పనిచేసే ఉద్యోగి ఎందుకు తీసుకోడు?

– ఉద్యోగుల జీతభత్యాలు ఉచిత పథకాలు కావు
– ఏమీ చేయకుండానే మీరు ఇన్ని తీసుకుంటుంటే… పనిచేసేవాడు ఎందుకు తీసుకోకూడదు?
– ఉద్యోగుల మీద ఏడవడం ఆపండి
(జానకీదేవి, తణుకు)

ఆత్మాభిమానం కలిగిన ప్రభుత్వ ఉద్యోగి ఆవేదన ఒక్కసారి అర్థం చేసుకోండి. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం అంత సులభం కాదు. 30 సంవత్సరాలు అహోరాత్రులు కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం సాధించుకున్న వారిని కామెంట్ చేస్తున్న వాళ్ళు ఒక్కసారి చదవండి.

ప్రభుత్వం తరపున ప్రజలకు పని చేసి పెడుతున్నందుకు జీతం తీసుకుంటున్నారు ఉద్యోగులు. అంతే తప్ప ఉద్యోగుల జీతభత్యాలు మీరు తీసుకుంటున్న ఉచిత పథకాలు కావు.

ప్రభుత్వానికి పని చేసి పెడుతున్నందుకు మేం జీతం తీసుకుంటున్నాం. మరి మీరు ఏం చేస్తున్నారని. ప్రభుత్వ పథకాల పేరుతో ఫ్రీగా ప్రభుత్వం నుండి డబ్బు తీసుకుంటున్నారో చెప్పగలరా? ఉచితాలు తీసుకునే వాళ్ళలో నిజంగా ఎంత మంది అర్హులు? వాళ్ళ వివరాలు బయటపెడితే అర్హత గురించి తెలుస్తుంది.

లక్షలాది మంది నుండి పదుల సంఖ్యలో మెరుగైన పనివాళ్లను (ఉద్యోగులను) ఎంపిక చేసుకుంటున్నపుడు మెరుగైన జీవితం ఇవ్వాలి తప్పదు. ఇరవై ముప్పై సంవత్సరాలు పాటు సరదాలు, సంతోషాలు ప్రక్కన పెట్టి, రాత్రి పగలు కష్టపడి సంపాదించిన విజ్ఞానం, నైపుణ్యం కలిగిన వ్యక్తులు ఊరకనే పనిలోకి (ఉద్యోగం లోకి) రారు. ప్రభుత్వం అయినా.., ప్రైవేట్ అయినా మెరుగైన నైపుణ్యం కలిగిన ఉద్యోగి కావాలంటే అంతే మెరుగైన జీతం చెల్లించాలి.

అనేక కార్పొరేట్, ప్రైవేట్ సంస్థలు లక్షల్లో జీతాలు ఇస్తున్నాయ్ ఎందుకు? వాళ్లకు తెలివి లేకా? బయట ఐదు వందలు, ఆరువందల కూలికి అంతమంది దొరికితే ఆ ప్రైవేట్ వాళ్లకు పని లేక నెలకు లక్షలాది రూపాయల జీతాలు ఇస్తున్నారా? విమర్శ చేయడం చాలా సులువు. వాస్తవాన్ని గ్రహించడం చాలా కష్టం.

ఒక్కడు ఎవడో లంచం తీసుకుంటే ఉద్యోగులు అందరూ లంచగొండ్లు, ఒక్కడు ఎవడో వడ్డీ వ్యాపారం చేస్తే ఉద్యోగులందరూ వడ్డీ వ్యాపారులు, ఒక్కడు ఎవడో రియల్ ఎస్టేట్ చేస్తే ఉద్యోగులు అందరూ రియల్ ఎస్టేట్ వ్యాపారులని అనుకోవడం అవివేకం. (మీరు చేసే వడ్డీ వ్యాపారాలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు ఏ ఉద్యోగో పోటీ తగిలి ఉంటాడు. అందుకే ఏడుపు)

కష్టపడి పనిచేస్తే సంవత్సరానికి 12 నెలలు జీతం వస్తుంది. అందులో షుమారు రెండున్నర నెలల జీతాన్ని TAX గా చెల్లిస్తాడు. దాదాపు మరో రెండునెలల జీతాన్ని PF, APGLI పేరుతో ప్రభుత్వం దగ్గరే ఉంచేస్తాడు. వీటికి తోడు ఉద్యోగులు చేసే అన్ని కొనుగోలు/లావాదేవీలపై 18% GST కడుతున్నారు. ఉద్యోగులు తప్ప మిగిలిన ఏ ఒక్కడూ నిజాయితీగా tax కట్టడు.

పదుల ఎకరాల భూములు, కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా, వాళ్లకు ఆసరా, అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, ఫీజ్ రియంబర్స్మెంట్, వివిధ సబ్సిడీలు, తెల్ల రేషన్ కార్డులు, చేయూతలు, పెన్షన్లు , రైతు భరోసాలు, వాహన మిత్రలు, నిరుద్యోగ భృతులు, పావలా వడ్డీకే రుణాలు, పైసా చెల్లించకుండా వైద్యాలు ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ కి అంతే లేదు. ఏమీ చేయకుండానే మీరు ఇన్ని తీసుకుంటుంటే… పనిచేసేవాడు ఎందుకు తీసుకోడు?? ఎందుకు తీసుకోకూడదు??
ఉద్యోగుల మీద ఏడవడం ఆపండి.