ఇప్పుడు బీజేపీ కూడా టీడీపీకి తోడయింది కాబట్టి.. రాగల ప్రమాదాన్ని తెలివైన మీడియా అధిపతులు గ్రహించడానికి, పెద్దగా సమయం పట్టదు. రేపటి నుంచి సర్వేలో పేరుతోనో, టీడీపీ వార్తలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం ద్వారానో తమ ‘ముందస్తువిధేయత’ సంకేతాలు పంపినా ఆశ్చర్యం లేదు. ఇప్పటివరకూ వైసీపీ భజనబృందంలో శాశ్వత సభ్యత్వం తీసుకున్న ఇలాంటి మీడియా అధిపతులు, ‘అవసరాల కోసం’ తాత్కాలిక సభ్యత్వం తీసుకున్న మీడియా అధిపతులు, ఇక తమ దారి మార్చుకోవడంలో వింతేమీ ఉండదు.
కులం కార్డుతో ఒకరు, దూరపు బంధుత్వాల పేరుతో మరొకరు, గత పరిచయాల పేరుతో ఇంకొరు.. ఇవేమీ వర్కవుట్ కాకపోతే, పార్టీలో ఉన్న తమ ‘కుల’వేల్పుల ద్వారానో, బాబుకు సన్నిహితంగా ఉండే అధికారుల ద్వారానో, మళ్లీ పసుపుగూటికి రావడం తథ్యం. ఇది చెప్పడానికి పెద్ద మేధావి కానవసరం లేదు. గతానుభవాలు చూస్తే చాలు! కానీ చిన్నవయసులోనే ఇలాంటి గోకర్ణ-గజకర్ణ-టక్కుటమార విద్యలో ఆరితేరిన లోకేష్ ముందు, ఈ కుప్పిగంతులు-కులం గంతులు నడుస్తాయో లేదో చూడాలి.
ఇక వైసీపీ అనుబంధ మీడియా ఆశ చావకుండా, పొత్తుపై తమ శక్తిమేరకు కథనాలు వండివార్చవచ్చు. అంటే టీడీపీ-బీజేపీ ఓట్లు బదిలీ కావని, ముస్లిం-క్రైస్తవులు కూటమికి ఓట్లు వేయరని, బీజేపీతో పొత్తుపై టీడీపీలో అసమ్మతి మొదలయిందనే ‘వైసీపీ భక్తిపూరిత మీడియా’ వార్తలు ప్రసారం చేసినా. పత్రికల్లో అచ్చొత్తినా ఆశ్చర్యం లేదు. చనిపోయిన వారి కాయాన్ని మోసుకెళ్లే క్రమంలో, కొద్దిసేపు ఒకచోట ఆపి చెవులో చెబుతుంటారు. అలాంటిదే ఈ రాజకీయ ఎన్నికల దింపుడుకళ్లెం ఆశ కూడా!
అయితే పొత్తు రాజకీయాల్లో ఆరితేరిన టీడీపీకి అవి పెద్దగా ప్రతిబంధకం కాదు. బీజేపీ-కమ్యూనిస్టులు-కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న అనుభవం టీడీపీది. ఆ సందర్భంలో సీట్లు కోల్పోయే నేతలకు ఎలా నచ్చచెప్పాలో టీడీపీకి కొట్టినపిండి. టికెట్లు రాని వారితో స్వయంగా మాట్లాడేందుకు చంద్రబాబు ఏమాత్రం అహం ప్రదర్శించరు. జగన్ మాదిరిగా ఏ సజ్జలనో, ఏ విజయసాయిరెడ్డినో, ఏ సుబ్బారెడ్డినో పంపించరు. పవన్ ఇంటికి బాబు స్వయంగా వెళ్లారన్నది మర్చిపోకూడదు. ఎక్కడ నెగ్గాలో కాదు. ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన నేత బాబు.
రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ కలసిపోటీ చేసినా, మైనారిటీలు వ్యతిరేకించలేదు. వ్యతిరేకించి ఉంచి అధికారంలోకి రాగలిగేది కాదు కదా? పైగా ఆంధ్రాలో తెలంగాణలో మాదిరిగా, మతవాదం భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. హిందు-ముస్లిం-క్రైస్తవులు కలిసే జీవిస్తారు. పైగా టీడీపీపై ఇప్పుడు ముస్లింలలో నమ్మకం పెరిగింది. ముస్లిం-క్రైస్తవుల పండుగలకు చంద్రబాబు సర్కారు ఇచ్చిన బహుమానాలు, పథకాలను జగన్ సర్కారు అటకెక్కించారు. ఇలాంటి సానుకూల అంశాలే ఎక్కువ కాబట్టి, వైసీపీ ప్రేరేపిత మిత్ర మీడియా ఆశలు పెద్దగా ఫలించవు.
పైగా.. జగన్-బీజేపీ ఇప్పటిదాకా కలిసే ఉన్నారన్న విషయం, ముస్లిం-క్రైస్తవులకు తెలియదనుకుంటే అంతకుమించిన అమాయకత్వం మరొకటి ఉండదు. మరి వారిద్దరి కలయికను పెద్దగా పట్టించుకోని మైనారిటీలు.. టీడీపీ-బీజేపీ కలిస్తే మాత్రం ఎందుకు ఆగ్రహిస్తారన్న లాజిక్ రాకపోవడమే విడ్డూరం.
సరే ఇప్పుడు పొత్తు కుదిరింది. కానీ మూడుపార్టీల మధ్య ఓట్ల బదిలీ జరగాలి. అదొక్కటే ప్రధానం. అందుకే బాబు-పవన్-లోకేష్ -భువనేశ్వరి నలుదిక్కులా ప్రచారం చేస్తున్నారు. రేపు వారికి బీజేపీ అగ్రనేతలు జమవుతారు. ఇప్పటికే వారి సభల్లో టీడీపీ-జనసేన జెండాలు కలిసే దర్శనమిస్తున్నాయి. ఇక మూడవ జెండాగా బీజేపీ రాబోతుంది. నిజానికి ఏపీలో బీజేపీకి పెద్దగా బలం లేదు. నాయకుల సంఖ్య తప్ప కార్యకర్తల సంఖ్య అత్యల్పం. బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే దానిపేరుతో లాభపడేది కొందరు పెద్ద నాయకులే తప్ప, పార్టీకి చట్టసభల్లో ప్రవేశం ఉండదు. నాయకులకు మాత్రం ఐదేళ్లకు సరిపడా సాదరు ఖర్చులు చందాల రూపంలో పోగవుతాయి. అదొక్కటే బీజేపీ విడిగా పోటీ చేస్తే వచ్చే లాభం!
ఇప్పటిపొత్తు బీజేపీకే లాభం. ఐదు లోక్‌సభలో నాలుగు ఖాయంగా గెలిచే సీట్లే తీసుకున్నారు. గతంలో మాదిరి అత్యాశకు పోకుండా, గెలవగలిగే సీట్లే తీసుకుని తెలివి ప్రదర్శించారు. ఈ పొత్తుతో దక్షిణాదిలో కొన్ని సీట్లు గెలవాలన్న బీజేపీ నాయకత్వ ఆశ కూడా నెరవేరుతుంది. కాబట్టి బీజేపీకి పొత్తు లాభమే.
కాకపోతే.. బీజేపీ ఎట్టి పరిస్థితిలోనూ కుటుంబపార్టీలతో పొత్తు పెట్టుకోదని అమిత్‌షా పక్షాన తానే చెబుతున్నట్లు, గతంలో భవిష్యవాణి వినిపించిన దిగ్రేట్ సోము వీర్రాజు… 75 అసెంబ్లీ 15 లోక్‌సభ సీట్లతోపాటు, సీఎం సీటు కూడా ఇస్తేనే పొత్తు ఉంటుందని, నద్దా పక్షాన తానే చెబుతున్నట్లు ప్రకటించిన మహానేత విష్ణువర్దన్‌రెడ్డి.. ఇప్పుడు ఎక్కడ ముఖం పెట్టుకుంటారన్నది రాజకీయ విశ్లేషకుల ఉవాచ.