– ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపణ
ఎండుగుంపాలెం, మహానాడు: ఎన్నికల్లో 151 నుంచి 11 సీట్లకు కుప్పకూలిపోయినా చేసిన తప్పులు తెలుసుకోని జగన్, వైసీపీ నాయకులు అధికారులపై బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు దిగుతున్నారని మాజీ మంత్రి, తెలుగు దేశం పార్టీ(టీడీపీ) చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. త్వరలో ఎన్నికలంటూ కలల్లో విహరిస్తూ అదే బూచీతో దొంగదారుల్లో అధికారులను లొంగదీసుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లె పండగ కార్యక్రమంలో భాగంగా చిలకలూరిపేట మండలం గోపాళంవారిపాలెం, నాదెండ్ల మండలం ఎండుగుంపాలెంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు భూమి పూజ చేశారు.
గోపాళంవారిపాలెంలో కోటి రూపాయలతో 4 కిలోమీటర్ల మేర ఆర్ అండ్ బి రహదారి, రూ.15 లక్షలతో సీసీ రహదారులు, డ్రైన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి శిలాఫలకాలు ఆవిష్కరించారు. ఎండుగుంపాలెంలో రహదారులు, డ్రైన్ల నిర్మాణ పనులకు భూమిపూజ చేసి శిలాఫలకాలను ఆవిష్కరించారు. రూ.55 లక్షల వ్యయంతో ఎండుగుంపాలెం నుంచి అప్పాపురం వరకు డొంకరోడ్డు పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందన్నారు. రహదారుల నిర్మాణాలకు నిధులు విడుదల చేసిందన్నారు.