మెదక్‌లో కాంగ్రెస్‌ను గెలిపిస్తేనే సంక్షేమ రాజ్యం

బీజేపీ, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఇద్దరూ దొంగలే
కేసీఆర్‌ పదేళ్లలో కానిది 100 రోజుల్లో చేశాం
మంత్రి కొండా సురేఖ

పటాన్‌చెరువు, మహానాడు: పటాన్‌ చెరులోని రామచంద్రాపురంలో ఎన్‌ఎస్‌యుఐ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన మెదక్‌ పార్లమెంట్‌ ఎన్నికల సన్నాహక సమావేశంలో కాంగ్రెస్‌ కార్యకర్త లను ఉద్దేశించి మంత్రి కొండా సురేఖ దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్‌ పార్టీని గెలిపిస్తేనే సంక్షేమ రాజ్యం వస్తుందన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తొమ్మిదన్నరేళ్లలో చేయలేని పనులను కాంగ్రెస్‌ ప్రభుత్వం వంద రోజుల్లోనే చేసి చూపిందని అన్నారు. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌రావులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హతే లేదన్నారు. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ అవినీతి, అక్రమాల కారణంగా మేడిగడ్డ ప్రాజెక్టులో పగుళ్లు ఏర్పడి నీళ్లు నిల్వ చేయలేని పరిస్థితి తలెత్తిందని విమర్శించారు.

కాంగ్రెస్‌ పాలనలో కట్టిన ప్రాజెక్టులను చూసి బిఆర్‌ఎస్‌ బుద్ది తెచ్చుకోవాలని సూచించారు. మెదక్‌ పార్లమెంటు కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్‌ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. మెదక్‌ పార్లమెంటు బిఆర్‌ఎస్‌ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి భూ కబ్జాలకు పాల్పడిన భూ బకాసురు డు అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌, మెదక్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్‌, చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, నిర్మలా జగ్గారెడ్డి, జిల్లా ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడు కొల్లూరి నరసింహారెడ్డి, అసెంబ్లీ ఇన్‌చార్జ్‌ వినయ్‌గౌడ్‌, ఎంపీపీ రవీందర్‌ గౌడ్‌, బొల్లారం మున్సిపల్‌ చైర్మన్‌ అంతిరెడ్డి గారి అనిల్‌ కుమార్‌, పీసీసీ మెంబర్లు, బ్లాక్‌ కాంగ్రెస్‌, మండల ప్రెసిడెంట్‌ శ్రీకాంత్‌ రెడ్డి, నాయకులు శ్రీశైలం, రవీందర్‌, నారాయణరెడ్డి, ఎన్‌ఎస్‌యుఐ సభ్యులు, యూత్‌ కాంగ్రెస్‌ సభ్యులు, మహిళా కాంగ్రెస్‌ సభ్యులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.