– ఏపీ సచివాలయాల ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జాని పాషా
అమరావతి, మహానాడు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగ వ్యవస్థలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై ఐదేళ్ళుగా వివక్ష కొనసాగుతోందని, పట్టభద్రులకు మరుగుదొడ్ల ఫొటోలు తీయమంటున్నారని ఈ నిర్ణయం తగదని ఏపీ సచివాలయాల ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జాని పాషా అన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉన్నతవిద్యావంతులైన సచివాలయ ఉద్యోగులను జాబ్ చార్ట్ ప్రకారం కాకుండా రోజు కూలీల మాదిరిగా ప్రతి పనికీ వినియోగించుకుంటున్నారని విమర్శించారు. ఇలా.. ఉద్యోగ వ్యవస్థలో చులకన చేస్తున్నారని, ఐదేళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నప్పటికీ, పరిస్థితిలో మార్పు వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్న ఉద్యోగులకు నిరాశే కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
సచివాలయ ఉద్యోగులు ఉద్యోగాలుగా పనిచేయడం మేము చేసుకున్న పాపమా.? మమ్మల్ని వివిధ ప్రభుత్వ శాఖలకు కేటాయించాలి.. తద్వారా మాత్రమే అజమాయిషీ చెలాయించే వారి నుండి విముక్తి లభిస్తుందన్నారు. గతంలో సులభ్ కంప్లెక్స్ ల వద్ద, పార్కుల వద్ద, రోజువారీ వ్యాపారాలు చేసుకునే వారి వద్ద ఆశీలు వసూళ్ళ కోసం, చెత్త శుభ్రం చేయడం కోసం విధులు, చెత్త పన్ను వసూలు, అంగన్వాడీ సెంటర్ల విధులు వంటి సంబంధం లేని పనులు అప్పగించి అవమానించిన సంఘటనలు ఉన్నాయని గుర్తు చేశారు.
సచివాలయ ఉద్యోగులు ఇరవై లక్షల మందితో పోటీ పడి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించామని మాపై ఎందుకిలా వివక్ష చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ తక్షణం పాఠశాల విద్యాశాఖ ఆ ఆదేశాలు ఉపసంహరించుకోవాలని కోరారు.