జర్నలిస్టు సంక్షేమానికి కృషి

– అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ళు
– ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు

వినుకొండ, మహానాడు: జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించి, వారి సంక్షేమానికి కృషి చేస్తానని వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. పట్టణంలోని నరసరావుపేట రోడ్ల గల కల్యాణ మండపంలో బుధవారం సీనియర్ జర్నలిస్ట్ రాజవరపు ప్రకాష్ రావు అధ్యక్షతన జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించగా ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జున రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జర్నలిస్టులను ఉద్దేశించి మాట్లాడారు. జర్నలిస్టుల అభ్యున్నతికి ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. వినుకొండ నియోజకవర్గం లోని జర్నలిస్టులకు ప్రభుత్వం నుండి ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు.

అలాగే జర్నలిస్ట్ కాలనీలో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్తు తదితర మౌలిక వసతులు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. నివేశన స్థలాలు లేని జర్నలిస్టులు ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోవాలని, వారికి వెంటనే ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని తెలిపారు. 25 ఏళ్ల తన రాజకీయ ప్రస్థానంలో జర్నలిస్టులు అందించిన సహాయ సహకారాలను తాను మరువలేనని వారికి రుణపడి ఉన్నానని అన్నారు. జర్నలిస్టుల సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేసే జర్నలిస్టులు వినుకొండ నియోజకవర్గ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని కోరారు.

అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన సలహాలు, సూచనలు అందించి జర్నలిస్టులందరూ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జున రావులు ఘనంగా సన్మానించారు. అనంతరం శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ సహకారంతో నియోజకవర్గ జర్నలిస్టులకు ఏర్పాటుచేసిన ప్రమాద బీమా కార్డులను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో వినుకొండ నియోజకవర్గ జర్నలిస్టులు పాల్గొన్నారు.