Mahanaadu-Logo-PNG-Large

మరి ఆ భూభాగం ఏపీకి ఇచ్చేస్తారా?

1956 నవంబరు 1 వతేదీ వరకూ మరియు ఆ తరువాత ఖమ్మం జిల్లా ఏర్పడేవరకూ భద్రాచలం రెవిన్యూ డివిజన్ తూర్పు గోదావరి జిల్లాలో ఉండేది. ఖమ్మం జిల్లా వరంగల్ జిల్లాలో కలిసి ఉండేది.

వరంగల్ నుండి విడగొట్టి ఖమ్మం జిల్లా ఏర్పాటు చేసినప్పుడు భద్రాచలం రెవిన్యూ డివిజన్ ను ఖమ్మం జిల్లాలో కలిపారు. తాలుకాలు ఉన్నప్పుడు వెంకటాపురం, భద్రాచలం, చింతూరు తాలూకాలు భద్రాచలం రెవిన్యూ డివిజన్ లో ఉండేవి.
మండలాలు ఏర్పాటు అయిన తర్వాత ఆ మూడు తాలూకాలను 8 మండలాలు గా విడగొట్టారు.

అవి (1) వాజేడు (2) వెంకటాపురం ( ప్రస్తుతం ఈ రెండు మండలాలు ములుగు జిల్లాలో కలిపారు)(3) చర్ల(4)దుమ్ముగూడెం (5) భద్రాచలం (చర్ల, దుమ్ముగూడెం మరియు భద్రాచలం టౌన్ లు ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నాయి)(6) కూనవరం(7) వరరామచంద్రపురం(8) చింతూరు.

భద్రాచలం రూరల్ మండలాన్ని ఎటపాక మండలం చేశారు. ఈ ఎటపాక మండలం, కూనవరం, వరరామచంద్రపురం, చింతూరు మండలాలను ఆంధ్ర ప్రదేశ్ లో కలిపారు.

ఇవి కాక.. కుకునూరు, ఏలేరుపాడు మండలాలు, బూర్గంపాడు మండలంలోని 7 గ్రామాలను ఏలూరు జిల్లాలో కలిపారు. ఈ ప్రాంతం అప్పట్లో ఖమ్మం జిల్లాలో ఉండేది. ఈరోజుకీ భద్రాచలం రెవిన్యూ డివిజన్ మొత్తం రెవిన్యూ రికార్డులు.. ఆర్ ఎస్ ఆర్, ఎఫ్ ఎం బి., లు వగైరాలు ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నట్లే ఉంటాయి.

ఈ విషయాన్ని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో చర్చించి ఆంధ్రప్రదేశ్ కి చెందిన భూభాగాన్ని (1956 నవంబరు 1 వ తేదీనాటికి ఉన్నది ఉన్నట్లుగా ) తెలంగాణా రాష్ట్రం తిరిగి ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చివేయాలి.

– దామోదర ప్రసాద్