-రేవంత్ పాలనలో తెలంగాణ పదం మాయమైంది
-ప్రకటనల్లో ఎక్కడా జై తెలంగాణ నినాదం లేదు
-సీఎం కావొచ్చు… కానీ ఉద్యమకారుడు కాలేడు
-ప్రజల కలలను నిజం చేసిన పార్టీ బీఆర్‌ఎస్
-తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో మాజీ మంత్రి హరీష్‌రావు
సిద్దిపేట: బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సిద్దిపేట జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సతీష్‌కుమార్, రసమయి బాలకిషన్, ఇతర బీఆర్‌ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను హరీష్‌రావు, పార్టీ జెండాను కొత్త ప్రభాకర్ రెడ్డి ఆవిష్కరించారు. హరీష్‌రావు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు మన ప్రజల ఆకాంక్ష. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్‌ఎస్ పోరాటంతో రాష్ట్రం సిద్ధించింది. రాష్ట్ర ఏర్పాటు రాష్ట్ర ప్రజలకు పండగ. కొన్ని దశాబ్దాల పోరాటం వల్లనే తెలంగాణ వచ్చింది. ఈ కలను నిజం చేసిన పార్టీ బీఆర్‌ఎస్ అని పేర్కొన్నారు.
కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదు
సిద్దిపేటలో ప్రతి ఒక్కరూ ఉద్యమకారులే. మన సిద్దిపేట మట్టిబిడ్డలు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. 1969 ఉద్యమకారుడు డాక్టర్ రమణాచారిని సన్మానించాలని ఆహ్వానించాం. మోకాలి నొప్పితో రాలేకపోయినా ఆయన కృతజ్ఞతలు తెలు పుకుంటున్నాం. నందిని సిద్దారెడ్డి తెలంగాణ కోసం కవులను ఏకం చేశారు. ప్రమోషన్ కూడా వదులుకున్నారు. ఆయనను సన్మానించుకుంటున్నాం. రసమయి బాలకిషన్, దేశపతి శ్రీనివాస్, దేవీ ప్రసాద్, రామలింగారెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, లక్ష్మీకాంతరావు, జేఏసీ నాయకులను కూడా గౌరవించుకుంటున్నాం. వీళ్లు జైళ్లలో పడ్డారు…లాఠీ దెబ్బలు తిన్నారు. తెలంగాణ రాదని ఎంతోమంది నవ్వినా, నిరాశపరిచినా దీక్షతో పనిచేశారు. తుల ఉమ నల్గొండలో అద్భుత పోరాటం చేశారు. రోడ్డుపై బైఠాయించి రక్తసిక్తమయినా మొక్కవోని పోరాటం చేశారు. వీరిని గౌరవిం చుకోవడం మన కర్తవ్యం. సిద్దిపేట లేకుంటే కేసీఆర్ లేడు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదని తెలిపారు.
సీఎం అయినా… ఉద్యమకారుడు కాలేడు
రాష్ట్ర అవతరణ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పత్రికా ప్రకటనల్లో ఎక్కడా జై తెలంగాణ లేదు. బీఆర్‌ఎస్ హయాంలో ఇచ్చిన ప్రకటనల్లో కచ్చితంగా ఉండేది. ఆరోజు సమైక్య పాలనలో జై తెలంగాణ మాటను నిషేధించారు. ఇప్పుడు రేవంత్ పాలనతో తెలంగాణ పదం మాయమైంది. కేసీఆర్ లేకపోతే తెలంగాణ సోయిని ఖతం చేస్తారు. రేవంత్ ఎన్నడూ జై తెలంగాణ అనలేదు. ఆయన సీఎం కావొచ్చు. తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన ద్రోహిగా చరిత్రలో మిగిలిపోతాడు తప్ప ఉద్యమకారుడు కాలేడు. ఉద్యమకారులన్న ఘనత మనకు దక్కుతుంది.
కార్యకర్త దూళికున్న విలువ రేవంత్‌కు లేదు
దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ రేవంత్ సీఎం కావచ్చు, రేపు అంతకంటే పెద్ద పీఠం ఎక్కవచ్చు. కానీ, తెలంగాణ ఉద్యమకారుడు అనే కీర్తి రేవంత్ రెడ్డి చచ్చి పిడికెడు మన్ను బుక్కినా రాదు. సిద్దిపేటలో ఉండి పోరాడిన ఒక తెలంగాణ పోరాట కార్యకర్త పాద దూళికున్న విలువ కూడా రేవంత్ రెడ్డికి లేదు.