Mahanaadu-Logo-PNG-Large

హీరోలెవరు? జీరోలెవరు?

-నే‘తలరాత’లు తేలేది నేడే!
-ఏపీ-తెలంగాణలో ఎవరి సత్తా ఎంత?

-ఏపీలో కూటమి గద్దెనెక్కుతుందా?
-మళ్లీ ‘జగన్నాధ’రథచక్రాలేనా?
-ఏపీలో కాంగ్రెస్ ఖాతా తెరుస్తుందా?
-తెలంగాణలో పైచేయి ఎవరిది?
-కమలం వికసిస్తుందా?
-మళ్లీ ‘హస్త’వాసి బాగుంటుందా?
-షి‘కారు’ చేయకపోతే కల్లోలమేనా?
-కొన్ని గంటల్లో తేలిపోనున్న పార్టీల భవితవ్యం
( మార్తి సుబ్రహ్మణ్యం)

సర్వే జోస్యాలు అయిపోయాయి..ఎగ్జిట్‌పోల్స్ అయిపోయాయి.. ఎవరి విశ్లేషణలు వారివి. ఎవరి అంచనాలు వారివి. ఎవరి ధీమా వారిది. మధ్యలో స్వాములు-జ్యోతిష పండితుల అనుగ్రహభాషణం- ఫలితాల ప్రవచనం కూడా అయిపోయింది. ఇక మిగిలింది ఫలితమే. అదీ మరికొద్ది గంటల్లోనే! ఏ పార్టీ పతనమవుతుందో.. ఏ పార్టీ పడిలేస్తుందో.. ఎవరు చట్టసభలోకి అడుగుపెడతారో.. ఎవరు ఇంటిదారి పడతారో కూడా మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.

పార్లమెంటు-అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం దేశమంతా ఎదురుచూస్తుంటే.. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలవి భిన్నమైన చూపు. తెలంగాణ ప్రజలు లోక్‌సభ; ఏపీ ప్రజలు శాసనసభ-లోక్‌సభ ఎన్నికల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాకపోతే ఈసారి బెట్టింగులు మునుపటి మాదిరంత జోరుగా లేవు. దాదాపు అన్ని పార్టీలూ డబ్బులు మంచినీళ్లలా పారించాయి. జనం కూడా పార్టీల నుంచి ముక్కుపిండి ఓటుకునోట్లు వసూలు చేశారు. మీడియా కూడా అభ్యర్ధుల నుంచి ప్యాకేజీలు పిండేశాయి. ఎవరి చదివింపులు వారికి అయిపోయాయి. ఇక మిగిలింది ఫలితమే. ఇందులో విజేత విజయదరహాసంతో బయటకు వస్తే, పరాజితులు ఇంటికెళ్లి కన్నీరుకారుస్తారు.

ఏపీలో అసెంబ్లీ-లోక్‌సభ ఎన్నికలు జమిలిగా జరిగాయి. 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. గత ఎన్నికల్లో బీజేపీ దెబ్బ వల్ల అభ్యర్ధులకు నిధులివ్వకపోయిన టీడీపీ, ఈసారి వైసీపీకి పోటీగా నిధులు ఇచ్చింది. అధికారంలో ఉన్న వైసీపీకి ఇసుక-మద్యం-మైనింగ్ ద్వారా వచ్చిన డబ్బును ధారాళంగా పంచింది.

ఇక బీజేపీ-జనసేన ఖర్చు సంసారపక్షంగానే సాగింది. పాపం కాంగ్రెస్ పార్టీనే దారుణంగా వెనుకబడిపోయింది. పీసీసీ చీఫ్ షర్మిల ప్రచారమే ఆ పార్టీకి దిక్కయింది. ఒక ఏడాది ముందు ఆమెను నియమించి ఉంటే, పరిస్థితి మరోలా ఉండేది. ఏపీకి సంబంధించి 50 సంస్థలు ఎగ్జిట్‌పోల్స్ ప్రకటించగా, అందులో 45 సంస్థలు ఎన్డీయే కూటమికే పట్టం కట్టాయి. కేవలం 5 సంస్థలు మాత్రమే వైసీపీకి జై కొట్టాయి. అవి కూడా వివాదాస్పదమయింది.

ఈ ఎన్నికలను చావోరేవోగా తీసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.. వ్యూహాత్మకంగా-అతి జాగ్రత్తగా ఎన్డీయే కూటమిని నడిపించారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే, తన రాజకీయ అనుభవాన్ని రంగరించారు. 45 డిగ్రీల సెల్సియస్ ఎండలో కూడా చెమటలు పడుతూ ప్రచారం చేసి, వైసీపీకి చెమటలు పట్టించారు. జనసేన దళపతి పవన్‌తో అద్భుతరీతిలో సమన్వయం సాధించడమే ఈ ఎన్నికల విశేషం. కానీ కూటమిలో జాతీయపార్టీ అయిన బీజేపీ నుంచి ఆశించిన సహకారం అందలేదన్నది కూటమి నేతల భావన.

సీఎస్‌ను తొలగించటంలో బీజేపీ అగ్రనాయకత్వం, జగన్ వైపే మొగ్గిందన్నది వారి అసంతృప్తి. అసలు తొలిరోజు నుంచే బీజేపీ సహకరించి ఉంటే, ఎన్నికల వాతావరణం మరోలా ఉండేదని వారి వాదన. ల్యాండ్‌టైటిలింగ్ యాక్టు, పాసు పుస్తకాలపై జగన్ ఫొటో అంశాన్ని క్షేత్రస్థాయికి తీసుకువెళ్లి, జనాలను జగన్‌కు వ్యతిరేకంగా నిలిచేలా టీడీపీ సూపర్ సక్సెస్ అయింది. మరి అది ఫలితాల రూపంలో ఎంతవరకూ కలసివచ్చిందో చూడాలి.

ఇక వైసీపీ అధినేత-సీఎం జగన్ ఈ ఎన్నికల్లో అభ్యర్ధులను బదిలీ చేసి కొత్త ప్రయోగం చేశారు. దానితో వారు చాలా ఇబ్బందిపడాల్సి వచ్చింది. స్థానిక నేతల సహకారం అందలేదు. మరి ఆయన ప్రయోగం ఫలించిందా? లేదా అన్నది చూడాలి. ఇక ప్రచారంలో జగన్.. టీడీపీ అధినేత బాబుతో ఏ మాత్రం పోటీ పడలేకపోయారు. బాబు మండుటెండలో ప్రచారం చేస్తే, జగన్ మాతం ఏసీ బస్సుల్లో తిరిగారు. ఈసారి వైసీపీ ప్రచారం చాలా పేలవంగా కనిపించింది.

అటు జగన్ సోదరి షర్మిల-తల్లి విజయమ్మ-మరో చెల్లి డాక్టర్ సునీత, పిన్నమ్మ సౌభాగ్యమ్మ, బావ బ్రదర్ అనిల్ ఒకవైపు.. జగన్-భారతీరెడ్డి-అవినాష్‌రెడ్డి, విమలారెడ్డి ఒకవైపు నిలిచారు. ముస్లిం-క్రైస్తవ మత పెద్దలు వైసీపీ-బీజేపీకి ఓటు వేయవద్దని ప్రార్ధనామందిరాల నుంచి ఇచ్చిన పిలుపు, వైసీపీని ఏమేరకు నష్టపరుస్తుందో చూడాలి. ఎన్నికల సమయంలో పార్టీ ఎంపీలు-ఎమ్మెల్యేలు టీడీపీలోకి మారడం ఆ పార్టీకి మైనస్‌పాయింట్‌గా మారింది.

ఇక కడప కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసిన షర్మిల పోటీతో ఎవరు పుట్టిమునుగుతారన్నది మరో ఆసక్తికర అంశం. ఆమె ప్రచారం వల్ల వైసీపీనే ఎక్కువ దెబ్బతింటుందన్నది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. కడప లోక్‌సభ పరిథిలో భారీ స్థాయిలో షర్మిలకు అనుకూలంగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు ప్రచారం జరిగింది. అదే నిజమైతే జగన్‌కు ఇబ్బందికర పరిణామమే. ఈ ఎన్నికల్లో సంక్షేమ పథకాలు అందుకున్న మహిళలలో అత్యధిక శాతం మాత్రమే వైసీపీకి దన్నుగా నిలబడ్డారు. ఇక మిగిలిన అన్ని వర్గాలూ జగన్‌కు వ్యతిరేకంగా నిలిచాయి. ఎన్నికల ముందు జగన్ తలపై రాయి ‘కట్టు’కథ.. మునుపటి కోడికత్తిలా వర్కవుట్ కాలేదు. పైగా ఉత్తుత్తి కట్టుతో అభాసుపాలయ్యారు.

చివరిలో పోస్టల్‌బ్యాలెట్‌పై అభ్యంతరాలు, ఎమ్మెల్యే పిన్నెల్లిపై సుప్రీంకోర్టు ఆంక్షలు వైసీపీకి తగిలిన వరస శరాఘాతాలే. ప్రధానంగా పోలింగ్ రోజు పిన్నెల్లి ఈవీఎం పగులకొట్టిన వీడియో, వైసీపీ అంటేనే క్యూలో నిలబడ్డ ఓటర్లను భయపెట్టేలా చేసింది. అది ప్రతికూల పరిణామమే. ఇక సంక్షేమ పథకాల బటన్‌నొక్కుడుపైనే ఆశలు పెట్టుకున్న జగన్ ఆశలు నెరవేరతాయో లేదో చూడాలి.

ఇటు తెలంగాణలో కూడా ఎన్నికల యుద్ధం హోరాహోరీగా సాగింది. రేవంత్‌రెడ్డి సీఎం అయిన తర్వాత జరుగుతున్న తొలి లోక్‌సభ ఎన్నికలు కాబట్టి, ఇవి ఆయన సత్తాకు-ఇమేజీకి పరీక్షనే. మంత్రుల సామర్థ్యానికీ ఇవి పరీక్షలాంటివే. కనీసం 10 లోక్‌సభ స్థానాలు గెలిస్తేనే, రేవంత్‌కు ఢిల్లీలో ఆదరణ ఉంటుందన్నది నిర్వివాదం.

కాంగ్రెస్ నాయకత్వం కూడా తెలంగాణలో రేవంత్ సత్తాపైనే ఆధారపడింది. దక్షిణాదిలో దాని ఆశలన్నీ కర్నాటక-తెలంగాణపైనే. కాంగ్రెస్ పార్టీ నిజానికి ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌పైనే ఎక్కువ విమర్శలు సంధించింది. ప్రచారంలో అంతా తానై నిలిచిన రేవంత్ పడ్డ కష్టానికి ఎంతవరకూ ఫలితం ఉంటుందో చూడాలి. ఈ ఫలితాల్లో కాంగ్రెస్ నాయకత్వం తాను ఆశించిన స్థానాలు రాకపోతే.. రేవంత్‌కు మరో ప్రత్యామ్నాయనేత తెరపైకి రావడం ఖాయమన్నది పార్టీ వర్గాల విశ్లేషణ.

ఈ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ భవితవ్యం-స్థానం తేలిపోనుంది. నాలుగు సీట్ల నుంచి మరో ఆరు సీట్లు సాధిస్తేనే దాని ఉనికి ఉంటుంది. నిజానికి ఈ ఎన్నికల్లో బీజేపీ తెలంగాణపై తన సర్వశక్తులూ కేంద్రీకరించింది. మోదీ,అమిత్‌షాతో పాటు కేంద్రమంత్రులు విస్తృతంగా ప్రచారం చేశారు. డబ్బు కూడా భారీగానే ఖర్చు పెట్టారు. మరి ఆ స్థాయి ఫలితాలు ఉంటాయా? ఉండవా అన్నది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.

జాతీయ పార్టీలను పక్కకుపెడితే.. ఈ లోక్‌సభ ఎన్నికలు బీఆర్‌ఎస్‌కు అగ్నిపరీక్ష. అది ఇప్పుడు పేరు మార్చుకుని జాతీయ పార్టీగా మారినా, ఇప్పటివరకూ పక్క రాష్ట్రంలో కూడా పోటీ చేయలేని నిస్సహాయ పార్టీగా మారింది. అధికారం ఉన్నప్పుడు కేసీఆర్.. తమ పార్టీ అన్ని రాష్ట్రాల్లోనూ విస్తరిస్తుందని గొప్పలకు పోయారు. కానీ ఎక్కడా పోటీ చేయలేక చతికిలపడ్డారు.

ఈ ఎన్నికలు ప్రధానంగా కేసీఆర్ నాయకత్వానికి సవాలు. కనీసం అరడజను సీట్లు రాకపోతే పక్కపార్టీలోకి జంపింగులు తప్పవు. ఇప్పటికే పదిమంది జంపయిపోయారు. మరికొందరు లోక్‌సభ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. అరడజను స్థానాలు సాధించకపోతే, తెలంగాణలో బీఆర్‌ఎస్ ఉనికి కష్టమవుతుంది. తాను ప్రధాని రేసులో ఉన్నానని ప్రకటించుకున్న కేసీఆర్ కల నిజంగా కావాలంటే.. ఆ పార్టీ కనీసం 14 స్థానాలు సాధించడం నెంబరుగేమ్‌లో అనివార్యం.

లేకపోతే ఆయన కల కల్లగానే మిగిలిపోవడంతోపాటు.. తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ ప్రాధాన్యం కనుమరుగయి, కాంగ్రెస్-బీజేపీ మాత్రమే మిగిలే ప్రమాదం లేకపోలేదు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ ప్రచారం, ఎప్పుడూ లేనంత పేలవంగా కనిపించింది. ఈ ఎన్నికల్లో ఓటరు ‘కారు’ ఎక్కకపోతే బీఆర్‌ఎస్‌కు ఉనికికే పెను ముప్పు. బీఆర్‌ఎస్ ఉత్తరాధికారి కేటీఆర్ మాత్రం, పది సీట్లకు పైగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. మరికొన్ని గంటల్లో ఆయన ది ధీమానా? భ్రమనా అన్నది తేలిపోతుంది.