తెలంగాణలో ఎస్సీ, ఎస్టీల డిక్లరేషన్ ఇంకెప్పుడు?

బీజేపీ తెలంగాణ ఎస్సీ మోర్చ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు బాషా 

హైదరాబాద్, మహానాడు :  తెలంగాణలో ఎస్సీ, ఎస్టీల డిక్లరేషన్ ఇంకెప్పుడు అమలు చేస్తారని బీజేపీ తెలంగాణ ఎస్సీ మోర్చ మాజీ రాష్ట్ర అధ్యక్షులు కొప్పు బాషా  తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హైదరాబాద్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీకి ఓట్లు సీట్లు తప్ప ప్రజా సంక్షేమం పట్టదన్నారు.

దళితులంటే మరీ చిన్న చూపు అని అన్నారు. 2023 ఆగస్టు నెలలో చేవెళ్లలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ నుంచి ఆ పార్టీ జాతీయ అధ్యకుడైన మల్లికార్జున్ ఖర్గెతో ప్రకటింప చేసిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ నేటికీ అమలుకు నోచుకోకపోవడం కనీసం ఆ వైపు ఆలోచించకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం హామీలు ఇచ్చి, ఎస్సీ, ఎస్టీ ల  ఓట్లను పొంది అధికారంలోకి వచ్చాక సమాజాన్ని మోసం చేస్తున్నారన్నారు.

అంబేద్కర్ అభయహస్తం పేరు మీద ప్రతి దళిత కుటుంబానికి ఇస్తానన్న 12 లక్షల రూపాయలను తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఎస్సీ కార్పొరేషన్ రుణాల సబ్సిడీని వెంటనే బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలన్నారు. ఎస్సీ రిజర్వేషన్ 18 శాతం పెంచాలని అదే దమాషాలో కాంట్రాక్టు ఉద్యోగాల్లో రిజర్వేషన్ కూడా కల్పించాలన్నారు. ఎస్సీ అసైన్డ్ భూములపై  ఎస్సీలకు శాశ్వత హక్కులు కల్పించాలన్నారు. అంతే కాకుండా చేవెళ్ల ఎస్సీ, ఎస్టీల డిక్లరేషన్ అమలు చేయాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొప్పు బాషా  డిమాండ్ చేశారు.