ప్రజల ప్రశాంత జీవనానికి కృషి చేయండి

-ఎస్పీని కలిసిన టీడీపీ ఇంచార్జ్ గొట్టిపాటి లక్ష్మి 

ఒంగోలు, మహానాడు: సామాన్య ప్రజానీకానికి ప్రశాంతమైన జీవితం ఉండేవిధంగా లా అండ్ ఆర్డర్ ఉండాలని అందుకు పోలీస్ సిబ్బంది సహకారం అందించాలని దర్శి నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ గొట్టిపాటి లక్ష్మి ఎస్పీని కోరారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్పీ దామోదర్ ను ఒంగోలు ఎస్పీ బంగ్లాలో గురువారం డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, డాక్టర్ కడియాల లలిత్ సాగర్  భేటీ అయ్యారు.

ఈ సందర్బంగా గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ..  గత ఎన్నికల్లో వైసీపీ ఏకపక్ష దాడులు దౌర్జన్యాలపై పెండింగ్లో ఉన్న కేసులపై చర్యలు తీసుకోవాలని కోరారు.  దర్శి నియోజకవర్గంలో శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అదేవిధంగా నియోజకవర్గంలోని పోలీస్ సిబ్బంది నియామకాలపై కూడా ఎస్పీతో సుదీర్ఘంగా చర్చించారు. ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆమె కోరారు.

చర్చించిన అంశాలపై ఎస్పీ సానుకూలంగా స్పందించారు. నియోజకవర్గంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ పరంగా సంపూర్ణ సహకారం అందిస్తామని ఎస్పీ హామీ ఇచ్చినట్లు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ తెలిపారు.  అదేవిధంగా ఎన్నికల సందర్భంలో జరిగిన దౌర్జన్యాలు దాడుల పెండింగ్ కేసులపై కూడా చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చినట్లు వివరించారు.