– ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)
విజయవాడ, మహానాడు: ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారి ఆశీస్సులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి వల్ల ఇటీవల సంభవించిన వరద విపత్తు నుంచి ఎన్టీఆర్ జిల్లా వాసులందరూ బయటపట్టారు. వరద విపత్తు కారణంగా కలిగిన నష్టం నుంచి, ప్రభుత్వం అందించిన ఆర్ధిక సాయంతో త్వరగా కోలుకుని ఆర్థికంగా పూర్వస్థితికి రావాలని, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా, సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారిని వేడుకున్నట్టు విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) తెలిపారు.
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం శ్రీ గాయత్రి దేవి అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారిని అమలాపురం ఎంపి జి.ఎం. హరీష్ తో కలిసి దర్శించుకున్నారు. ఆ తర్వాత ఆశీర్వచన మండపంలో వేదపండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించి వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం మీడియా పాయింట్ వద్ద ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ భక్తులందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఇంద్రకీలాద్రి పై అమ్మవారి దర్శనం కోసం విచ్చేసే భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సదుపాయాలు చేయటంపై హర్షం వ్యక్తం చేశారు. దసరా ఏర్పాట్లు అద్భుతంగా నిర్వహించిన అన్ని ప్రభుత్వ విభాగాలను అభినందించారు. ఎంపి జి.ఎమ్.హరీష్ మాట్లాడుతూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా దుర్గమ్మ ఆశీస్సులు అందరిపై వుండాలని ప్రార్థించినట్లు తెలిపారు. సాధారణ భక్తులకు అవసరమైన ఏర్పాట్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా రాజీ పడలేదన్నారు.