక్షతన ఉమ్మడి ఖమ్మం జిల్లా విస్తృత సాయి సమావేశం జరిగింది.
సమావేశంలో కేబినెట్ సభ్యులు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లు పాల్గొన్నారు. ఇట్టి సమావేశంలో రైతులు, శాస్త్రవేత్తలు, డాక్టర్లు, లాయర్లు, జర్నలిస్టులు వివిధ వర్గాల వారు హాజరై, రైతు భరోసా అమలుకు అభిప్రాయాలు, సూచనలు చేశారు.
ఈ సమావేశానికి హాజరైన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ, గత ప్రభుత్వం విడుదల చేయకుండా పెండింగ్లో పెట్టిన రైతు బంధు నిధులను సమయానుకూలంగా ప్రజా ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టనందున, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓటాన్ అకౌంటు బడ్జెట్ ను ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే నిధులను దృష్టిలో పెట్టుకొని త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెడుతుందని ఆయన తెలిపారు. పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలోనే రైతు భరోసా పథకం అమలుపై విధివిధానాల రూపకల్పనకు ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ నియామకం చేసిందన్నారు.
ఇట్టి సబ్ కమిటీలో భట్టి విక్రమార్క నైన నేను, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరావు, దుద్దిల శ్రీధర్ బాబు లు సభ్యులుగా ఉన్నామన్నారు. రైతు భరోసా కేబినెట్ సబ్ కమిటీ సమావేశం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించి, ఈ పథకం అమలు కోసం ఉమ్మడి పది జిల్లాల్లో పర్యటన చేసి, ప్రజలు, రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించి విధివిధానాలు రూపొందించాలని నిర్ణయించామన్నారు. అన్ని వర్గాల ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాలను నివేదిక రూపంలో రూపొందించి బడ్జెట్ సమావేశాల్లో చట్టసభల్లో సభ్యుల ముందు ప్రవేశపెట్టి చర్చిస్తామని తెలిపారు.
శాసనసభ్యుల అభిప్రాయాల అనంతరం రైతు భరోసా విధివిధానాలు రూపొందడం జరుగుతుందని వెల్లడించారు. సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, నిజమైన రైతులకు రైతు భరోసా అందించడానికి అన్ని వర్గాల ప్రజల నుండి అభిప్రాయ సేకరణ జరుగుతున్నదని తెలిపారు. పేద రైతులకు సహకారం అందించడానికి ప్రభుత్వం ఓపెన్ మైండేడ్ గా పనిచేస్తున్నదని అన్నారు. ప్రభుత్వం అన్ని వర్గాల ఆలోచనల మేరకు నిజమైన రైతుకు రైతు భరోసా అందిస్తామన్నారు. గతంలోలా లోపాలు, ఆర్థిక నష్టాలు తలెత్తకుండా, కష్టపడ్డ చిన్న, సన్నకారు రైతులకు చేయూత ఆదుకోవాలని ప్రభుత్వ ఉద్దేశ్యమని మంత్రి అన్నారు.
సమావేశంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, రైతు భరోసా చెల్లింపులకు ప్రజల అభిప్రాయ సేకరణ చేపడుతున్నామని అన్నారు. నిజమైన రైతును ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుపెట్టే, ప్రతి రూపాయి, రాష్ట్ర ప్రజలు వివిధ రూపాల్లో చెల్లించిందేనని ఆయన అన్నారు. గతంలో ఏ పథకం చేపట్టిన ప్రజల అభిప్రాయాలు తీసుకోలేదని, నాలుగు గోడల మధ్య తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసేవారని అన్నారు.
బడుగు, బలహీన వర్గాలకు ప్రతి పైసా అకౌంట్ చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందన్నారు. ఓపెన్ గా డిబేట్ చేసి, ప్రజలు, రైతుల నుండి ఏ అభిప్రాయాలు వస్తాయో, ఎవరికి సాయం చేస్తే, ఆ రైతులు మంచిగా, ఆనందంగా ఉంటారో, వివరాలు సేకరించి అమలు చేయడం ప్రభుత్వ ఉద్దేశ్యమని తెలిపారు. రాష్ట్రంలోని మిగతా 9 ఉమ్మడి జిల్లాల్లో రైతులు, ప్రముఖులు, ప్రజల అభిప్రాయాలు సేకరించి, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో పెట్టి, నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి తెలిపారు.
అనంతరం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రైతులు, రైతుసంఘల నాయకులు, కౌలు రైతులు, డాక్టర్లు, అడ్వకేట్, జర్నలిస్టులు, శాస్త్రవేత్తలు, పలువురు వారి వారి అభిప్రాయాలను సమావేశంలో వివరించారు. సాగు భూమికే భరోసా అందజేయాలని, చిన్న సన్నకారు రైతులకు న్యాయం చేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ట్యాక్స్ చెల్లింపుదారులను మినహాయించాలని, ఏజెన్సీ ప్రాంతంలో పట్టాలేని రైతులకు రైతు భరోసా అందించాలని కొందరు అభిప్రాయపడ్డారు. అన్ని పంటలకు బోనస్ అందించాలని, కౌలు రైతులకు బోనస్, పట్టా రైతులకు రైతు భరోసా అందించాలని, కౌలు రైతుల గురించి ఆలోచించాలనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు తీసుకొచ్చిన 2011 కౌలు రైతు చట్టాన్ని ప్రజా ప్రభుత్వం పునరుద్ధరించాలని పలువు రైతులు కోరారు. 2014 ముందు రైతులకు ఎరువులు విత్తనాలు ఉచితంగా ఎలా ఇచ్చారు ఇప్పుడు కూడా అదే విధంగా ఇవ్వాలని కోరారు. వ్యవసాయంత్ర పరికరాలు సబ్సిడీలు రాయితీలు ప్రోత్సాహకాలు అందించడంతోపాటు గ్రామాల్లో ఉన్న కోతుల బెడదను నివారించాలని మంత్రులకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీలు రామసహాయం రఘురాం రెడ్డి, పోరిక బలరాం నాయక్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి కె. రామకృష్ణారావు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు ముజమ్మిల్ ఖాన్, జితేష్ వి పాటిల్, ఎమ్మెల్యే లు మట్టా రాగమయి, రాందాస్ నాయక్, తెల్లం వెంకట్రావు, రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల వ్యవసాయ అధికారులు విజయనిర్మల, బాబూరావు, అధికారులు, రైతులు, వివిధ వర్గాల వారు, తదితరులు పాల్గొన్నారు