‘సాక్షి’ త‌ప్పుడు రాత‌ల మూల్యం రూ.75 కోట్లు?

– జ‌గ‌న్ మీడియాపై కొన‌సాగుతున్న నారా లోకేష్ న్యాయ‌పోరాటం
– తాను వేసిన ప‌రువున‌ష్టం కేసులో మ‌రోసారి క్రాస్ ఎగ్జామినేష‌న్‌
– 18న విశాఖ 12వ అదనపు జిల్లా కోర్టులో విచార‌ణకు హాజ‌రు కానున్న మంత్రి

అమరావతి, మహానాడు: చిన‌బాబు చిరుతిండి.. 25 ల‌క్ష‌లండి పేరుతో ‘సాక్షి’లో అచ్చేసిన క‌థ‌నంపై నారా లోకేష్ త‌న న్యాయ‌పోరాటం కొన‌సాగిస్తున్నారు. ఉద్దేశ‌పూర్వ‌కంగా త‌న ప‌రువు ప్ర‌తిష్ఠల‌కు భంగం క‌లుగ‌జేసేందుకు ఆ క‌థ‌నం అవాస్త‌వాల‌తో వేశార‌ని, రూ.75 కోట్ల‌కు ప‌రువున‌ష్టం కేసుని నారా లోకేష్ త‌ర‌ఫున సీనియ‌ర్ న్యాయ‌వాది దొద్దాల కోటేశ్వ‌ర‌రావు విశాఖ 12వ అదనపు జిల్లా న్యాయస్థానంలో దాఖ‌లు చేశారు. కేసు విచార‌ణ వివిధ ద‌శ‌లు దాటుకుని ఆగ‌స్టు 29న లోకేష్ క్రాస్ ఎగ్జామినేష‌న్ జ‌రిగింది. మ‌రోసారి క్రాస్ ఎగ్జామినేష‌న్ 18వ తేదీ శుక్ర‌వారం జ‌ర‌గ‌నుండ‌డంతో మంత్రి నారా లోకేష్ కోర్టుకి హాజ‌రు కానున్నారు.

చినబాబు చిరుతిండి.. 25 లక్షలండి శీర్షికతో 2019 అక్టోబర్ 22న సాక్షిప‌త్రిక‌లో క‌ల్పిత క‌థ‌నం ప్ర‌చురించారు. దీనిపై తెలుగుదేశం పార్టీ(టీడీపీ) జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ త‌న న్యాయవాదుల ద్వారా రిజిస్టర్ నోటీసుని సాక్షికి పంపించారు. సాక్షి ఎటువంటి వివ‌ర‌ణ వేయ‌క‌పోవ‌డం, నోటీసుల‌కు స్పందించ‌క‌పోవ‌డంతో సాక్షిపై రూ.75 కోట్ల‌కు పరువునష్టం దావా వేశారు. సాక్షిలో ప్రచురించిన తేదీల్లో అసలు తాను విశాఖలోనే లేనని, ఉద్దేశ‌పూర్వ‌కంగా త‌న‌ను అభాసుపాలు చేసేందుకు వండివార్చిన క‌థ‌నం అని తేలింద‌ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మంత్రిగా విశాఖపట్నం చాలాసార్లు వ‌చ్చినా, ఎయిర్ పోర్ట్ లో ఎటువంటి ప్రోటోకాల్ సౌకర్యాలు తాను స్వీకరించలేదని, త‌ప్పుడు క‌థ‌నం రాసి త‌న ప‌రువుకి భంగం కలిగించిన సాక్షిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని లోకేష్ కోరుతున్నారు.