Mahanaadu-Logo-PNG-Large

వైకాపా ప్రతిపాదనలు ప్రాజెక్టుకు చేటు

-నిధులు మళ్లించుకునే ప్రయత్నం 
– రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు  

అమరావతి, మహానాడు:  
వైసీపీ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలు పోలవరం ప్రాజెక్టుకు చేటు తేవడమే కాకుండా బ్యారేజీగా మారే ప్రమాదం ఏర్పడేదని  శాసనసభలో మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయకుండా నిధులు మళ్లించుకునేందుకే కాంటూరు ఎత్తు తగ్గిస్తూ కేంద్రానికి లేఖ రాశారన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ డిజైన్ ప్రకారం నీటిని నిల్వ చేయగలిగే కాంటూరు ఎత్తు 45.72 మీటర్లు. గత వైసీపీ ప్రభుత్వం 41.15కు తగ్గించే ప్రతిపాదనలు చేసి ప్రాజెక్టుకు చేటు తేవడమే కాకుండా బ్యారేజీగా మారే ప్రమాదం ఏర్పడేది.

కాంటూరు ఎత్తు  45.72 ఉంటే 194 టీఎంసీలను నిల్వతోపాటు 320 టీఎంసీల గోదావరి జలాలు వాడుకునే అవకాశం ఉంటుంది. ఎత్తు  41.15కు తగ్గిస్తే 109 టీఎంసీలు  మాత్రమే నిల్వ వల్ల ప్రయోజనం ఉండదు. ఎత్తు తగ్గించడం వల్ల నిర్మాణ అంచనా వ్యయం 55 వేల కోట్ల నుంచి 30 వేల కోట్లకు తగ్గించి కేంద్రం నుంచి 10 నుంచి 15 వేల కోట్ల నిధులను తెచ్చుకుని మళ్లించుకోవాలన్నదే జగన్ ఆలోచన. ఎన్డీఏ ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టు ఎంత ముఖ్యమో నిర్వాసితుల బాధ్యత కూడా అంతే ముఖ్యమని మంత్రి రామానాయుడు పేర్కొన్నారు.