• తిరుపతిలో గంజాయి లేకుండా చూసే బాధ్యత తీసుకుంటాం
• ఎమ్మెల్యే, ఆయన కొడుకు ఆగడాలపై స్థానికులంతా తిరగబడే సమయం వచ్చింది
• తండ్రి 30 శాతం వాటా.. కొడుకు 10 శాతం కమీషన్లు దండుకుంటున్నారు
• కోడి బొచ్చునూ వదలకుండా అవినీతికి ఉపయోగించుకున్న ఘనత తండ్రీ, కొడుకులది
• చిరంజీవి హయాంలో మొదలుపెట్టిన ఇళ్లను పూర్తి చేస్తాం
• తిరుపతి స్థానికులకు ప్రతి నెలా రెండో మంగళవారం దర్శనాన్ని పునరుద్ధరిస్తాం
• తిరుపతి వారాహి విజయభేరి సభలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్
‘తిరుమల వైకుంఠవాసుడు నెలవైన ప్రాంతం. ఆయన పాదాల వద్ద కొలువుదీరిన ప్రాంతం తిరుపతి. ఏడు కొండల స్వామి పాదాల చెంత ఉన్న ఈ ప్రాంత ప్రజలు ఆకు రౌడీలకు భయపడాల్సి అవసరం లేదు. తిరుపతి ఆధ్యాత్మికతను మంటగలిపే రౌడీలపై ప్రజలంతా తిరగబడాల్సిన సమయం, ఓటుతో బుద్ది చెప్పాల్సిన సమయం వచ్చేసింద’ని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
పవిత్రత మంట గలిపి ప్రతి విషయంలోనూ తిరుపతిని అవినీతిమయం చేసి దోచుకుంటున్న తండ్రీకొడుకులకు బుద్ది చెప్పాలని సూచించారు. వీరి అవినీతి ఏ స్థాయికి దిగజారిందంటే ఆఖరికి తిరుపతి నగరంలోని చికిన్ దుకాణాల యజమానులు కొళ్ల వ్యర్ధాలను పారబోస్తున్నందుకు గాను ప్రతి నెలా రూ. 20 లక్షలు.. కోడి బొచ్చు మీద కూడా సంపాదించుకునే పరిస్థితికి తీసుకువచ్చారని అన్నారు. వీరికి తగిన బుద్ది చెప్పి తిరుపతి గొప్పదనాన్ని చాటిచెప్పాలని ఆయన కోరారు. మంగళవారం తిరుపతిలో జరిగిన వారాహి విజయభేరీ సభలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తో కలసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. “తిరుపతి టీడీఆర్ బాండ్ల స్కామ్ దగ్గర నుంచి కనిపించిన ప్రతి స్కామును తండ్రి కొడుకులు చేశారు. ఇది మన ఆధ్యాత్మిక నేల. దీని పవిత్రత ఎంతో గొప్పది. కూటమి ప్రభుత్వంలో అన్ని కులాలు, మతాలను కలుపుకుని వెళ్తాం. తిరుపతిలోని రుయా, స్విమ్స్ ఆసుపత్రుల వసతులు పెంచుతాం. కరోనా సమయంలో జరిగిన పొరపాట్ల మాదిరి తావివ్వకుండా అక్కడ వసతులు పెంచుతాం. టీటీడీ నిధులు పక్కదారి పట్టకుండా బాధ్యత తీసుకుంటాం. తిరుపతిలోని 40 మురికివాడల ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్దే చర్యలు చేపడతాం.
తిరుపతి నుంచి వోల్టాస్, రిలయన్స్, అమర్ రాజా వంటి పెద్ద ఫ్యాక్టరీలు వెళ్లిపోయాయి. ఇక్కడ ఉపాధికి వైసీపీ ప్రభుత్వం గండికొట్టింది. తిరిగి మళ్లీ స్థానిక యువతకు పూర్తి స్థాయి ఉపాధి కల్పించే చర్యలు చేపడతాం.
తిరుపతి రౌడీలకు కేంద్రం చేశారు
టెంపుల్ సిటీ తిరుపతిని వైసీపీ ఎమ్మెల్యే, అతని కొడుకు.. రౌడీలకు కేంద్రంగా చేశారు. ప్రతి పనిలోనూ ఎమ్మెల్యే 30 శాతం కమీషన్ తీసుకుంటే, కొడుకు పది శాతం కమీషన్ తీసుకుని జులుం ప్రదర్శిస్తున్నారు. ఎమ్మెల్యే కొడుకుకి స్థానికులెవరూ భయపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి ఆకు రౌడీలను ఏడుకొండలవాడే చూసుకుంటాడు. కూటమి తరఫున నిలబడుతున్న ఆరణి శ్రీనివాసులు ని గెలిపిస్తే తిరుపతి ఆకు రౌడీలను తొక్కేస్తాం. తిరుపతిలో ఎలాంటి అలజడులకు, అసాంఘీక కార్యకలాపాలకు తావు లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం.
స్థానికులకు స్వామి వారి దర్శనం ప్రతి నెలా కల్పిస్తాం
తిరుపతిలో స్థానికులకు గతంలో ప్రతి నెలా రెండో మంగళవారం ప్రత్యేకంగా దర్శనం ఉండేది. దాన్ని వైసీపీ ప్రభుత్వం తీసేసింది. దీన్ని కూటమి ప్రభుత్వం రాగానే పునరుద్ధరించే బాధ్యత తీసుకుంటాం. తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించే ఏర్పాట్లు చేస్తాం. శ్రీవారి చెంత ఉన్న శేషాచలాన్ని వైసీపీ నాయకులు అడ్డగోలుగా దోచేశారు. టీటీడీ నిధులను ఇష్టానుసారం పందేరం చేశారు.
కేవలం కమిషన్లకు కక్కుర్తి పడి పనులు చేయించే సంస్కృతి వచ్చింది. తండ్రి కొడుకుల కనుసనల్లో తిరుపతి నగర పాలక సంస్థలో రూ. 2 వేల కోట్ల టీడీఆర్ బాండ్ల స్కామ్ జరిగింది. అంటే తిరుపతిని ఎలా దోచుకున్నారో అర్ధం అవుతుంది. కొండపైన స్వామివారి ప్రసాదం లడ్డూలు సైజు తగ్గించి, నాణ్యత మరిచారు. దోపిడీ, దళారీ వ్యవస్థగా టీటీడీని మార్చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రిసార్టు చేసి వైసీపీ నాయకులు వాడుకున్నారు. ఆధ్యాత్మిక వాతావరణాన్ని పూర్తిగా నాశనం చేశారు. ఇది వెంకటేశ్వర స్వామి వెలిసిన గొప్ప నేల. దీని గొప్పతనాన్ని ప్రపంచానికి చాటేలా కూటమి ప్రభుత్వంలో టీటీడీని తీర్చిదిద్దుతాం.
వెంకటేశ్వర స్వామి వారినీ జగన్ అవమానించారు
టీటీడీ ఉద్యోగులకు ఇచ్చిన ఇళ్ల పట్టాల మీద కూడా జగన్ తన ఫొటో వేసుకున్నాడు. తిరుమల తిరుపతి దేవస్థానానికి స్వతంత్రత ఉంది. దేవస్థానానికి ప్రత్యేక బడ్జెట్ ఉంది. దేవస్థానం పరిధిలో పని చేసే ఉద్యోగుల ఇళ్ల పట్టాలపై జగన్ బొమ్మ ఎందుకు? ఉంటే ఏడుకొండల స్వామి చిత్రం ఉండాలి. అలాకాకుండా జగన్ తన బొమ్మను వేసుకోవడం ద్వారా కలియుగ వైకుంఠనాథుడ్ని అవమానించినట్టు చేశారు.
గోవిందరాజస్వామి సత్రాలు పడగొట్టారు. రూ. 200 కోట్ల ముడుపుల కోసం ఈ బాగోతం జరిగినట్టు తెలుస్తోంది. చిరంజీవి గారు తిరుపతి ఎమ్మెల్యేగా పని చేసిన సమయంలో 1600 ఇళ్లు ఇస్తే 149 ఇళ్లకు మాత్రమే స్లాబులు వేశారు. కూటమి ప్రభుత్వం రాగానే చిరంజీవి గారి ఆశయాన్ని అమలు చేసి అందరికీ ఇళ్లు కట్టించే బాధ్యతను తీసుకుంటాం.
తిరుమల వెంకన్నతో పెట్టుకుంటే పుట్టగతులుండవు
వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు, హుండీ ఆదాయం కూడా అడ్డగోలుగా దోచేశారు. గతంలో ఏడుకొండల వాడికి అన్ని కొండలు ఎందుకు రెండు కొండలు చాలు అని కొందరు అన్నారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఏకంగా ఆ ఏడుకొండల వాడి నిధులను పక్కదోవ పట్టిస్తున్నారు. తిరుపతి వెంకన్నతో పెట్టుకోకండి. ఆయన నిజరూప దర్శనం గురువారం ఉంటుంది. ఇలాంటి తప్పులు చేస్తే ఆయన నిజరూపాన్ని, ఆగ్రహాన్ని వైసీపీ నాయకులు పత్రి రోజూ చూడాల్సి ఉంటుంది.
వైసీపీ ఎమ్మెల్యే, ఆయన కొడుకు ఈ ఎన్నికల్లో స్వామి వారి హుండీ ద్వారా దోచుకున్న డబ్బునే ప్రజలకు పంచాలని చూస్తున్నారు. అలాంటి డబ్బు తిరుపతి ప్రజలు తీసుకుని తిరిగి హుండీలోనే వేసేయండి. మనకి ఇచ్చే డబ్బు ఆ వడ్డీ కాసుల వాడిది. అలాంటి సొమ్మునుదోచుకున్న వారికి ఓటుతో బలంగా బుద్ది చెబుదాం. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్లినా, ఏ కూటమి సర్వే చూసినా రాబోయేది కూటమి ప్రభుత్వం విజయం తధ్యమని తెలుస్తోంది. తిరుపతి ప్రజలు కూడా ఎలాంటి భయాలకు తావులేకుండా కూటమి అభ్యర్ధి ఆరణి శ్రీనివాసులు కి గాజు గ్లాసు గుర్తుపై, కూటమి ఎంపీ అభ్యర్ధి డాక్టర్ వరప్రసాద్ కి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలి. చంద్రగిరి నియోజకవర్గ నుంచి పోటీ చేస్తున్న పులివర్తి నానినీ గెలిపించాల”ని కోరారు.