కురిచేడు తాగునీటి కష్టాలు పరిష్కరిస్తాం

మృతుల కుటుంబాలకు న్యాయం చేస్తాం
మీ ఇంటి ఆడబిడ్డగా ఆశీర్వదించండి
దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి

ప్రకాశం జిల్లా దర్శి, మహానాడు : దర్శి నియోజకవర్గం కురిచేడు పట్టణంలో గురువారం దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కురిచేడు సమస్యలు తెలుసు… ఈ ప్రాంత వాసులు నిత్యం తనతో మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యంగా కురిచేడులో తాగునీటి సమస్యతో అల్లాడిపోతున్నారు. పొట్లపాడు రిజర్వాయర్‌ ఏర్పాటు చేసినా కుడిచేడు తాగునీటి కష్టాలు తీరలేదు ..పక్కనే సాగర్‌ కుడి కాలువ ఉన్నా కష్టాలు పోలేదు. తనను గెలిపిస్తే కురిచేడు ప్రాంత ప్రజలకు శాశ్వత తాగునీటి సమస్య పరిష్కరిస్తాను. ఇందుకోసం ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో రాబోయే కూటమి ప్రభుత్వ సహాయంతో బాధ్యత తీసుకుంటా. నన్ను మీ ఇంటి ఆడబిడ్డగా..గొట్టిపాటి వారసురాలిగా ఆదరించాలని అభ్యర్థించారు. పదవుల కోసం రాజకీయం చేసే కుటుంబం కాదని, వైద్య వృత్తిలో ఉన్న మా కుటుంబం దర్శిలో ఆసుపత్రి పెట్టి ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

మృతుల కుటుంబాలకు న్యాయం చేస్తాం

ఈ వైసీపీ ప్రభుత్వం అవినీతి, అక్రమాలు మీ అందరికీ తెలుసు. కొవిడ్‌ సమయంలో కురిచేడులో జరిగిన ఘటన నాకు ఇప్పటికీ గుర్తొస్తుంది. మద్యం రేట్ల పెంపుదలతో వ్యవసాయ కూలీలు, చిన్నచిన్న పేద కుటుంబాల వారు స్పిరిట్‌ తాగి 16 మంది మృతిచెందారు. వారికి కనీసం నష్టపరిహారం చెల్లించడంలో జగన్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందన్నారు. పేరుకు పేదల ప్రభుత్వమని చెప్పుకుంటూ ఇసుక మద్యం మట్టి ఆక్రమ వ్యాపారం పేరుతో వారు దోచుకుని దాచుకున్నారు. పేదల సమస్యల వారికి పట్టవు. అదే సమయంలో వైజాగ్‌లో ఫార్మా కంపెనీలో లీకేజ్‌ జరిగితే అక్కడ చనిపోయిన కార్మికులకు ఆ కార్పొరేట్‌ సంస్థ ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఇచ్చింది. కానీ, ఈ 16 మంది పేదలకు ఒక రూపాయి కూడా ఈ ప్రభుత్వం చెల్లించలేదు. వారికి అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని తెలిపారు. సాగునీటి సమస్య పరిష్కారానికి కూడా నా వంతు నేను కృషి చేస్తానని, లిఫ్ట్‌ ఇరిగేషన్లు, విద్యుత్‌ కోతల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అందుకే కూటమి ప్రభుత్వా న్ని ఆదరించి ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.