( డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్)
సుప్రీం కోర్టులో ‘ తిరుమల లడ్డు కల్తీ ‘ పై దాఖలైన కేసులలో జరిగిన వాదనలు విన్నాక , 20 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ లో జరిగిన రైతుల ఆత్మహత్యలు గుర్తుకు వచ్చాయి.
అప్పట్లో నేను గుంటూరు వైద్య కళాశాలలో ఎంబిబిఎస్ చదువుతుండేవాడిని. ప్రతీ రోజూ పత్రికలలో రైతుల ఆత్మహత్యలు గురించిన వార్తలు వచ్చేవి. కొన్ని వేలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు… ముఖ్యంగా పత్తి రైతులు!
పత్తి కి పురుగు తాకిడి ఎక్కువగా ఉండేది. ఎన్ని పురుగు మందులు కొట్టినా పురుగులు చచ్చేవి కావు. ఎందుకంటే అవి నకిలీవి! ఈ నకిలీ పురుగు మందుల వలన ఒకవైపు పంటను పురుగులకు పెట్టి , మరొకవైపు ఖర్చులు పెరిగిపోవడం వలన … అప్పులు పాలయ్యారు. ఆ అప్పులు తీర్చలేక రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
నకిలీ పురుగు మందులు – ల్యాబ్ లలో నాణ్యతా పరీక్షలు :
రైతులు ధర్నాలు చేస్తేనో , ఆత్మహత్యలు చేసుకున్న ప్రాంతాలలో ‘ ఎరువుల షాప్ ‘ లలో వ్యవసాయ అధికారులు శాంపిల్ తీసేవారు . కొన్నిచోట్ల ముందస్తు సమాచారంతో నకిలీ మందులు దొరక్కుండా చేసేవారు , ఒక వేళ శాంపిళ్ళు తీస్తే … అవి అన్నీ నాణ్యతా పరీక్షలు పాస్ అయ్యేటట్లుగా ల్యాబ్ లలో మేనేజ్ చేసేవారు!
అందరూ శ్రీ వైష్ణవులే కానీ , బుట్టలో చేపలు మాయమైనట్లుగా ! ; పురుగుమందులు అన్నీ నాణ్యమైనవే అని రిపోర్టులు వచ్చేవి! కానీ పొలంలో పురుగు చావదు … అందరూ అప్పులు పాలయ్యారు! వేలాదిమంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారు.
నిజానికి సుప్రీం కోర్టు పరిభాషలో చెప్పాలంటే ‘ నకిలీ పురుగుమందులు వలన రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అనడానికి సాక్ష్యం లేదు!’ . కానీ పొలంలో పురుగు చావని మాట వాస్తవం.. రైతులు అప్పులు పాలైన మాట వాస్తవం … ఆత్మహత్యలు చేసుకున్నమాట వాస్తవం . దీనికి చరిత్రే నిలువెత్తు సాక్ష్యం !
అలాగే లడ్డు శాంపిల్ , నెయ్యి శాంపిల్ .. ఇతర సాక్ష్యాలు కూడా ! ప్రసాదం తిన్న వాడికి తెలుసు …. నాణ్యత సరిగా లేదని , రుచి బాగోలేదని , త్వరగా పాడవుతుందని … నిజానికి ఇప్పుడు భక్తుల వద్ద అప్పటి లడ్డు ల శాంపిళ్ళు లేవు! . టీటీడీ వద్ద అప్పటి లడ్డు శాంపిళ్ళు ఉండవు! మరి ఇంక లడ్డులలో నకిలీ నెయ్యి వాడినట్లు సాక్ష్యం ఎక్కడ నుండి వస్తుంది ?
సత్యం గెలవాలని , న్యాయం గెలవాలని కోరుకుంటున్నాను . ‘ కానీ సత్యం ‘ దానంతట అది గెలవదు … భక్తులు మరియు ప్రజాస్వామ్యవాదులు అందరూ కలిసి సత్యాన్ని గెలిపించాలి.