• ఓట్లు వేయలేదని నాడు గ్రామంపై కక్ష.. అభివృద్ధి పనులను అడ్డుకున్న వైనం
• అంధుడి పొలంపై వైసీపీ రాబందుల కన్ను.. దొంగ పత్రాలతో దోపిడీ
మంగళగిరి, మహానాడు: బాపట్ల జిల్లా, చీరాల మండలం, దేవాంగపురి గ్రామానికి చెందిన ఓ వివాహిత తన ఆవేదనను వ్యక్తం చేస్తూ.. ఐప్యాక్ లో పనిచేసి, వైసీపీ కోసం ప్రచారం చేస్తూ.. నాడు ప్రత్యక్షంగా టీవీలకు దొరికిన తన మరిది వైసీపీకి అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ ఉంటాడని.. ఇప్పుడు తన కాపురంలో చిచ్చుపెట్టేందుకు యత్నిస్తున్నాడని ఆమె గ్రీవెన్స్‌కు ఫిర్యాదు చేసింది. తన పట్ల అసభ్యంగా ప్రవరిస్తున్నాడని.. తన భర్తను తన నుండి వేరుచేసేందుకు కుట్ర చేస్తున్నాడని.. అదనపు కట్నం కోసం వేధిస్తూ.. అత్తమామలు చిత్రహింసలు పెడుతున్నారని.. ప్రాణ భయంతో పుట్టింటికి వచ్చి తన గోడును ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇక్కడి గ్రీవెన్స్ లో మొరపెట్టుకుంటున్నట్టు తెలిపింది. తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలు మంత్రి కొలుసు పార్థసారథి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, పార్టీ బీసీ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గురుమూర్తిలకు తన ఆవేదనను చెప్పింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంది. వినతిని స్వీకరించిన నేతలు విచారించి న్యాయం చేసేలా ఆ మహిళకు భరోసా కల్పించారు.
• గుంటూరు జిల్లా పొన్నూరు మండలం తక్కెళ్లపాడుకు చెందిన నందపాటి బసవయ్య విజ్ఞప్తి చేస్తూ.. గత టీడీపీ ప్రభుత్వంలో తమ గ్రామం రామచంద్రపాలెం వెళ్లే డొంక నుండి గుంటూరు ఛానల్ వరకు 300 మీటర్లు ఫోర్త్ ఫైనాన్స్ నిధులతో పైప్ లైన్ శాంక్షన్ చేశారని దాన్ని అనంతరం వచ్చిన వైసీపీ ప్రభుత్వంలో అప్పటి వైసీపీ ఎమ్మెల్యే తమ గ్రామంపై కక్ష గట్టి పనులను అడ్డకున్నారని.. దయచేసి ఆగిపోయిన పైప్ లైన్ పనులను కొనసాగించాలని వేడుకున్నాడు.
• తాను అంధున్ని అని నీకెందురా… పొలం అంటూ బూతులు తిడుతూ .. తన పొలంకు నకలీ పత్రాలు సృష్టించి వైసీపీ నేతలు కాటూరి నరసింహరావు, కాటూరి వెంకటేశ్వర్లు అధికారులకు లంచాలు ఇచ్చిన తన పొలాన్ని కబ్జా చేసి పాస్ పుస్తకాలు తెచ్చుకున్నారని.. దయచేసి వాస్తవాలు విచారించి న్యాయం చేయాలని ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన బోయపాటి వెంకటరామయ్య నేతలను విజ్ఞప్తి చేశాడు.
• సొంత ఊరిలో ఉపాధి లేక బతుకుదెరువు కోసం దాదాపు 150 కుటుంబాలు విజయవాడ మంగళగిరికి వలస వచ్చామని.. తమకు ఇక్కడ ఉపాధి అవకాశం కల్పించి ఆదుకోవాలని కర్నూలు జిల్లా ఆలంకొండ గ్రామానికి చెందిన పలువురు బాధుతులు గ్రీవెన్స్ లో నేతలకు విన్నవించుకొన్నారు.
• అన్నమయ్య జిల్లా, తంబల్లపల్లి పెద్దమండ్యంకు చెందిన పలువురు టీడీపీ నేతలు విజ్ఞప్తి చేస్తూ.. పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డికి పీఏగా వ్యవహరిస్తున్న హేమంత్ మండల ఎంపీడీఓకు బామ్మర్ధి అవుతాడని.. హేమంత్ ద్వారా వైసీపీకి ఎంపీడీఓ టీడీపీ, ప్రభుత్వ రహస్యాలు చేరవేస్తున్నాడని.. హేమంత్ అరాచకాలు గత వైసీపీ ప్రభుత్వంలో చాలా దారుణంగా ఉండేవని.. పది సంవత్సరాల నుండి తిష్ఠ వేసిన ఎంపీడీవోను వెంటనే బదిలిచేస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని వారు కోరారు.
• అనకాపల్లి జిల్లా, మాకవరపాలెం గ్రామానికి చెందిన సత్యనారాయణ విజ్ఞప్తి చేస్తూ.. తాము తీర్థయాత్రలకు వెళితే 2023 ఏప్రిల్ 12న తమ ఇంట్లో దొంగలు పడి 18 తులాల బంగారం, రెండు కిలోల వెండి ఖరీదైన వస్తువులు పోయాయని.. దొంగతనంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడంలేదని.. తమకు న్యాయం చేయాలని నేతలను వేడుకున్నారు.
• కర్నూలు జిల్లా ఆలూరు మండలం హత్తిబెళగల్ గ్రామానికి చెందిన హెచ్. పి మల్లన్న గౌడ్ విజ్ఞప్తి చేస్తూ.. తనకు తన తండ్రి నుండి వారసత్వంగా వచ్చిన భూమిని ఎండోమెంట్ భూమిగా చూపిస్తున్నారని.. దాంతో భూమిపై హక్కులు లేకుండా ఉందని.. ఎండోమెంట్ నుండి తొలగించి భూమిని వారసత్వంగా చూపించాలని వేడుకున్నారు.
• అన్ని దేవాలయాల్లో ఆలయ ట్రస్ట్ బోర్డులలో విశ్వబ్రాహ్మణులకు నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యం కల్పించాలని ఏపీ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు గ్రీవెన్స్ లో నేతలకు అర్జీ ఇచ్చి విన్నవించుకొన్నారు.
• తండ్రి కొనుగోలు చేసి తనకు వారసత్వంగా వచ్చిన భూమి కోర్టులో ఉండగా అక్రమార్కులు దౌర్జన్యంగా దున్నుతున్నారని… దీనిపై అధికారులు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని దయచేసి వారిపై చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం సానికవరం గ్రామానికి చెందిన ఆర్ డి. ప్రకాష్ అనే వ్యక్తి గ్రీవెన్స్ లో వేడుకున్నారు.