– భారతీయ తత్వ బోధనలను పాఠశాల విద్యా ప్రణాళికలో భాగం చేయాలి
– భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు
గుంటూరు, మహానాడు: నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు భారతీయ తత్వ చింతనే పరిష్కారమని భారత పూర్వ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు చెప్పారు. ప్రముఖ భారతీయ తత్వవేత్త ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి శత జయంతి సందర్భంగా సోమవారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ సచ్చిదానంద మూర్తి సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ ఆఫ్రో-ఏషియన్ ఫిలాసఫీ నిర్వహించిన ప్రత్యేక సదస్సుకు వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కొత్త సచ్చిదానందమూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించి పుష్పాంజలి ఘటించారు. ఇప్పటివరకు ముద్రితం కాని ఆచార్య సచ్చిదానందమూర్తి రచనలను ” ఆన్ ఎడ్యుకేషన్& ది ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్ ” పేరుతో ప్రొఫెసర్ అశోక్ వోహ్రా, కె. రమేష్ సంపాదకత్వంలో తీసుకువచ్చిన పుస్తకాన్ని, ఆయన స్మృతి చిహ్నంగా తీసుకువచ్చిన పోస్టల్ కవర్ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ “ఆధునిక విద్యాభ్యాసంలో తత్వశాస్త్రం ఒక ప్రత్యేక విభాగంగా రూపుదిద్దుకోవడం మనిషి వికాసానికి , సమాజ వికాసానికి ఎంతో మేలు చేసే విషయం. అయితే ఒక ప్రత్యేక భాగానికే పరిమితం కాకుండా బాల్యదశ నుంచే పాఠ్య ప్రణాళికలో మన తత్వ విజ్ఞానాన్ని క్రమబద్ధమైన భాగంగా చేయడం వల్ల దీర్ఘాకాలికంగా దేశానికి ఎంతో ప్రయోజనకరం ” అని సూచించారు. వివిధ ఉపనిషత్తుల్లో మహర్షులు చేసిన బోధనలను ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు ఉటంకించారు. వృక్షో రక్షిత రక్షితః, వసుదైక కుటుంబకం, మానవసేవే మాధవసేవ, అహింసా పరమో ధర్మః వంటి ఎన్నో తాత్విక బోధనలు ప్రపంచ సమస్యలకు కచ్చితంగా పరిష్కారం చూపిస్తాయి అని స్పష్టం చేశారు.
విద్యార్థి దశలోనే సరైన, సానుకూల బీజాలు నాటగలిగినప్పుడే మంచి పౌరులు, తద్వారా మంచి సమాజం ఏర్పడుతుందని చెప్పారు. భారతీయ తత్వ దర్శనమే ఇందుకు సరైన పరిష్కారం అన్నారు. ” ప్రపంచం నలుమూలల విస్తరిస్తున్న పెడపోకడలకు భిన్నమైన సమాజంగా మనం ఎదగాలన్నా, ప్రపంచం మనల్ని అనుసరించాలన్నా తిరిగి మనం మన మూలాలకు వెళ్లాలి. మన విద్యా విధానాన్ని సమూలంగా మార్చుకోవాలి. నూతన విద్యా విధానం ఈ దిశగా కృషి చేస్తోంది. ” అని పేర్కొన్నారు. “జీవ చైతన్యం, జీవితపు చైతన్యం విషయంలో భారత ఉపఖండం కొన్ని వేల సంవత్సరాలుగా మిగిలిన ప్రపంచం కన్నా ముందు ఉంది. విశ్వ గురువుగా ఆవిర్భవించింది. ప్రపంచం నలుమూలల ఎంతోమందికి చైతన్యపు వెలుగులను చూపించింది.
భారత ఉపఖండంలో ఈ జిజ్ఞాసతోనే ఎందరో రుషులు, మహర్షులు అవతరించారు. వేద వేదాంగాలు, ఉపనిషత్తులు, బ్రహ్మ సూత్రాలు, త్రిపిటికలు అవతరించాయి. తత్వాన్ని బోధపరిచాయి. బోధపరుస్తూనే ఉన్నాయి. భారతీయ తత్వశాస్త్రంలో అటు లౌకిక, ఇటు అలోకిక చింతనలు ఎన్నో ఉన్నాయి. ఆధ్యాత్మిక, తార్కిక, శాస్త్ర విజ్ఞాన చింతనలు ఇమిడి ఉన్నాయి. ఇంతటి బహుళ తాత్వికచింతనలు ప్రపంచంలోని మరే దేశంలోనూ ఆవిర్భవించలేదు.తత్వపు వెలుగులను ప్రసరింప చేయడానికి ఈ పుణ్య భూమిలో ఎందరో మహనీయులు తమ జీవితాలను ధారపోశారు. ” అని చెప్పారు. 20వ శతాబ్దంలో జిడ్డు కృష్ణమూర్తి , డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ తర్వాత భారతీయ తత్వ శాస్త్రాన్ని విశ్వవ్యాప్తం చేసిన గొప్ప జ్ఞాని కొత్త సచ్చిదానందమూర్తి అని అన్నారు. “జ్ఞాన సముపార్జనలో, దాన్ని పదిమందితో పంచుకోవడంలో వారు చూపిన తపన నేటి తరానికి స్ఫూర్తిదాయకం.” అని వెంకయ్య నాయుడు చెప్పారు. ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన సచ్చిదానంద మూర్తి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన స్థాయికి ఎదగడం వెనక ఆయన స్వయంకృషి ఉందన్నారు. సచ్చిదానందమూర్తి భారతీయ తత్వాన్ని అణువణువునా జీర్ణించుకొని ఆచరించి చూపిన ఆధునిక ఋషి అని అన్నారు. “భారతీయ తత్వ దర్శనం లోనే కాకుండా ఇతర దేశాల్లోని తత్వచింతనలను కూడా పూర్తిగా ఆకళింపు చేసుకున్న గొప్ప జ్ఞాన నిధి.” అని చెప్పారు.
“షేర్ అండ్ కేర్ ఈజ్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ.
సంపదను గాని, విజ్ఞానాన్ని గాని పదిమందితో పంచుకోవాలని భారతీయ సనాతన ధర్మం బోధిస్తోంది. పంచుకుంటే పెరుగుతుంది కానీ తగ్గదు. ఈ సనాతన ధర్మాన్ని అణువణువున నింపుకొని ఆయన ఆచరించి చూపించారు. తన విజ్ఞానాన్ని జీవితమంతా పంచుతూనే ఉన్నారు. తాను పుట్టి పెరిగిన ప్రాంతంలో విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సచ్చిదానంద మూర్తి పేరిట ప్రొఫెసర్ సచ్చిదానంద మూర్తి సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ ఆఫ్రో-ఏషియన్ ఫిలాసఫీ పేరుతో తత్వ శాస్త్ర కేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. నేటి తరం విద్యార్థులు కొత్త సచ్చిదానందమూర్తి ని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె.గంగాధర రావు మాట్లాడుతూ పద్మవిభూషణ్ ప్రొఫెసర్ సచ్చిదానంద మూర్తి ప్రపంచ తత్వవేత్తలలో ఒకరుగా నిలుస్తారని పేర్కొన్నారు. తత్వశాస్త్రంలో తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీకగా ఆయన నిలుస్తారని పేర్కొన్నారు. గుంటూరు జిల్లా సంగం జాగర్లమూడి ప్రాంతానికి చెందిన కొత్త సచ్చిదానందమూర్తి సాధారణ ప్రొఫెసర్ స్థాయి నుంచి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వైస్ చైర్మన్ గా ఎదగడం తెలుగు వారికి గర్వకారణం అని పేర్కొన్నారు. సచ్చిదానందమూర్తి రచనలు నేటి ఆధునిక జీవన స్థితిగతులకు మార్గదర్శకాలుగా నిలుస్తాయని పేర్కొన్నారు.సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన ఆయన తెలుగుజాతి గర్వించేలా ఎదిగారని ఆయన జన్మించి శత వసంతాలైన సందర్భంగా ఆయనను గౌరవించుకోవడం యూనివర్సిటీ బాధ్యతగా పేర్కొన్నారు .
అవని గడ్డ శాసన సభ్యుడు మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ ఆదర్శ తత్వవేత్త ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి అని , తత్వశాస్త్రంలో తెలుగు జాతీ కీర్తి ప్రతిష్టాలను ఇనుమడింప చేసిన మహానీయుడని , ఆయన శత జయంతి వేడుకల్లో పాల్గొనడం సంతోషాదాయకమన్నారు. తెలుగు జాతిలో ఎంతో మంది మహనీయులు జన్మించారని , వారి గురించి ఈతరం వారికి తెలియదని, వారి రచనలు నేటి తరానికి పరిచయం చేసేందుకు రెండు రోజులు జాతీయ సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు.
ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఏర్పడక ముందు నల్లపాడులో ఏర్పాటు చేసిన పీజీ సెంటర్ కు ఆయన స్పెషల్ ఆఫీసర్ గా పని చేశారని , వారి స్పూర్తితోనే పెదనందిపాడు , తాడికొండ లలో పీజీ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తెలుగు జాతీ గర్వించదగ్గ వ్యక్తని , ప్రపంచ శాంతి కోసం పరితపించిన వ్యక్తని , ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆశించిన వ్యక్తని , భారత దేశంలో కులతత్వం పోవాలని ఆశించిన వ్యక్తని , అన్ని మతాలను సమానంగా చూసిన వ్యక్తని , అన్ని మత గ్రంధాలను , అన్ని మతాల సారాంశాన్ని ఆకళింపు చేసుకున్న వ్యక్తన్నారు. తత్వ శాస్త్రమే కాకుండా, విద్యా వ్యాప్తికి కృషి చేసిన మహానీయుడని తెలిపారు.
కార్యక్రమంలో కైకలూరు శాసన సభ్యుడు డాక్టర్ కామినేని శ్రీనివాస్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, సదస్సు కన్వీనర్ ప్రొఫెసర్ ఎం. త్రిమూర్తి రావు, ప్రొఫెసర్ అశోక్ వోహ్రా , ప్రొఫెసర్ కెఎస్ చలం , రెక్టర్ ప్రొఫెసర్ కె.రత్న షీలా మణి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి. సిoహాచలం, ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సిహెచ్ స్వరూపారాణి, ప్రొఫెసర్ ఎన్వీ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.