వైసీపీ బీజేపీకి తొత్తు పార్టీ

ఏపీసీసీ సీనియర్ నేత మస్తాన్ వలి

విజయవాడ, మహానాడు: వైసీపీ బీజేపీకి తొత్తు పార్టీగా వ్యవహరిస్తుందని ఏపీసీసీ సీనియర్ నేత మస్తాన్ వలి అన్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తుందన్నారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కమిటీ సీనియర్ నేత మస్తాన్ వలి మాట్లాడుతూ…

తల్లికి వందనం పథకం మీద అధ్యక్షురాలిగా షర్మిల కూటమి సర్కార్ ను ప్రశ్నించారు. గత ప్రభుత్వం కూడా మోసం చేసిందని చెప్పారు. ఉన్న మాట చెప్తే జగన్ పార్టీకి ఉలుకు ఎందుకు? షర్మిల వ్యాఖ్యలను వక్రీకరించి అభూత కల్పనలు సృష్టిస్తున్నారు. షర్మిల అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకపోగా కాంగ్రెస్ మీద అక్కసు వెళ్లగక్కుతున్నారన్నారు.

ఇద్దరు పిల్లలకు అమ్మఒడి ఇస్తామని జగన్ అనలేదా? షర్మిలమ్మ చేత రాష్ట్ర వ్యాప్తంగా ఇద్దరు పిల్లలకు అమ్మఒడి ఇస్తామని చెప్పించలేదా? సమాధానం చెప్పకుండా మా మీద దుమ్మెత్తి పోస్తున్నారు. తెదేపాకు తొత్తుగా ఉండాల్సిన అవసరం మాకు లేదు. తెదేపాకు బి టీమ్ గా ఉండాల్సిన అవసరం కాంగ్రెస్ కి లేదు. తొత్తులుగా బీజేపీ పంచన చేరింది మీరే. స్పీకర్ ఎన్నికల్లో సైతం వైసీపీ బీజేపీకి మద్దతు ఇచ్చింది. వైసీపీ బీజేపీకి ఒక తొత్తు పార్టీ అని విమర్శించారు.

కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో ప్రజల పక్షంగా పని చేస్తుందన్నారు. వైసీపీ అమ్మఒడి పథకం ప్రకటనలో ఇద్దరి పిల్లలకు అని హామీ ఇచ్చారు. ఇది నిజం కాదా ? సమాధానం చెప్పాలి. సాక్షిలో మాపై తప్పుడు ప్రచారం మానుకోవాలన్నారు. చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన అమ్మకు వందనం పథకం అందరికీ వర్తింపజేయాలని షర్మిల డిమాండ్ చేశారని పేర్కొన్నారు.