Mahanaadu-Logo-PNG-Large

రాజకీయ లబ్ధి కోసం వృద్ధుల ప్రాణాలు తీస్తారా?

జగన్‌రెడ్డి, జవహర్‌రెడ్డి కలిపి చేసిన కుట్ర ఇది
మండుటెండలో పెన్షన్‌దారులు చనిపోతుంటే ఆనందమా?
కొంచెమైనా మానవత్వం లేదా..మీకు
వారి మరణాలకు మీరే బాధ్యత వహించాలి
టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య

మంగళగిరి, మహానాడు : జగన్‌ పాలనలో పెన్షన్‌దారుల బాధలు వర్ణణాతీతంగా ఉన్నాయని కుంటి సాకులు, జగన్నాటకాలతో జగన్‌ రెడ్డి, జవహర్‌ రెడ్డిలు వారి ప్రాణాలు తీస్తున్నారని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మండిప డ్డారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్‌ రాజకీయ కక్షతోనే పింఛన్‌దారులను ఇబ్బంది పెడుతున్నాడని మండిపడ్డారు. వారికి సమస్యలను సృష్టించి ఆ నెపాన్ని చంద్రబాబుపై నెడుతున్నాడని విమర్శించారు. తాను చేసిన తప్పును ఎదుటి మనిషిపైకి నెట్టడంలో జగన్‌ దిట్ట. వైఎస్‌ నైతిక విలువలతో పనిచేశాడు. జగన్‌కు ఆ నైతిక విలువలు లేవు. నువ్వు నిజం గా దేవుడిని నమ్ముకుంటే ఇంతమంది ఉసురుపోసుకుంటావా జగన్‌ అని ప్రశ్నించారు. జగన్‌కు మానవత్వం అంటే తెలియదు. నా జాతి వాళ్లు ఇబ్బంది పడుతుంటే మనసు ఆగక ఆక్రందనతో మాట్లాడుతున్నా. జగన్‌ రెడ్డి అనుకుంటే ఇంటి దగ్గరే పింఛన్లు ఇచ్చేవారు. జగన్‌ రెడ్డి, జవహర్‌ రెడ్డి ఇద్దరు కలిసి చేసిన కుట్ర ఇది. దొంగసాకులు, కుంటిసాకులతో వృద్ధ పింఛన్‌దారుల ప్రాణాలు తీస్తున్నారు. వృద్ధులు మండుటెండలో స్పృహ తప్పి పడిపోతుంటే ఆనందపడతావా? ఇళ్ల దగ్గరే పింఛన్లు ఇవ్వాలని చీఫ్‌ సెక్రటరీకి నీవు చెబితే ఎందుకు వినరు. నువ్వు చెప్పినా వినని అసమర్థ, చేతగాని ముఖ్యమంత్రివా? ఎండలో వృద్ధులను బ్యాంకుల చుట్టూ తిప్పి ఇబ్బంది పెడతావా? ఇదంతా మీరు, మీ జవహర్‌ రెడ్డి పన్నిన కుట్ర కాదా? అని ప్రశ్నించారు.

జగన్‌కు ప్రయోజనం చేకూర్చేందుకే జవహర్‌ రెడ్డి
జగన్‌కు ప్రయోజనం చేకూర్చడానికి వృద్ధుల ప్రాణాలు తీస్తారా జవహర్‌రెడ్డి? రాజకీయ ప్రయోజనాల కోసం దొంగసాకులు, కుంటి సాకులతో పింఛన్‌దారుల ప్రాణాలతో ఆటలాడుకుంటావా? వారి మరణాలకు మీరే బాధ్యత వహించాలి. మళ్లీ ఆ నెపాన్ని చంద్రబాబుపై నెట్టడం మీ దుర్మార్గపు రాజకీయానికి పరాకాష్ట. నిజంగా జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే లబ్ధిదారులకు ఇళ్ల వద్దే పింఛన్లు ఇవ్వాలని జవహర్‌ రెడ్డి అనుకుంటే అదేమి కష్టతరం కాదు. తన సొంత మనిషి జవహర్‌రెడ్డిని అడ్డుపెట్టుకుని పింఛన్‌ దారులను ఇబ్బంది పెట్టాడు. పింఛన్లు బ్యాంకుల ద్వారా ఇవ్వడం కుదరదని పంచాయతీరాజ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శశిభూషణ్‌ మూడు లేఖలు రాశారు. అయినా రాజకీయ ప్రయోజనాలకోసం పింఛన్‌ దారులను ఇబ్బంది పెట్టడానికి బ్యాంకుల్లో పింఛన్‌ డబ్బులు వేశారు. దాంతో బ్యాంకుల చుట్టూ తిరగలేక పెన్షనర్లు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. జగన్‌ కనీస మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నాడు.

సాక్షి తప్పుడు రాతలపై ఎందుకు నోటీసులు ఇవ్వలేదు?
జవహర్‌ రెడ్డి ఎవరూ చనిపోలేదని చెబుతున్నారు. మరోవైపు సాక్షిలో 33 మంది చనిపోయారని రాస్తున్నారు. జవహర్‌ రెడ్డి చెప్పింది నిజం అయితే సాక్షి తప్పుడు రాతలపై ఎందుకు నోటీసులు ఇవ్వలేదు. ఈ మరణాలకు జగన్‌ రెడ్డే బాధ్యత వహించాలి. మీ రాజకీయ కుట్రతోనే పింఛన్‌ దారులు మృతిచెందారు. 92 శాతం పింఛన్లు ఇచ్చామని జవన్‌ రెడ్డి అబద్దాలు చెబుతున్నాడు. బ్యాంకులో వేస్తే పింఛన్లు చేరినట్టా? సచివాలయ ఉద్యోగులను ఉపయోగించుకుని పింఛన్లు ఇస్తే రెండురోజుల్లో ఇచ్చేవారు. అదే చంద్రబాబు అయితే కంట్రోల్‌ రూమ్‌లో కూర్చుని సమస్యను చిటికలో పరిష్కరించేవారు. జగన్‌ రెడ్డికి పాలనలో అవగాహన లేక పింఛన్‌దారులకు తిప్పలు తెచ్చాడు.

చిత్తశుద్ధి ఉందా సార్‌?
చీఫ్‌ సెక్రటరీ మీకు అసలు చిత్తశుద్ధి ఉందా సార్‌? చిత్తశుద్ధి ఉంటే పేదలను ఇబ్బంది పెడతారా? 1వ తేదీనే బ్యాంకులో పింఛన్లు వేశామని గొప్పలు చెబుతున్నారు. ఎంతమంది లబ్ధిదారులు పింఛన్‌ తీసుకున్నారో చెప్పగలరా? చాలా మంది అకౌంట్లు ఆగిపోయాయి. ఇలా అగిపోయిన అకౌంట్ల డబ్బులు మళ్లీ ప్రభుత్వానికి మళ్లాయి. ఇలా వృద్ధులను ఇబ్బంది పెడితే వాళ్ల ఉసురు జగన్‌ రెడ్డి మీకు ఖచ్చితంగా తగులుతుంది. మీరు ఎవరికి జవాబుదారి ప్రజలకా, జగన్‌కా అని ప్రశ్నించారు.

వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం
వైసీపీ నేతలే పింఛన్‌దారులను ఎండలో పింఛన్ల కోసం ఇబ్బంది పెడుతూ బ్యాంకుల వద్ద పింఛన్లు తీసుకుం టున్న పెన్షన్‌దారుల వద్దకు వెళ్లి చంద్రబాబు వలన పింఛన్‌దారులు ఇబ్బందులు పడుతున్నారంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఈ తప్పుడు ప్రచారాలను వెంటనే ఆపాలి. ఈ నేరం జగన్‌ రెడ్డి, జవహర్‌ రెడ్డిలదే. వృద్ధుల మరణాలకు కారణమైన జగన్‌ రెడ్డికి ప్రజలే బుద్ధిచెప్పాలి. రాక్షస పాలనను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.