– లడ్డుపై జడివాన తప్పించుకుంటున్నారా?
– తెరపైకొచ్చిన భూమన, వైవీసుబ్బారెడ్డి
– కోర్టుకెక్కి ఎదురుదాడి మొదలెట్టిన సుబ్బారెడ్డి
– అయినా ఇప్పటిదాకా పత్తాలేని ధర్మారెడ్డి
– ఇంతకూ ధర్మారెడ్డి ఎక్కడున్నారు?
– తెరపైకి రావాలంటున్న వైసీపీ నేతలు
– ఇప్పటికీ టీటీడీలో కొనసాగుతున్న ఆయన వర్గీయులు
– ధర్మారెడ్డి వర్గీయులను బదిలీ చేయని కూటమి సర్కారు
– కొండపై ఇంకా ధర్మారెడ్డి రాజ్యాంగమే
– ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనే స్టార్ కాటేజీలు
– మీడియా, పారిశ్రామికవేత్తల చేతిలోనే పెంట్‌హౌస్ కాటేజీలు
– ఇప్పటికీ స్వాధీనం చేసుకోని టీటీడీ
– ధర్మారెడ్డి రాజ్యాంగాన్నే అమలుచేస్తున్న టీటీడీ
– భక్తుల ఆగ్రహం
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఏడుకొండల వాడి దయతో ‘కొండంత’ ఎత్తు ఎదిగిన అధికారి ఆయన. ముఖ్యమంత్రి మాట తప్ప మానవమాత్రుడెవరినీ లెక్కచేయని నైజం ఆ రెడ్డిగారిది. టీటీడీలో ఆయన చెప్పిందే వేదం. చేసిందే చట్టం. బోర్డు సభ్యులు ఉత్సవ విగ్రహాలు మాత్రమే. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరైనా ప్రశ్నిస్తే, వారికి సీఎంఓ నుంచి అక్షింతలు తప్పవు.
అప్పట్లో విపక్షాలు ‘రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం’ నడుస్తోందని ఆరోపించేవారు. అదే తిరుమలకొండపై, ‘ధర్మారెడ్డి రాజ్యాంగం’ నడిచేదన్న విమర్శలూ వినిపించకపోలేదు. మరి సర్వాధికారాలు చెలాయించిన, సదరు ధర్మారెడ్డి అనే అధికారి ఇప్పుడు ఎక్కడున్నారు? లడ్డు అపచారంపై హిందూ సమాజమంతా ఘొల్లుమంటుంటే, టీటీడీని వెలిగించిన అ ధర్మారెడ్డి ఏం చేస్తున్నారు? అప్పుడేం జరిగిందో ఇప్పుడు ఎందుకు పెదవి విప్పడం లేదు? తన వెలుగుకు కారణమయిన ‘జగన్నా’ధుడు కష్టాల్లో ఉంటే, ఆయనకు మద్దతుగా ఎందుకు బరిలోకి దిగడం లేదు? భయమా? లేక ఎవరైనా భయపెడుతున్నారా?.. ఇదీ ఇప్పుడు హాట్‌టాపిక్.
స్వామివారికి సరఫరా చేస్తున్న నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని.. స్వయంగా సీఎం చంద్రబాబునాయుడు నివేదిక, ఆధారంతో బయటపెట్టిన వైనం ఇంకా చర్చల్లో నానుతోంది. దానిపై హిందూ సమాజం రోడ్డెక్కి, జగన్ దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తోంది. ఈ ఘటనతో జగన్ ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
తర్వాత తాను క్రైస్తవుడినయినందున డిక్లరేషన్ ఇవ్వను. అసలు డిక్లరేషన్ ఎందుకివ్వాలి? ఇదేం దేశం? ఇదేం సెక్యురిజం అంటూ అటు బీజేపీపైనా విరుచుకుపడ్డారు. ఈ ఎపిసోడ్ మధ్యలో ఆయన, దళితులను తెరపైకి తీసుకువచ్చేందుకు చేసిన ప్రయత్నం పెద్దగా ఫలించలేదు. అదే వేరే విషయం.
కానీ.. నాటి వ్యవహారాలకు కేంద్రబిందువైన టీటీడీ మాజీ ఈఓ ధర్మారెడ్డి, ఇప్పటివరకూ పెదవి విప్పకపోవడం ఆశ్చర్యం. లడ్డు వ్యవహారంపై టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఇప్పటికే సుప్రీంకోర్టుకు వెళ్లగా, మరో మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి తిరుమల వెళ్లి, జ్యోతి వెలిగించి.. తప్పు చేసుంటే తాను నాశమయిపోవాలని ఎదురుదాడి చేశారు. అంటే వైసీపీకి సంబంధించి ఎదురుదాడి బలంగానే జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది.
కానీ ఇన్ని వివాదాలకూ మూలవిరాట్టయిన ధర్మారెడ్డి మాత్రం, ఈ ఎపిసోడ్‌లో ఒక్కసారి కూడా తెరపైకి రాకపోవడం వైసీపీ వర్గాలను సైతం విస్మయపరుస్తోంది. తాను ఎలాంటి తప్పు చేయలేదని కనీస ప్రకటన కూడా విడుదల చేయకపోవడమే వింత. సుబ్బారెడ్డి,భూమనతోపాటు ధర్మారెడ్డి కూడా తెరపైకి వస్తే, పార్టీ వాదనకు మరింత బలం చేకూరుతుందన్నది వారి వాదన. కానీ ధర్మారెడ్డి ఇప్పటిదాకా పత్తా లేకపోవడం, కనీసం ప్రకటన కూడా విడుదల చేయకపోవడంతో.. ఆయనపై మరిన్ని అనుమానాలకు సహజంగానే అవకాశం ఏర్పడింది.
అయితే.. లడ్డు వ్యవహారంపై టీవీ డిబేట్లలో పాల్గొని, నాటి పాలనపై విరుచుకుపడుతున్న వారికి ఆయన ఫోన్లు, మెసేజ్‌లు పంపించి.. తన తరఫున మాట్లాడమని, తనకు సాయం చేయమని అభ్యర్ధించినట్లు సమాచారం. టీటీడీని కంటిచూపుతో శాసించి, ఎవరినీ లెక్కచేయని ధర్మారెడ్డి.. ఇప్పుడు బేలగా మారి డి బేట్లలో పాల్గొనే ప్రముఖులను సాయం కోరడమే ఆశ్చర్యం.
అసలు ధర్మారెడ్డి ఇప్పుడు దేశంలోనే ఉన్నారా? అంటే తన గ్రామమమైన నంద్యాలలోనే ఉన్నారా? లేక అమెరికాలోని కుమార్తె దగ్గరకు వెళ్లారా? అదీకాకపోతే కూటమి సర్కారు తనపై చర్యల కొరడా ఝళిపించకుండా ఉండేందుకు, ఢిల్లీలో తన పలుకుబడి వినియోగించే పనిలో ఉన్నారా? అన్న చర్చ జరుగుతోంది. ప్రత్యేక దర్శనాలు- లడ్డు ప్రసాదంతో ఆయన న్యాయ, అధికార వ్యవస్థల్లో విపరీతమైన పలుకుబడి సంపాదించారన్న ప్రచారం తెలిసిందే.
లడ్డులో అపచార అంశం తెరపైకి వచ్చినప్పటినుంచి, ధర్మారెడ్డి తెరపైకి రాకపోయినప్పటికీ.. టీటీడీలో ఏం జరుగుతోందన్న దానిపై, ఎప్పటికప్పుడు సమాచారం అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆయన హయాంలో పనిచేసిన అధికారులు, ఏరికోరి తెచ్చుకున్న అధికారులు ఇంకా టీటీడీలోనే పనిచేస్తుండటం ధర్మారెడ్డికి వరంగా మారింది. నిజానికి అధికారం మారిన వెంటనే, టీటీడీలో నాటి అధికారులందరినీ సమూలంగా మారుస్తారన్న ప్రచారం జరిగింది. కానీ ఇప్పటివరకూ అలాంటిదేమీ లేకపోవడం, సుబ్బారెడ్డి-భూమన-ధర్మారెడ్డికి వరంగా మారింది. ప్రధానంగా ఉద్యోగ సంఘ నేతలు కొందరు, వారితో టచ్‌లో ఉన్నట్లు కొండపై ప్రచారం జరుగుతోంది.
ధర్మారెడ్డి పదవీ విరమణ చేసినందున, ఇప్పుడు ఆయను స్వేచ్ఛాజీవి. కాబట్టి ఎవరికీ భయపడాల్సిన పనిలేదు. అలాంటప్పుడు, తన హయాంలో ఏం జరిగిందో తెరపైకి వచ్చి చెప్పేందుకు, ఎందుకు జంకుతున్నారన్నది ప్రశ్న. దానితో ఆయనను ఎవరైనా భయపెడుతున్నారా? అన్న సందేహాలు సహజంగానే తెరపైకి వస్తున్నాయి.
అయితే ధర్మారెడ్డికి భయపెట్టడమేగానీ, భయపడటం తెలియదని టీటీడీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన ఈఓగా ఉన్నప్పుడు.. టీటీడీపై వ్యతిరేకంగా వార్తలు రాసిన విలేకరుల వాహనాల్లో, గంజాయి పెట్టించి మరీ అరెస్టు చేయించేవారన్న ప్రచారం ఉండేది. అలా ఓ విలేకరి అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వైనాన్ని గుర్తు చేస్తున్నారు. తనకు వ్యతిరేకంగా వార్తలు రాసే మీడియాను, రెడ్డిగారు కొండపైకి సైతం రానిచ్చేవారు కాదట. చాలామంది స్థానిక విలేకరులకు కొండపైన షాపులు, ఇతర వ్యాపారాలు ఉన్నందున.. వాటిని తొలగిస్తామని భయపెట్టేవారన్న ఆరోపణలుండేవి.
అదేవిధంగా.. కొండపై కాటేజీల నిర్మాణాలకు సంబంధించి ప్రవేశపెట్టిన ‘ధర్మారెడ్డి రాజ్యాంగాన్ని’, కూటమి ప్రభుత్వం రద్దు చేస్తుందని చాలామంది భావించారు. అంటే మీడియా అధిపతులు, పారిశ్రామికవేత్తలు తిరుమలపై నిర్మించిన కాటేజీల పై స్టార్ హోటల్ స్థాయి పెంట్‌హౌసులను టీటీడీ స్వాధీనం చేసుకుంటుందని భక్తులు ఆశించారు.
గతంలో ఎవరైనా భక్తులు కొండపై కాటేజీలు నిర్మిస్తే, వారికి ఏడాదికి ఇన్నిరోజులు దర్శనం-వసతి సౌకర్యం కల్పించే నిబంధన ఉండేది. ఆ కాటేజీల నిర్వహణ టీటీడీనే చూసుకునేది. కానీ ధర్మారెడ్డి ఈఓగా వచ్చిన తర్వాత దానిని మార్చేశారు.
కోట్లాదిరూపాయలతో స్టార్ హోటల్‌ను తలదన్నేలా నిర్మించిన ఆ కాటేజీల పెంట్ హౌస్‌లపై.. టీటీడీ అజమాయిషీ ఉండకుండా, దాతల ఇష్టానికే వదిలిపెట్టడం విమర్శల పాలయింది. ఆ పైన ఉన్న ఫోర్ల నిర్వహణ అంతా దాతలకే విడిచిపెట్టింది. ఫైవ్ స్టార్ హోటళ్లను తలదన్నేలా నిర్మించిన వాటిని వీవీఐపీల సొంతానికి ఇవ్వడం ద్వారా, సదరు దాతలు.. తమ వ్యాపార సంబంధాలు మెరుగుపరచుకునేందుకు, ఆ కాటేజీలు పనికివస్తున్నాయి.
అంటే ఆ ఫైవ్‌స్టార్ కాటేజీలు ఎవరికి ఇవ్వాలన్న దానిపై, టీటీడీ పెత్తనం ఉండదన్నమాట. వాటి నిర్వహణ, దానిని ఎవరికి ఇవ్వాలన్న దానిపై టీటీడీ జోక్యం ఉండదు. దాతలు ఏడాది పొడవునా తమకు నచ్చిన వారికి ఇచ్చుకోవచ్చు. అసలు తిరుమల కొండపై ప్రైవేటు వ్యక్తుల పెత్తనం- ఆస్తులు ఉండకూడదు. అంతా శ్రీవారికే చెంది తీరాలి.
కానీ స్టార్ కాటేజీలు మాత్రం.. పారిశ్రామికవేత్తల పెత్తనానికే వ దిలివేయడంపై, భక్తుల్లో ఆగ్ర హం వ్యక్తమవుతోంది. ధర్మారెడ్డి వెళ్లిపోయి, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ.. ఇంకా ఆ స్టార్ హోటల్ కాటేజీ పెంట్‌హౌసుల నిర్వహణను, టీటీడీ స్వాధీనం చేసుకోకపోవడంపై భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అంటే ధర్మారెడ్డి రాజ్యాంగాన్నే ఇంకా అమలుచేస్తున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.