• భర్త చనిపోతే భార్యకు తెలియకుండా భూమి కబ్జా
• రుణం ఇప్పిస్తానంటూ భారీ టోకరా
• తమకు న్యాయం చేయాలంటూ బాధితులు మొర
మంగళగిరి, మహానాడు: కడప – రేణిగుంట నేషనల్ హైవేలో తమ ఇళ్లు, షాపులు పూర్తిగా కోల్పోయామని.. నాడు తమకు న్యాయం కోసం వైసీపీ ఎమ్మెల్యేను వేడుకుంటే.. పరిహారం ఇప్పించకపోగా.. ఎమ్మెల్యే తమ వద్దకు పంపించిన వైసీపీ రేణిగుంట మండల నాయకుడు పరిహారం ఇప్పించడానికి ఒక్కొక్కరి వద్దనుండి రూ. 5 లక్షలు లంచం డిమాండ్ చేశాడని తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి బిసి కాలనీకి చెందిన బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. దానికి మేం అంగీకరించకపోవడంతో మాకు రావాల్సిన పరిహారాన్ని అడ్డుకున్నారని.. దయచేసి పరిహారం ఇప్పించి న్యాయం చేయాలని వారు బుధవారం ఇక్కడి తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలు మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, సీడాప్ చైర్మన్ గుణపాటి దీపక్ రెడ్డి, తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డిలకు విన్నవించుకొన్నారు. ఈ సందర్భంగా నేతలు బాధితుల నుండి అర్జీని స్వీకరించి న్యాయం చేస్తామని వారికి హామీ ఇచ్చారు.
• తిరుపతి జిల్లా తిరుపతిలోని కోర్లగుంట మారుతినగర్ కు చెందిన వి. రాధ, తదితరులు విజ్ఞప్తి చేస్తూ.. 5వ వార్డుకు చెందిన వైసీపీ నేతలు రోడ్డును ఆక్రమించి దారి లేకుండా చేస్తున్నారని గతంలో ఎన్నోసార్లు దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా గత ప్రభుత్వంలో ఎవరూ పట్టించుకోలేదని తమపై దయతో వైసీపీ నేతల కబ్జాపై విచారించి వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని వేడుకున్నారు.
• తన భర్త చనిపోతే.. తన పేరుమీద ఉన్న స్థలం కొట్టేసేందుకు తప్పుడు రికార్డులు సృష్టించి వైసీపీ నేతలు స్థలాన్ని కబ్జా చేశారని.. దీనిపై ఎంఆర్ పల్లె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని.. తనకు న్యాయం చేయాలని చిత్తూరు జిల్లా బంగారుపాళ్యానికి చెందిన డి. భారతి నేతలను విన్నవించారు.
• పిచ్చాటూరు మండల టీడీపీ అధ్యక్షలు మణియం తిరుమలై రెడ్డి విజ్ఞప్తి చేస్తూ.. సీసీ రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని, కాని కష్టపడిన తమకు పనులు దక్కకుండా.. వైసీపీ నేతల వద్ద లంచాలు తీసుకుని వారికి స్థానిక ఎమ్మెల్యే పనులు కట్టబెడుతున్నారని.. దయచేసి టీడీపీలో కష్టపడిన వారికి న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
• తనకు రుణం ఇప్పిస్తామని చెప్పి జిల్లా పరిశ్రమల కేంద్రం కాకినాడ కార్యాలయంలో సూపరెంటెండెంట్‌గా పనిచేస్తున్న పిల్లి రమేష్ అనే వ్యక్తి తమ వద్ద రూ. 19 లక్షలు డబ్బులు తీసుకుని మోసం చేశారని.. ఇప్పిస్తానన్న రుణం ఇప్పించకపోవడంతో ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమంటే తమను కులం పెరుతో తిట్టాడని.. అతనిపై చర్యలు తీసుకోవాలని పలువురు బాధితులు గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు.
• ఏలూరు జిల్లా పోలవరం మండలం కొరుటూరు గ్రామానికి చెందిన తిప్పర్తి నాగేశ్వరరావు విజ్ఞప్తి చేస్తూ.. ప్రభుత్వ భూసేకరణలో భాగంగా తన ఇంటిని కోల్పోవాల్సి వచ్చిందని దానికి ప్రభుత్వం పరిహారంగా ఐదు సెంట్ల ఇళ్ల స్థలం ఇస్తానని చెప్పి ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటికి ఎటువంటి స్థలం ఇవ్వలేదని.. దాంతో అద్దె ఇంట్లో ఉంటూ అద్దెలు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నట్టు తనకు ఆర్ఆండ్ ఆర్ ప్యాకేజ్ తో పాటు ఇల్లు ఇప్పించవలసిందిగా వేడుకున్నారు.
• రామకృష్ణ మిడోవ్స్ పేరుతో వెంచర్ వేశామని.. తమను నమ్మించి అందులో ఉండే మేనేజింగ్ పార్టనర్ అయిన కేపీవీ అంజనీకుమార్ తమ వద్ద రూ. 16,63,000 డబ్బులు తీసుకుని ప్లాట్ చూపించకుండా ఇబ్బంది పెడుతున్నారని.. ఆఫీసుకు వెళ్లి అడుగుతుంటే ఆఫీసులోకి రాకుండా అక్కడి సిబ్బంది ఇబ్బంది పెడుతున్నారని.. రామకృష్ణ మిడోవ్స్ నుండి తమకు ఫ్లాట్ వచ్చేలా న్యాయం చేయాలని చీరాలకు చెందిన జగన్మోహనరావు విజ్ఞప్తి చేశారు.