పేదల స్థలాలపై వైసీపీ నేతల కన్ను!

• దొంగ పత్రాలు సృష్టించి భూముల కబ్జా
• వైసీపీ భూ బకాసురల నుండి తమ స్థలాలు విడిపించాలంటూ బాధితుల మొర
• పరిశీలించి పరిష్కరించేలా అధికారులకు ‘గ్రీవెన్స్‌’ ఆదేశం

మంగళగిరి, మహానాడు: తమ స్థలంపై అప్పటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ, అతని తమ్ముడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డిల కన్నుపడి తమను బెదిరించి తప్పుడు కేసులు బనాయించి.. తమకు భూమి అమ్మిన వారితోనే మాచర్ల సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో దొంగ రిజిస్ట్రేషన్ చేయించి తమ భూమిని కొట్టేశారని.. దీనిపై విచారణ చేపట్టి తమకు న్యాయం చేసి తమ భూమిని తమకు ఇప్పించాలని ఓ బాధితుడు గ్రీవెన్స్‌లో మొరపెట్టుకున్నాడు. తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఇక్కడి కేంద్ర కార్యాలయంలో సోమవారం ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమం జరిగింది. మంత్రి కొలుసు పార్థసారథి, నేతలు వైకుంఠం ప్రభాకర్ చౌదరి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, తెలుగునాడు అంగన్వాడీ డ్వాక్రా సాధికార సంస్థ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత, అన్నాబత్తుల జయలక్ష్మి పాల్గొని, అర్జీలను స్వీకరించారు.

• అప్పటి వైసీపీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి, అతని సోదరుడు చంద్రశేఖర్ రెడ్డిలు, వారి అనుచరులు అక్రమంగా తనభూమిని కొట్టేసి అమ్ముకున్నారని.. కోర్టు నుండి స్టేఆర్డర్ తెచ్చినా వారి దౌర్జన్యాలకు నాడు అడ్డు అదుపులేకుండా పోయిందని.. వారిని కఠినంగా శిక్షించి తన భూమిని తనకు అప్పగించాలని టీడీపీ స్టేట్ లీగల్ సెక్రటరీ పి.లక్ష్మన్న గ్రీవెన్స్ లో విజ్ఞప్తి చేశారు.

• మాజీ ఉపముఖ్యమంత్రి అంజాద్ బాష, అతని తమ్ముడు అహ్మద్ బాష, అల్లావుద్దీన్, షంషీర్, జమీల్, అబ్దుల్, ఖాదర్, గయాజ్ హనిదుద్దీన్ లు పేదలమైన తమ భూములకు దొంగ పత్రాలు సృష్టించి అక్రమంగా భూములను కబ్జా చేశారని.. భూమి కబ్జాపై వెళ్లి అడిగితే దౌర్జన్యం చేస్తున్నారని.. అధికారులకు పలుమార్లు అర్జీలు పెట్టుకున్న పట్టించుకోలేదని.. తమకు న్యాయం చేసి ఆదుకోవాలని కడప జిల్లా కడపకు చెందిన వి.శోభారాణి విజ్ఞప్తి చేశారు.

• వైసీపీ నేతలు ఎం.అశోక్, వి.విజయ్ కుమార్ లు చీకట్లో తమ ఇంటికి 15 మంది రౌడీలను తీసుకు వచ్చి క్రికెట్ బ్యాట్ లతో తమను కొట్టి.. మహిళను అని కూడా చూడకుండా తనను పొత్తికడుపులో తన్నుతూ.. చంపుతామని బెదిరించి ఖాళీ రిజిస్ట్రర్ బాండ్ పేపర్లపై సంతకాలు చేయించుకున్నారని.. అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని విచారించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అనంతపురానికి చెందిన ఎం. పద్మజ వేడుకున్నారు.

• ఎమ్మార్వో, వైసీపీ నేతలు కుమ్మక్కై.. కోర్టు విచారణలో ఉన్న తమ అక్రమ ఆన్ లైన్ చేసుకున్నారని.. అక్రమ ఆన్ లైన్ చేసిన ఎమ్మార్వోపై చర్యలు తీసుకుని తమ భూమి తమకు ఇప్పించాలని ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం రాజంపల్లికి చెందిన ఓర్సు అల్లూరమ్మ విజ్ఞప్తి చేశారు.

• తన ఇంటి డోర్ నెంబర్ ను వైసీపీ మహిళా నాయకురాలు సంపూర్ణ పార్వతి కొట్టేసి తమకు వేరొక డోర్ నెంబర్ కేటాయించి బలవంతంగా ఆ డోర్ నెంబర్ పై పన్ను కట్టాలని బెదిరిస్తున్నారని.. దీనిపై అధికారుల వద్దకు వెళితే పట్టించుకోలేదని. తమ ఇంటి డోర్ నెంబర్ తమకు ఉండేలా చూడాలని గుంటూరు జిల్లా తాడేపల్లి మహానాడుకు చెందిన అబ్దుల్ ముజీద్ ఆవేదన వ్యక్తం చేశారు.

• ఇచ్చిన డబ్బులు తమకు తిరిగి ఇవ్వమని అడుగుతుంటే లేటర్ లో తమపేరు రాసి చనిపోతామని తన మేనకోడలు కిలారి వసంతి ఇబ్బంది పెడుతుందని.. తమకు రావాల్సిన ఎనిమిది లక్షల 50 వేలను ఇప్పించాలని తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామానికి చెందిన కిలారి పిచ్చయ్య విజ్ఞప్తి చేశారు.

• కర్నూలు జిల్లా పత్తికొండకు చెందిన పలువురు రజకులు విజ్ఞప్తి చేస్తూ.. 2018 లో మంజూరు అయిన దోబీ ఘాట్ కు డబ్బులు ఇంకా రాలేదని ఆ డబ్బులు ఇప్పించి ఆదుకోవాలని వారు వేడుకున్నారు.

• రాష్ట్ర జిల్లా స్థాయి మీడియా అక్రిడిటేషన్ కమిటీలో సభ్యులుగా నేషనల్ యాక్టీవ్ రిపోర్టర్ అసోసియేషన్ కు చెందిన వారికి ప్రాతినిధ్యం కల్పించాలని ఆ శాఖ మంత్రికి వారు విజ్ఞప్తి చేశారు.

• బాపట్ల జిల్లా బాపట్ల మండలానికి చెందిన వీరయ్య విజ్ఞప్తి తమ గ్రామంలో 2013 నుండి 2018 వరకు అభివృద్ధి పనులు చేసినట్టు ఆ బిల్లులు నేటికి రాలేదని బిల్లులు ఇప్పించి ఆదుకోవాలని నేతలకు విజ్ఞప్తి చేశారు.

• ఏలూరు జల్లా నూజివీడు మండలం మీర్జాపురం గ్రామంలో వెంకన్న చెరువు నందు చేపల పెంపకం వల్ల చెరువులో ఉన్న మంచినీరు కలుషితం అవుతుందని చెరువునందు చేపల పెంపకాన్ని నిలుపుదల చేయాలని పలువురు గ్రీవెన్స్ లో విన్నవించారు.

భూ తగాదాలు, ఆస్తి తగాదాలను పరిష్కరించాలని అర్జీదారులు పోటెత్తివచ్చి అర్జీలు ఇచ్చారు.. ఇల్లు మంజూరు, రేషన్ కార్డ్, పింఛన్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కొందరు విన్నవించుకున్నారు. సీఎంఆర్ఎఫ్ సాయం కోసం పలువురు బిల్లులు అందించి అభ్యర్థించారు. గత ప్రభుత్వంలో తమపై పెట్టిన అక్రమ కేసులు తొలగించాలని టీడీపీ సానుకూలపరులు వేడుకున్నారు. అలాగే వివిధ సమస్యలపై అనేక మంది తమ అర్జీలు ఇచ్చి పరిష్కరించాలని కోరారు.