-ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నా స్పందించారా?
-విద్యాశాఖ మీ దగ్గరే ఉందిగా దోపిడీ కనిపించలేదా?
-స్కూళ్ల నుంచి ఏమైనా కమీషన్లు దండుకుంటున్నారా?
-హామీలు నెరవేర్చడానికి మూడునెలలు చాలు
-బీజేపీ అధికారి ప్రతినిధి రాణిరుద్రమదేవి చురకలు
హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం పార్టీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ దేవి మీడియా సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డిపై మండిపడ్డారు. విద్యాసంవత్సరం మొదలవుతున్నా ఫీజుల రెగ్యులేషన్ కమిటీ ఏర్పాటు చేస్తామని చేయలేదు. విద్యాశాఖ మీ వద్దే ఉంది.. ఈ రోజు వరకు ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. చిన్నపిల్లలకు కూడా 3 నుంచి 4 లక్షలు తీసుకుం టున్నారు. ఫీజులు ఇష్టం వచ్చినట్లు వసూలు చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లే అనుకోవాలి. లేదంటే స్కూళ్ల నుంచి మీకేమైనా కమీషన్లు వస్తున్నాయా? అని నిలదీశారు.
హామీల అమలుకు మూడు నెలలు చాలు
విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని చెప్పారు..ఇంతవరకు ఆ చర్యలే లేవు. విద్యార్థుల కు మంచి చదువు, మంచి గురువులను అందించనప్పుడు నాణ్యమైన చదువును ఎలా అందిస్తారు? రెసిడెన్షియల్ స్పోర్ట్స్ స్కూల్ కడతామని చెప్పారు..ఎక్కడైనా కట్టారా? యూత్ కమిషన్ ఏర్పాటు చేసి 10 లక్షలు రుణాలు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదు. అంగన్‌వాడీ టీచర్లకు 10 వేలు ఇస్తా అన్నారు.. ఇస్తున్నారా? ఎన్నికల హామీలు నెరవేర్చే అంతవరకు విద్యాసంవత్సరం ఆగుతుందా? ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి 3 నెలలు చాలు..కానీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. తెలంగాణాలో 30 వేలు స్కూళ్లు ఉన్నాయి. అందులో సరైన సదుపాయాలు, కంప్యూటర్లు లేవు..ఎట్లా చదువును డెజిటలైజేషన్ చేస్తారు? అని ప్రశ్నించారు. టీచర్ల నియామకం త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.