-రవ్వంత రుణమాఫీ చేసి కొండంత డబ్బా కొట్టుకున్న ముఖ్యమంత్రి
-రైతుల మీద నాన్ బెయిలబుల్ కేసులు
-రెండు లక్షల రుణమాఫీ చేశామని ముఖ్యమంత్రి చెప్తున్నారు
-కానీ వ్యవసాయ శాఖ మంత్రి మాత్రం ఇంకా రుణమాఫీ కావాల్సి ఉందన్నారు
-సాంకేతిక అంశాల ఆధారంగా రుణమాఫీ జరగలేదని ఉత్తంకుమార్ రెడ్డి చెప్తున్నారు
-ముఖ్యమంత్రి, మంత్రులు రకరకాలుగా మాట్లాడిన వీడియోలను మీడియాకు చూపించిన కేటీఆర్
-ఈ ప్రభుత్వానికి రుణమాఫీ పైన స్పష్టత ఉందా? లేదా?
-నాకు ఫామ్ హౌస్ లేదు. .నా ఫ్రెండ్ ఫామ్ హౌస్ ను లీజు తీసుకున్నా
-ఒక వేళ ఆ ఫామ్ హౌస్ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కూల్చేయండి
-తెలంగాణ భవన్ లో కేటీఆర్
హైదరాబాద్: అధికారంలోకి వచ్చిన రోజే రూ. 2 లక్షల రుణమాఫీ అంటూ ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారు. ఇప్పటికైనా మేము రుణమాఫీ చేయలేకపోయాం. మా వల్ల కాలేదని చెబుతారని అనుకున్నాం. రుణమాఫీ బూటకం, పచ్చి దగా, పచ్చి మోసం. రవ్వంత రుణమాఫీ చేసి కొండంత డబ్బా కొట్టుకున్న ముఖ్యమంత్రి బండారం 70 లక్షల మంది రైతుల సాక్షిగా బట్టబయలైంది.
వ్యవసాయ శాఖ మంత్రి ఏమో రూ. 2 లక్షలు మాఫీ చేశాం అంటూ ప్రకటన చేశారు. కానీ కొన్ని పత్రికలు రుణం పూర్తిగా మాఫీ కాలేదంటూ వార్తలు రాశాయి. జరిగింది రుణమాఫీ కాదు…పెట్టింది రైతులకు టోపీ. ఎక్కడికక్కడ తెలంగాణ వ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తున్నారు.
బ్యాంకులను ముట్టడిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టు తిరుగుతున్నారు.రైతులకు రుణమాఫీ చేశామని ప్రభుత్వం చెప్పుకుంది.కానీ జరిగింది మోసం. రుణమాఫీ జరగలేదు. మాకెందుకు రుణమాఫీ జరగలేదని రైతుల రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేస్తున్నారు. రుణమాఫీ కాలేదు కనుక రాష్ట్ర వ్యాప్తంగా రణరంగంగా మారిన పరిస్థితి. ఆదిలాబాద్ జిల్లాలో తలమడుగు మండలం లో బజార్ హత్నూర్ లో రైతుల పై కేసులు పెట్టి వేధిస్తున్నారు.
ఏ పార్టీ ప్రేరేపించకుండా రైతులు ఆందోళన చేస్తున్నారు. రుణమాఫీ జరగలేదని ఆందోళన చేస్తే రైతులకు ఏడు సంవత్సరాలు జైలు శిక్ష పడేలా కేసులు పెట్టి వేధిస్తుంది ఈ ప్రభుత్వం. రైతుల మీద నాన్ బెయిలబుల్ కేసులు పెడుతుంది. రెండు లక్షల రుణమాఫీ చేశామని ముఖ్యమంత్రి చెప్తున్నారు. కానీ వ్యవసాయ శాఖ మంత్రి మాత్రం ఇంకా రుణమాఫీ కావాల్సి ఉందంటాడు.
ముఖ్యమంత్రికి మంత్రులకు అసలు సయోధ్య లేదు. మనిషికి ఒక్క మాట మాట్లాడుతున్నారు. రుణమాఫీ వట్టిదే అని మంత్రుల మాటలతో తేలిపోయింది. సాంకేతిక అంశాల ఆధారంగా రుణమాఫీ జరగలేదని ఉత్తంకుమార్ రెడ్డి చెప్తున్నారు. సాంకేతిక కారణాలు ఏమీ లేవు. రుణమాఫీ ఎగ్గొట్టేందుకే ఇలా కారణాలు చెబుతున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు రకరకాలుగా మాట్లాడిన వీడియోలను మీడియాకు చూపించిన కేటీఆర్. రుణమాఫీ చేసింది పావు శాతం. కానీ రైతులను వంద శాతం మోసం చేశారు.
ఈ మూర్ధున్ని క్షమించమని తెలంగాణ తల్లిని వేడుకోవాలని కోరుతున్నా. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 12,000 కోట్లు ఇంకా ఇవ్వాల్సి ఉందంటున్నారు. ఏడున్నర వేల కోట్లు మాత్రమే రైతుల ఖాతాలకు చేరిందని మీ ఉపముఖ్యమంత్రే చెబుతున్నారు. అసలు ఈ ప్రభుత్వానికి రుణమాఫీ పైన స్పష్టత ఉందా? లేదా? రైతులకు ఇచ్చింది ఎంతో కనీసం ప్రభుత్వానికి, మంత్రులకు తెలుసా? లేదా?
రైతు స్వరాజ్యమంటూ కాంగ్రెస్ పెద్ద ఎత్తున చేసుకున్న ప్రచారం నిజం కాదు. రైతు రాజ్యం పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు అదే రైతులను ఏడిపిస్తూ మోసం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ చేసిన మోసానికి నిరసనగా రేపు రైతులు ధర్నా చేస్తున్నారు. కాంగ్రెస్ డ్రామాలు ఇక నడవవు. రుణమాఫీ పూర్తిగా ఎప్పుడు చేస్తారో చెప్పాలి.
రుణమాఫీ విషయంలో ఈ ప్రభుత్వానికి క్లారిటీ ఉందా? మొత్తంగా వీళ్లందరి మాటలు వింటే జరిగింది పావు శాతం రుణమాఫీ కూడా లేదని తేలిపోయింది. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయమన్నందుకు ముఖ్యమంత్రి మాట్లాడిన బజారు భాషకు వ్యతిరేకంగా, తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసి రేపటి ధర్నాను ప్రారంభించాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి. రుణమాఫీ పైన కాంగ్రెస్ పార్టీ డ్రామాలు ఇక నడవవు. బీఆర్ఎస్ పార్టీ రైతుల వెంట ఉన్నంతసేపు రైతులను మీరు మోసం చేయలేరు. ఎలాంటి ఆంక్షలు లేకుండా ఎప్పటిలోగా మీరు రుణ మాఫీ చేస్తారో ఈ ప్రభుత్వం చెప్పాలి.
మేము గతంలో రుణమాఫీ చేసినప్పుడు, రైతుబంధు వేసినప్పుడు ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు. కేసీఆర్ పాలనలో రైతుల ఆత్మహత్య లు పెద్ద ఎత్తున తగ్గినయ్. కేసీఆర్ వ్యవసాయ స్థిరీకరణ కోసం ఎరువులు ఇచ్చినం, పెట్టుబడి సాయం, కరెంటు ఉచితంగా ఇచ్చారు. పన్నులు కూడా రద్దు చేసి… రైతుకు అన్ని రంగాల్లో కేసీఆర్ అండగా నిలబడ్డారు. అందుకే పంజాబ్ లాంటి రాష్ట్రాలను తలదన్ని వ్యవసాయ రంగంలో తెలంగాణ అగ్రగ్రామిగా నిలిచింది.కానీ మీరు వచ్చిన తర్వాత వ్యవసాయంగానికి రైతాంగానికి అన్ని రకాలుగా నష్టం చేస్తున్నారు.
రైతు రుణమాఫీకి సంబంధించి క్షేత్రస్థాయిలో మేము కూడా పరిశీలన చేశాం.ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్ నుంచి సమాచారం తెప్పించుకున్నా. కొడంగల్ లోని కోస్గి మండలంలో ఐదు బ్యాంకుల్లో 20, 239 బ్యాంకు అకౌంట్ లోని రైతులకు గాను కేవలం 8, 527 మందికి మాత్రమే రుణమాఫీ అయ్యింది. ముఖ్యమంత్రి చెప్పిన మాటలు అన్ని మోసాలేనని ఇక్కడే అర్థమవుతుంది. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో రైతులకు జరిగిన మోసం ఇది.వీళ్ళందరి డొల్ల మాటలు వింటే రైతు రుణమాఫీ జరిగింది పావు శాతం. రైతులకు మోసం మాత్రం 100 శాతం జరిగింది. ఇదే కథ ప్రతి ఊరిలో, ప్రతి గ్రామంలో ఉంది.
రుణమాఫీ లో పాస్ బుక్ లో పేర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపన్ను దాఖలు చేయటం, రేషన్ కార్డు వంటి కారణాలు చెప్పి అనేక కుంటి సాకులు చెబుతూ ఈ ప్రభుత్వం ఆంక్షలు పెడుతోంది. రుణమాఫీకే ఇన్ని సాకులు చెబుతున్న ప్రభుత్వం రైతుబంధుకు ఇంకా ఎన్ని ఆంక్షలు పెడుతారో…? ఇది మోసకారుల ప్రభుత్వము. దగా ప్రభుత్వం. 49,500 కోట్ల రూపాయల తో మొదలైన రుణమాఫీ ప్రక్రియ ఈ రోజు 7, 500 కోట్లకు చేరింది. 7, 500 కోట్ల సాయంతోనే రుణమాఫీని ముగించే కుట్ర ఈ ప్రభుత్వం చేస్తోంది.
డిసెంబర్ లో 49 వేల కోట్లు, జనవరిలో 40,000 కోట్లు.. జులై వచ్చేసరికి రూ. 31 వేల కోట్లు చేరింది.బడ్జెట్ కి వచ్చే సరికి 26 వేల కోట్లు… చివరికి 17 వేల కోట్లు అని చెప్పి… ఇప్పుడు 7, 500 కోట్లు మాత్రమే రైతులకు అందించారు. ఈ కోతల రాయుడు ప్రభుత్వాన్ని ఎండగడతాం. లక్షలాదిమంది రైతులను మోసం చేసిన ప్రభుత్వం పైన చీటింగ్ కేసు నమోదు చేయాలి.70 లక్షల మంది రైతులను మాయమాటలతో మభ్యపెట్టి తడి గుడ్డతో రేవంత్ రెడ్డి గొంతు కోస్తున్నాడు.
వంద శాతం రుణమాఫీ చేసి ఉంటే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఎందుకు ఆందోళన చేస్తున్నారు.రైతులు ఆందోళనలో పక్కదారి పట్టించేందుకే ఈ సీఎం చిల్లరగా అటెన్షన్ డైవర్షన్ ప్రాక్టీస్ చేస్తున్నారు. కానీ మేము అటెన్షన్ డైవర్షన్ ను పట్టించుకోం. రైతుల కోసమే పోరాటం చేస్తాం.రైతులకు, వ్యవసాయ రంగానికి ఇచ్చిన అన్ని హామీలను రేవంత్ రెడ్డి తుంగలో తొక్కిండు. ఈ రైతు ద్రోహి ప్రభుత్వాన్ని వదిలిపెట్టకుండా… వెంటాడుతాం, వేటాడుతాం. అందుకే రేపటి నుంచి మొదటి అడుగు రైతు ధర్నాతో ప్రారంభిస్తాం.
కేవలం మీడియాను, హెడ్ లైన్స్ ను మేనేజ్ చేసి రైతు రుణమాఫీ నుంచి దృష్టి మరల్చాలని చూస్తున్నారు. డెడ్ లైన్లు, హెడ్డ్ లైన్లు మార్చుకుంటూ రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. రైతు రుణమాఫీ చేయలేని సన్నాసులమని ఈ ప్రభుత్వం ఒప్పుకోవాలి.రైతుల పైన కేసు పెట్టటం మంచి పద్దతి కాదు. వెంటనే కేసులను ఉపసంహరించుకోవాలి. రైతులపై కేసులు మానుకోకుంటే జైలు భరో కార్యక్రమానికి కూడా పిలుపు ఇస్తాం. లక్షలాది మంది రైతులు, మా పార్టీ కార్యకర్తలపై కేసులు పెడతారా? ఈ దగాకోరు సర్కార్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. తప్పకుండా రుణమాఫీ జరిగేదాకా కాంగ్రెస్ పార్టీని మేము వెంటాడుతాం.రైతులకు రేవంత్ రెడ్డి చేసిన చీటింగ్ పైన బీఆర్ఎస్ పార్టీ ఫైటింగ్ ఆగదు.
నేను అక్రమంగా ఏదైనా తప్పు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకోండి. బఫర్ జోన్ లో ఎవరి నిర్మాణాలు ఉన్న సరే కూల్చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా. తప్పు నేను చేసిన సరే…నాపై చర్యలు తీసుకోండి. నాకు ఫామ్ హౌస్ లేదు. నా ఫ్రెండ్ ఫామ్ హౌస్ ను లీజు తీసుకున్నాను.ఒక వేళ ఆ ఫామ్ హౌస్ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కూల్చేయండి. అదే విధంగా మంత్రులు, కాంగ్రెస్ నాయకుల నిర్మాణాలు కూడా కూల్చేయాలి. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల రాజభవనాలు కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయి. వాటిని కూాాడా కూల్చేయాలి.