Mahanaadu-Logo-PNG-Large

కేసీఆర్‌తో లాలూచీ పడ్డావా రేవంత్‌?

-ఫోన్‌ ట్యాపింగ్‌లో ఎందుకు అరెస్టు చేయరు?
-బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌

హైదరాబాద్‌: ఢిల్లీలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు కె.లక్ష్మణ్‌ మాట్లాడారు. ఫోన్‌ ట్యాపింగ్‌ దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడుతున్నా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం మాత్రం పట్టనట్టే వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గత బీఆర్‌ఎస్‌ సర్కార్‌లో జరిగిన అవినీతి, అక్రమాల చిట్టాను వెలికితీసి నిందితులను జైలుకు పంపిస్తామన్న కాంగ్రెస్‌ నాయకులు నేడు మీనమేషాలు లెక్కిస్తున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి, టీఎస్పీఎస్సీ అవకతవకలపై హడావిడి చేస అంతా మర్చిపోయారని విమర్శలు గుప్పించారు.

కేసీఆర్‌ ఆదేశాలతోనే ఫోన్‌ ట్యాపింగ్‌ చేశామని టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు ఇచ్చిన వాంగ్మూలంలోనే స్వయంగా వెల్లడిరచినప్పటికీ ఆయనపై చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనకాడుతున్నారని ప్రశ్నించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం దేశ ద్రోహం లాంటిదే. తానే ఫోన్‌ ట్యాపింగ్‌ బాధితుడే అయినా రేవంత్‌ ఏం చేయలేని స్థితిలో ఉన్నారు. కాంగ్రెస్‌ – బీఆర్‌ఎస్‌ ఒక్కటే అని ఈ వ్యవహారంతో తేలిపోయింది. ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ ఇండియా కూటమిలో చేరడం ఖాయమన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారనే ఆరోపణలతో ఢిల్లీ బీజేపీ నేతను కేసులో ఇరికించి కవితను కాపాడేందుకు ఈ కేసును వాడుకోవాలని కుట్ర జరిగిందని పోలీసు అధికారులు వాంగ్మూలంలో చెప్పడం వారి దిగజారుడు చర్యలకు పరాకాష్ట అని వ్యాఖ్యానించారు.