– స్వామికి సెక్యూరిటీ తీసేస్తారా?.. అపచారం.. అపచారం!
– సెక్యూరిటీ తీసేస్తే విశాఖ స్వామి భద్రత ఎలా?
– అవుట్‌పోస్టు సెక్యూరిటీ తీస్తే ఆశ్రమం ఏంకాను?
– బుగ్గకారు లేకుండా సాములోరు బయటకెలా వెళతారు?
– శంకరాచార్యులు శపించరూ?
– పరమేశ్వరుడు ఫీలవరూ?
– సాములోరి శక్తి సర్కారుకు తెలియదా?
– కనీసం హోంగార్డునూ ఇవ్వరా?
– తల్లడిల్లుతున్న స్వరూపానంద భక్తుల హృదయాలు
( మార్తి సుబ్రహ్మణ్యం)
జగద్రక్షకుడు.. జగన్రక్షకుడు.. జగద్గురువు.. జగన్గురువు.. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి విశాఖ ప్రతినిధి.. అపర శంకరాచార్యుడు.. పరమాచార్య అంశలో అవతరించిన కలియుగ ఆదిదేవుడికి.. చంద్రబాబునాయుడు సర్కారు రక్షణ తొలగించింది. ఆయనకు కనీసం బుగ్గకారు కూడా లేకుండా చేసింది. చినముషిడివాడ ఆశ్రమం వద్ద అవుట్‌పోస్టు లేకుండా దానిని అనాధను చేసింది. వెధవది.. ఒక్క హోంగార్డు కూడా లేకుండా, ఆ కలియుగ దైవాన్ని తన మానాన తనను వదిలేస్తే ఎలా? ఇలా సాములోరిపై సీతకన్నేస్తే కోట్లాదిమంది ఆయన భక్తులు ఏమవుతారు? వారి మనోభావాలేమవుతాయి? పరమేశ్వరుడు ఫీలయి, శంకరాచార్యులు శపించరూ?!
భద్రత లేకుండా ‘కల్వకుంట్ల-జగన్గురువు’ బతకగలరా? ఐయ్యేఎస్సూ, ఐపియస్సూ, ఎమ్మెల్యే, మంత్రులతోనే సాష్టాంగ నమస్కారాలు చేయించుకునే సాములోరు, ఇకపై అవి లేకుండా ప్రశాంతంగా ధ్యానం చేసుకోగలరా? అన్యమనస్కంగా-అభద్రతతో ఆరాధిస్తే దేవుడు కనెక్టవుతాడా? కూటమి సర్కారుకు కనీసం ఆ పాటి హృదయం లేదా? జగన్ లాంటి సాధారణ వ్యక్తికి తన తపశ్శక్తులు ధారపోసి, ఆయనను సీఎం చేసిన అపర ‘విశాఖ విశ్వామిత్రుడి’కి, చంద్రబాబు సర్కారు ఇచ్చే విలువ ఇదేనా? బ్యాడ్.. వెరీ బ్యాడ్. ఇదీ.. విశాఖ పీఠాథిపతి స్వరూపానంద స్వామికి సెక్యూరిటీ, బుగ్గకారు తొలగించిన తర్వాత బద్ధలవుతున్న ఆయన భక్తుల హృదయ స్పందన.
తన శిష్యుడు పదవీభ్రష్టుడైన తర్వాత.. విశాఖ శారదాపీఠాథిపతి స్వరూపానందకు ఎక్కడ లేని కష్టాలొచ్చిపడ్డాయి. అవి మామూలు సినిమా కష్టాలు కాదు. పగవాడికి కూడా రానంత అవమాన దుఃఖసాగరం. ఎన్నికల ముందు వరకూ, పాలకుల తలరాత నిర్దేశించిన స్వరూపుల వారి తలరాత, ఫలితాల తర్వాత తారుమారయింది.
ఎన్నికల ముందువరకూ విశాఖ ఆశ్రమంలో, అన్నదానానికి ఆపన్నులు బారులు తీరినట్లు.. స్వామివారి సిఫార్సుల కోసం కొండవీటిచాంతాండ క్యూలు కట్టిన రాజకీయ-పవర్ భక్తులు, ఫలితాల తర్వాత భూతద్దం పెట్టి వెతికినా కనిపిస్తే ఒట్టు. అత్యుత్సాహం ప్రదర్శిస్తే ‘ఫలితం’ ఇలాగే ఉంటుందన్నది, సాములోరంటే గిట్టనివారి మాట.
అసలే వర్షం.. ఆపై వాన అన్నట్లు, సాములోరి ఆశ్రమానికి కాపలా ఉన్న ఖాకీ అబ్బాయిలను కూడా మీ సేవలిక చాలని, చంద్రబాబు సర్కారు తరిమేసిందట. అంతవరకూ అయితే బాగానే ఉండేది. అంతోటి సాములోరి బడాయితనానికి నెలకు లక్షల రూపాయలు బొక్కసానికి బొక్కెందుకన్నది సర్కారు ఆలోచన కామోసు!
నిన్నటి వరకూ సాములోరు దర్జాగా బెంజి బుగ్గకారులో రయ్ రయ్ మని సైరన్ వేసుకుని వెళుతుంటే, ముందొక పైలెట్ -వెనకొక ఎస్కార్టు కార్లతో వెలిగిపోయిన అయ్యవారి వైభోగం కూడా వెలవెలపోవడం విషాదం. వెనకటికి మాయలపకీరు, క్షుద్రశక్తుల లోగిళ్ల ముందు భైరవులు కాపలాకాసినట్లు.. ఆధునిక కాలంలో కావలికాసే పోలీసు అవుట్ పోస్టు కూడా నిర్దయగా ఎత్తేయటం విషాదాతివిషాదం.
శిష్యుడి కంటే గురువుకే ఘోర అవమానం కదా? పాలకులకు రాజగురువుగా ఉంటే, తదనంతర కాలంలో ఎన్ని అవమానాలు ఎదుర్కొంటారన్న దానికి.. సాములోరి స్టోరీ ఒక కేస్ స్టడీ. రాజగురువులుగా మారాలని ఆశపడే సాములోర్లకు ఇదో గుణపాఠం కూడా!
సాములోరికి పట్టిన ఈ దుర్గతికి ఆయన భక్తకోటి వగచివెక్కిళ్లు పెడుతోందట. తన త్రినేత్రంతో ముల్లోకాలను రక్షిస్తూ.. తన తపశ్శక్తితో ఒక సామాన్యుడిని అసామాన్యుడిని చేసిన స్వామి వారికి సెక్యూరిటీ ఇస్తే తప్పేంటి? పెద్ద స్వామి బుడ్డస్వామికి జమిలిగా చెరో ఇద్దరు గన్‌మెన్లు, విశాఖ ఆశ్రమం వద్ద ఒక ఏఎస్‌ఐ, నలుగురు కానిస్టేబుళ్లతో బందోబస్తు ఏర్పాటుచేస్తే పోయేదేముంది? సాములోరికి స్పెషల్ ప్లైటు, ఎయిర్‌పోర్టులో వితౌలుట్ చెకింగ్, లోపల ప్రత్యేక సౌకర్యాలు సమకూరిస్తే తప్పేంటి? వీటికి తిలోదికాలివ్వడం సర్కారుకు ఏమైనా భావ్యమా? ఏం.. సాములోర్లు ఎల్లకాలం రైళ్లలో ఫస్ట్‌క్లాస్, సెకండ్ క్లాస్ ఏసీల్లోనే తిరగాలా? స్పెషల్ ఫ్లైట్లలో తిరగకూడదా?
ఒక రాష్ట్రంపై తన అద్వితీయ శక్తులు ప్రసరించి, త్రినేత్రంతో కాపాడుతున్న సాములోరికి ఈ బుడ్డి బుడ్డి ఫెసిలిటీసు కూడా ఇవ్వడం నేరమా? సాములోరు ఎదిగితే రాష్ట్రం కూడా ఎదిగినట్లే కదా? పిల్లజమిందారులా ముందొక పోలీసు కారు- వెనుకొక పోలీసు కారు, మధ్యలో సాములోరు చిద్విలాసం చిందిస్తూ బుగ్గకారులో రయ్యిన పోతే మీకెందుకు కుళ్లు? అన్నది కోట్లాదిమంది స్వరూపానంద ఫ్యాన్స్ ప్రశ్న.
ఇవన్నీ చూసి గుండె రగిలిపోతున్న ఆయన అభిమానులు.. సామీ మీకెదురవుతున్న అవమానాలు చూడలేం. మీకెందుకీ ముదనష్టపు రాజకీయాలు? ఎంచక్కా రిషికేష్ ఆశ్రమంలోనే ఉండండి. ఇక ఇక్కడి రాకండి. వచ్చినా చేసేదేమీలేదు కదా? ఇకపై మీరు చెబితే విశాఖలో చిన్న గుడి పూజారిని కూడా మీ ఆశ్రమానికి పంపించరు. మీరొస్తే ఎండోమెంట్ కమిషనరు కూడా పైకి లేవరు. డిజిపి కాదు కదా.. కానిస్టేబులు కూడా కాళ్లు మొక్కరు. మనకెందుకు స్వామీ ఈ అవమానం? పోనీ చంద్రబాబుకు ముద్దుపెట్టి మంచిచేసుకుందామంటే, ఆయన ఈ ఓవరాక్షన్ ఒప్పుకోరాయె!
వీలైతే రిషికేష్‌లో.. ఆ రాష్ట్రంలోనే పాదయాత్ర చేయబోయే ఒక క్రైస్తవ యువనేతను కనిపెట్టి, ఆయనకు ముద్దులిచ్చి మీ తపశ్శక్తులు ధారపోసి.. అతగాడిని సీఎంగా మార్చి, ఇంకో జగన్‌ను తయారుచేయండి. తపశ్శక్తులు ధారపోయడం ఎలాగూ మీకు అలవాటే కదా? అని సాములోరి అవమాన గాయానికి, మంచిమాటలతో భక్తకోటి జాలిమ్‌లోషన్ పూస్తోందట.