రైతులను ఆదుకుంటాం

-పంట నష్టం అంచనాలను త్వరితగతిన పూర్తి చేయండి
-సమస్యలు విన్నాను.. మీకు నేనున్నానంటూ భరోసా
-ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

వరద వల్ల దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం అన్నిరకా లుగా ఆదుకొంటుందని రైతులకు నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య హామీ ఇచ్చారు. మంగళవారం ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం తోటరావులపాడు,చింతలపాడు, ఏటూరు గ్రామాల్లో సౌమ్య పర్యటించారు.

ముంపునకు గురైన పంట పొలాలను సందర్శించి రైతులను పరామర్శించారు. మండలంలోని ప్రజలను, రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. వరద ముంపు వల్ల ఆవులు, గేదెలకు పచ్చ, ఎండు గడ్డి కరువైందని, దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తరఫున సిద్ధం చేసిన టీఎంఆర్‌ను పశుసంవర్ధక శాఖ అధికారులు అందజేయనున్నట్లు తెలిపారు. భారీ వర్షాలు,వరద ఫలితంగా ప్రజలు, రైతాంగం తీవ్రంగా నష్టపోయారని, రైతులు అధైర్య పడవద్దని పంట నష్టం అంచనా వేసి పూర్తిస్థాయి పరిహారం అందజేయాలన్నారు.

నివేదికను ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సీఎం చంద్రబాబు, కలెక్టర్‌కు అందజేసి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.