వైసీపీ విద్యుత్ రంగాన్ని నాశనం చేసింది

– రూ.4.70లకు కొనాల్సిన యూనిట్ విద్యుత్ ను రూ.7.61లకు కొని ప్రజలపై భారం వేశారు
– ఐదేళ్ల విధ్వంసంతో విద్యుత్ రంగానికి రూ.1,29,503 కోట్ల నష్టం
– గత ప్రభుత్వం విధ్వంసం చేసిన విద్యుత్ రంగాన్ని గాడిన పెడతాం
– ఆంబోతుల్లా సోషల్ మీడియాలో ఆడబిడ్డలపై పోస్టింగులు పెడితే వదిలి పెట్టాలా?
– భావప్రకటన స్వేచ్ఛ అంటే అసభ్యకరమైన, అశ్లీల పోస్టులు పెట్టడమా?
-ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
– తాళ్లాయపాలెంలో రూ.505 కోట్లతో నిర్మించిన విద్యుత్ ఉపకేంద్రాన్ని ప్రారంభించిన సీఎం
– రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విద్యుత్ ప్రాజెక్టులకు వర్చువల్ గా సీఎం శంకుస్థాపన

అమరావతి : ‘రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ వినియోగదారులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు శ్రీకారం చుట్టాం. మేం వచ్చాక భ్రష్టుపట్టిన అన్ని వ్యవస్థలను గాడిన పెడుతున్నాం. వారసత్వంగా వచ్చిన సమస్యలను పరిష్కరిస్తున్నాం. 2019లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేసింది. రూ.1.26 లక్షల కోట్లు విద్యుత్ రంగంలో అప్పులు చేశారు. దొరికినచోటల్లా అప్పులు తెచ్చారు. ప్రభుత్వ కార్యాలయాలు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చార ని సీఎం చంద్రబాబునాయుడు గత సర్కారు నిర్వాకాలపై విరుచుకుపడ్డారు.

‘ సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టులతో చేసుకున్న ఎంఓయూలు రద్దు చేసి వేధించారు. దేశం మొత్తం ఛీ కొట్టింది. దేశానికే పెట్టుబడులు రావని హెచ్చరించినా వినలేదు. సోలార్ ప్యానెల్ కు చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఖర్చు చేయాల్సి ఉంది..కానీ ప్యానెల్స్ నుండి వచ్చే విద్యుత్ ను తీసుకోలేదు. దీంతో విద్యుత్ వాడకుండానే రూ.9 వేల కోట్లు డబ్బులు చెల్లించాల్సి వచ్చింది. రూ.9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారు. రూ.32 వేల కోట్లకు పైగా భారాన్ని వినియోగదారులపై మోపారు. నాటి శని ఇంకా కొనసాగుతుంది. విండ్ పవర్ వాడకపోవడంతో రూ.500 కోట్లు కట్టారు. హిందూజా వద్ద ఒప్పందం ప్రకారం కొనుగోలు చేయకపోవడంతో రూ.1,235 కోట్లు చెల్లించారు.

కృష్ణపట్నం, వీటీపీఎస్ పూర్తి చేయకపోవడంతో ఇప్పుడు ఖర్చులు పెరిగాయి. పోలవరం హైడల్ ప్రాజెక్టు పూర్తి చేయకపోవడంతో దానికి కూడా ఇప్పుడు భారం పడుతోంది. దుర్మార్గులకు అధికారం ఇచ్చినందుకు పరిహారం ప్రజలు చెల్లించాల్సి వస్తోంది. ప్రజల సొమ్మును ఇష్టారీతిన దుర్వినియోగం చేశారు. రాబోయే ఐదేళ్లలో విద్యుత్ ఛార్జీలు పెంచబోం’ అని సీఎం చంద్రబాబు అన్నారు.

రాజధాని పరిధిలోని తుళ్లూరు మండలం తాళ్లాయపాలెంలో రూ.505 కోట్లతో నిర్మించిన 400/220 కేవీ గ్యాస్ ఇన్సులేటెడ్ విద్యుత్ ఉపకేంద్రాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఇదే ప్రాంగణం నుండి రాష్ట్రంలో రూ.702 కోట్లతో నిర్మించిన 5 సబ్ స్టేషన్లు ప్రారంభించి, రూ.4,665 కోట్లతో చేపట్టనున్న 14 ఏపీ ట్రాన్స్ కో పనులకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రసంగించారు.

దేశంలోనే మొదటి సారి విద్యుత్ సంస్కరణలు

‘నేను రాజకీయాల్లోకి రాకముందు రాష్ట్రంలో విద్యుత్ సరిగా ఉండేది కాదు. 1950లో కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో మాత్రమే కరెంట్ ఉండేది. కానీ ఇప్పుడు మన ఇంట్లోనే విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటున్నాం. నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అసెంబ్లీలో విద్యుత్ కోతలపై చర్చలు జరిగేది. సమైఖ్య రాష్ట్రంలో కరెంట్ సరిగా లేక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ధర్నాలు చేసేవారు. వేసిన పంట ఇంటికి వస్తుందా లేదా అన్న అనుమానం కలిగేది. కానీ నాడు దేశంలోనే మొదటి సారి మన రాష్ట్రంలో సంస్కరణలు తీసుకొచ్చాం.

దూరదృష్టితో తెస్తున్నామని చెప్తే విమర్శలు చేశారు. విద్యుత్ ఉంటేనే అభివృద్ధి, పేదరికం పోతుందని చెప్పి 1998లో సంస్కరణలతో పాటు రెగ్యులేటరీ కమిషన్ తెచ్చాం. కరెంట్ బిల్లులు కట్టలేదని నాటి పాలకులు రైతులను నిందించారు. సరిగ్గా ఆడిటింగ్ ఉండేది కాదు. కానీ మనం తెచ్చిన సంస్కరణలు దేశం మొత్తం అమలు చేసింది. 2004లో దిగిపోయే నాటికి మిగులు విద్యుత్ సాధించాం… ఎంత మందికి కనెక్షన్లు కావాలన్నా ఇచ్చి లో-ఓల్టేజ్ లేకుండా చేశాం. మళ్లీ 2014లో ముఖ్యమంత్రి అయ్యే నాటికి 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత ఉంది. వ్యవసాయానికి కూడా సరిగ్గా విద్యుత్ ఇవ్వలేని పరిస్థితి ఉంది.

ఆ ఇబ్బందులన్నీ అధిగమించి 4 నెలల్లోనే కోతల్లేని విద్యుత్ అందించాం. తలసరి విద్యుత్ వినియోగాన్ని, ఉత్పత్తిని పెంచాం. మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చడంతో పాటు ఐదేళ్లలో ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదు. మనకు వరంగా భగవంతుడు సూర్యరశ్మి ఇచ్చాడు… సోలార్ పెట్టుకుంటే విద్యుత్ ను వినియోగించుకుని తక్కువ మోతాదులో బిల్లులు పొందవచ్చు. పంప్డ్ ఎనర్జీ విధానం కూడా వచ్చింది. కరెంట్ ఉత్పత్తిలో వినూత్న మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు బొగ్గు, జల విద్యుత్ మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు గ్యాస్, ఎండ, గాలితో విద్యుత్ తయారు విధానం వచ్చింది.’ అని అన్నారు.

అవినీతి కక్కుర్తితో ఎక్కువ ధరకు విద్యుత్ కొన్నారు

‘అమరావతిని ఎడారిగా చేశారు. పోలవరాన్ని నాశనం చేశారు. శాఖలపై సమీక్షలు చేస్తుంటే ఆశ్చర్యమైన విషయాలు బయటకు వస్తున్నాయి. మద్య నిషేధమని చెప్పి అధికారంలోకి వచ్చి ఐదేళ్లు దొంగసారా అమ్ముకున్నారు. 25 ఏళ్ల పాటు మద్యంపై ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు. నేను ప్రమాణస్వీకారం నుండి విద్యుత్ ఛార్జీలు పెంచలేదు. గత ప్రభుత్వం చేసిన అప్పులను తీర్చాలి. తప్పులు చేసిన వారు వెళ్లిపోయారు… మీరు కూడా కర్రుకాల్చి వాతలు పెట్టారు. నేను, నా మిత్రుడు డిప్యూటీ సీఎం పవన్ చరిత్రలో చూడని విజయం సాధించాం.
2022-23లో సర్ ఛార్జీల పేరుతో రెగ్యులేటరీ కమిషన్ కు పంపితే వాళ్లు అమలు చేశారు. వాళ్లు చేసిన పాపాన్ని మనం భరించాల్సి వస్తోంది. 2019-24 మధ్య 43,416 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోళ్లకు రూ.26 వేల కోట్లు ఖర్చు పెట్టారు. యూనిట్ ను రూ.7.61 రూపాయలకు కొన్నారు. అందుకే ముందుగానే అగ్రిమెంట్ చేసుకుంటే తక్కువ ధరకు వస్తుంది. మిగులు ఉంటే పవర్ గ్రిడ్ కు ఇవ్వవచ్చు. 2019కి ముందు యూనిట్ ధర రూ.4.70 పైసలకు కొంటే గత ప్రభుత్వం రూ.7.61లకు కొనుగోలు చేసింది. యూనిట్ ను రూ.3 లు అదనంగా కొనుగోలు చేశారు. కమీషన్లకు కక్కుర్తి పడి ఎక్కువ ధరకు విద్యుత్ కొన్నారు.’ అని అన్నారు.

గల్లా పెట్టెను ఖాళీ చేసి వెళ్లిపోయారు…కేంద్ర నిధులూ దారి మళ్లించారు

‘అధికారంలోకి వచ్చాం…నాటి పాలకుల తప్పులతో మాకు సమస్యలు మాములుగా లేవు. గల్లాపెట్టె ఖాళీ చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులు దారి మళ్లించారు. కేంద్రంలో నిబంధనలు ఉంటాయి… వాటికి అనుగుణంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఖర్చులకు యూసీలు ఇవ్వలేదు. జల్ జీవన్ మిషన్ కు 45 శాతం నిధులు వాటా ఇస్తే అవి కూడా దారి మళ్లించారు. వాటా ఇచ్చారు…వాటిని కూడా వేరే దానికి మళ్లించారు. రాష్ట్రంలో అన్ని రోడ్లపై గోతులు పెట్టారు. రోడ్లు నాగరికతకు చిహ్నం.

కానీ గత పాలకులు నరకానికి రహదారులుగా మార్చారు. రూ.860 కోట్లు ఖర్చు పెట్టి రోడ్లపై గుంతలు పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం… సంక్రాంతి నాటికి ఒక్క గుంత కూడా ఉండదు. రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల్లో 90 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను పెట్టారు. రాజకీయాల్లో ఉండటానికి అర్హతలేని వ్యక్తులు రాష్ట్రంలో ఉన్నారు. ఆడబిడ్డలను గత ప్రభుత్వం ఐదేళ్లు పెట్టిన ఇబ్బందులు చూశాను. అమరావతి మహిళల పోరాటాన్ని మనస్ఫూర్తిగా మెచ్చుకుంటున్నా. అమరావతిని కాపాడిన ఘనత మహిళలదే. భవిష్యత్తులో ఎవరు ఉద్యమం చేయాలన్నా అమరావతి రైతులను చూసి నేర్చుకోవచ్చు… ఉద్యమాలు చేసి అమరావతిని కాపాడారు. నెంబర్ 1 సిటీగా అమరావతిని తీర్చిదిద్దడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది.’ అని సీఎం అన్నారు.