తాతముత్తాతల ఆస్తులపై జగన్‌ ఫొటోలు ఎందుకు?

వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు
బొల్లాపల్లి మండలంలో మక్కెనతో కలిసి ప్రచారం

వినుకొండ, మహానాడు : ఎప్పుడో తాతముత్తాతల నుంచి వచ్చిన ఆస్తులపైనా జగన్‌ ఫొటోలు ఎందుకో ఇకనైనా వైకాపా ప్రభుత్వం సమాధానం చెప్పాలని వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు డిమాండ్‌ చేశారు. శనివారం బొల్లాపల్లి మండలం హనుమాపురంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావుతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన జనం ఆస్తులపై జగన్‌రెడ్డి ఫొటో ఏంటని ప్రశ్నించారు. ఉంటే ప్రభుత్వ ముద్ర ఉండాలని, చివరకు పొలం గట్లపై సర్వే రాళ్లపై కూడా జగన్‌ ఫొటోలు వేసుకోవడం వారి భూ కబ్జాకు సాక్ష్యమన్నారు.

ప్రతి పాసుపుస్తకంపై తన సొంత ఆస్తి అయినట్లు ఫొటో వేసుకున్నారని మండిపడ్డారు. జగన్‌రెడ్డి ఫొటోలు ఉంటే రుణాలు ఇవ్వబోమని కొన్ని బ్యాంకులు చెబుతున్నాయని, దీనికి ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. ప్రజల దగ్గర ఉన్న కాగితాలు ఇకపై ప్రభుత్వ అధికారుల వద్ద పెడితే ప్రజలకు జిరాక్స్‌ కాపీలు ఇస్తారంట అని దుయ్యబట్టారు. చివరకు ఒరిజనల్‌ డాక్యుమెంట్లు జగన్‌రెడ్డి తన దగ్గర పెట్టుకుని బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకుని రుణాలు తెచ్చుకున్నా అడిగే నాధుడు లేడన్నారు.