Mahanaadu-Logo-PNG-Large

వరి పంటకు క్వింటాకు రూ.500 బోనస్ ఏదీ?

-కాంగ్రెస్ బోనస్ పెద్ద బోగస్
-ఈ సీజన్ నుంచే అన్ని రకాల వడ్లకు 500 చొప్పున బోనస్ చెల్లించాలి
-మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో ఎన్నికల హామీని తుంగలో తొక్కింది. నిరుద్యోగులకు నెలకు 4,000 రూపాయల భృతి ఇస్తామని హామీ ఇచ్చి, మేమా మాట అనలేదని అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, నేడు వడ్లకు బోనస్ ఇచ్చే విషయంలో కూడా పచ్చి అబద్ధం ఆడి, రైతులను మోసం చేశారు.

రైతులు పండించిన వరి పంటకు క్వింటాకు రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల్లో భాగంగా హామీ ఇచ్చింది. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మారుస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు తాము పండించిన పంటను అమ్మకానికి సిద్ధపడి బోనస్ కోసం ఎదురు చూస్తుండగా, వారందరి ఆశలు అడియాసలు చేస్తూ కేవలం సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని, అది కూడా వచ్చే సీజన్ నుంచి ఇస్తామని మంత్రులు ప్రకటించడం అత్యంత బాధాకరం.

తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 90 శాతం దొడ్డు రకం వడ్లనే పండిస్తారు. పది శాతం పండే సన్న వడ్లకు మార్కెట్లో మంచి డిమాండు ఉంటుంది. సన్న వడ్లకు మద్దతు ధర కంటే చాలా అధికంగా మార్కెట్లో ధర వస్తుంది. కానీ దొడ్డు రకం బియ్యానికే గిట్టుబాటు ధర రాదు. కాబట్టి బోనస్ ఇవ్వాల్సింది దొడ్డు రకం వడ్లకే. అలా కాకుండా కేవలం సన్న రకాలకే బోనస్ ఇస్తాం, అదీ వచ్చే సీజన్ నుంచి ఇస్తామనడం రైతులను దగా చేయడమే.

తాజాగా మంత్రుల ప్రకటనతో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల సంక్షేమం పట్ల, వ్యవసాయాభివృద్ధి పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదని స్పష్టమైపోయింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అధికారంలోకి రావాలనే దురుద్దేశంతో ఇచ్చినవే తప్ప రైతుల మేలు కోసం చేసే కార్యక్రమాలు కావని తేలిపోయింది. ఎకరానికి రూ.15,000 రైతు భరోసా సాయం ఇస్తామని, వ్యవసాయ కూలీలకు 12వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తామనే హామీలను కూడా ప్రభుత్వం ఇప్పటి దాకా అమలు చేయని విషయాన్ని ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నాను. రెండు లక్షల రూపాయల రుణమాఫీ గురించి కూడా వాయిదాలు పెట్టడమే తప్ప నేటి వరకు అమలు చేసింది లేదు.

కేవలం సన్న వడ్లకే బోనస్ ఇస్తామనే ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ సీజన్ నుంచే అన్ని రకాల వడ్లకు 500 చొప్పున బోనస్ చెల్లించాలని రైతుల పక్షాన ప్రభుత్వాన్ని కోరుతున్నాను.