(భోగాది వేంకట రాయుడు)
పత్రికలు, మీడియా లో ( సాక్షి కాదు ) కొన్ని గమ్మత్తయిన విశేషాల్లాంటి వార్తలు వస్తున్నాయి. మైనింగ్ శాఖ ఎం డీ వేంకట రెడ్డి కనపడడం లేదట. ఆ మధ్య కనిపించకుండా పోయిన నరసాపురం ఎంపీడీఓ కోసం పోలీసులు రైలు పట్టాలు, కాలువలు వెదికినట్టు, ఈ వేంకట రెడ్డి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెదుకుతున్నదట.
“మాచర్ల గాంధీ ” పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు 50 రోజుల నుంచి కనపట్టం లేదట. “రాయలసీమ రత్నాలు ” లాటి కొంతమంది ఇప్పటికే పరారయ్యారట. గన్నవరం మాజీ ఎంఎల్ఏ వల్లభనేని వంశీ కనపట్టం లేదంట. పోలీసులు వెదుకుతున్నారంట. గుడివాడ లో గెడ్డం గ్యాంగ్, ఆ గ్యాంగ్ లీడరు పరారంట. ఎక్కడా కనపట్టం లేదంట.
అన్నట్టు, ఐ & పీ ఆర్ కమిషనర్ లాటి “కనకపు సింహాసనం ” పై ఐదేళ్లపాటు కూర్చున్న విజయకుమార్ రెడ్డి అనే “మేలు జాతి సింహం ” చెప్పా చెయ్యకుండా పరారై పోయాడట.
ఏంటీ వైపరీత్యం? ఎందుకిలా పరారై పోతున్నారు?
సమాజం పట్ల అన్యాయాలు, అక్రమాలు, అరాచకాలు, దౌర్జన్యాలు, అక్రమ సంపాదనలు,దోపిడీ పర్వాలకు పాల్పడ్డారా? అమానవీయ అఘాయిత్యాలు చేశారా? ఎందుకు? ఎవర్ని చూసుకుని?
“జగన్” అనే అతన్ని చూసుకునా!? ఎన్ని ఘోరాలూ…. నేరాలకు పాల్పడినా…. ఆయన ఏమీ అనడు అనా…? ఆయన ఏమీ అనడు కాబట్టి పోలీసులూ ఏమీ అనరు అనా….? పైపెచ్చు తమను ఎవడైనా ఏమైనా అంటే…. పోలీసులే తీసుకొచ్చి…. కుళ్లాబొడిచి, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి లోపలేసేస్తారు అనే భరోసా? అందుకనే ; కడుపుకు అన్నం తినే మనుషులు ఎవరూ చేయడానికి సాహసించని “ఈ” పనులన్నీ…. నిర్లజ్జ గా, నిస్సిగ్గుగా, నిర్మొహమాటం, నిర్భీతి గా సమాజం పై బిళ్ళబీటు గా పడిపోయి చేసేశారా? పౌర సమాజం తమను చూసి ఏమనుకుంటుందో అన్న స్పృహ కూడా లేకుండా చేసేశారా?
ఇవన్నీ ఎవరిని చూసి చేశారు? అవన్నీ అంత దర్జాగా చేసినప్పుడు లేని భయం ఇప్పుడు ఎందుకు? ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ని చూసి చేశారా? లేకపోతే, ఆయన “దుస్సలహా”దారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అండ చూసుకుని చేశారా? లేకపోతే, వారి చుట్టూ కమ్మేసిన “రెడ్డి త్రయా”న్ని చూసి చేశారా?
వాళ్ళు ఇలా చేయమని చెప్పి, ప్రోత్సాహించారా? జగన్మోహన్ రెడ్డి, ఆయన దుష్ట చతుష్టయం 2019 లోనే కదా రాష్ట్రం మీద పడిపోయింది? ఇప్పుడు పరారై పోతున్నవారంతా… 2019 కు ముందూ రాష్ట్రం లోనే ఉన్నారు కదా! అప్పుడు వాళ్ళు…. ఇంతగా బరి తెగించలేదు కదా!
ఈ ఐదేళ్లు ఇంతగా బరి తెగించడానికి వాళ్ళే కారణమైతే ; భయమెందుకు? “ఇదుగో…. మిమ్ముల్ని చూసే ఇన్ని అరాచకాలు చేశాం. ఇన్ని వందల, వేల కోట్లు కొల్లగొట్టాం. ఇన్ని వందల కొంపలు కూల్చాం. ఇంతమంది ని లేపేశాం. ఇంతమంది ఆడాళ్ళను చేరిపేశాం…. ఇన్ని వందల ఎకరాలు నొక్కేశాం. చంద్రబాబు నాయుడిని, లోకేష్ ను పవన్ కళ్యాణ్ ను ఇన్ని వందల సార్లు తిట్టి పోశాం….. మా తప్పేం లేదు. మీ మైండ్ సెట్ ఎలా ఉంటే….. అలా చేశాం.
ఇప్పుడు కేసులు పెట్టి, పోలీసులు మా కోసం తిరుగుతున్నారు. మాకేంటి సంబంధం? మీరు చెయ్యమంటేనో…. చేసుకోమంటేనో కదా మేం చేశాం…” అని జగన్ కు, దుస్సలహాదారుడి కి, దుష్ట త్రయానికీ చెప్పేయవచ్చు కదా?
అప్పుడు ఊళ్లోదిలి పెట్టి, పరారైపోవల్సిన పని లేదు కదా! ఎవరూళ్లల్లో వారు ఉంటూ…. ; ఏదో…”సంసార పక్షం ” గా చిన్న, చితక అక్రమాలు, ఆరాచకాలూ చేసుకుంటూ… ఉన్నంతలో గౌరవం గా బతికేయవచ్చుకదా! మళ్ళీ, మానవ జన్మలు ఎత్తేయవచ్చు కదా!
ఎందుకంటే, గత ఐదేళ్లుగా సమాజం పట్ల ఘోరాపచారాలకు పాల్పడినవారు సమాజ జీవనానికి అర్హులు కారు.