వ్యూహం కలెక్షన్లతో పోటీ పడనున్న వైసిపి ఓట్లు

– వైసీపీ ఓట్లు కూడా వ్యూహం కలెక్షన్ల మాదిరిగా ఉంటాయి
‘-వ్యూహం’ సినిమా కలెక్షన్ల లాగే పోలింగ్ బూత్ ల లో వైకాపాకు ఓట్లు
– వ్యూహం సినిమా చూసి గుండాగిన వారిని పరామర్శించేందుకు జగన్ ఓదార్పు పర్యటన చేస్తారేమో?
-నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఎద్దేవా

వ్యూహం సినిమా కలెక్షన్లు ఎంతైతే దారుణంగా ఉన్నాయో… రేపు పోలింగ్ బూతుల్లో వైకాపాకు ఓట్లు కూడా అంతే ఘోరంగా ఉండబోతున్నాయని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు. వ్యూహం సినిమా కలెక్షన్లు దారుణం అయితే , అంతకంటే ఘోరమైన పరాభవాన్ని వైకాపా చవిచూడనుందన్నారు.

ఆదివారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… రాయలసీమ ప్రాంతంలో వైకాపాకు 20 నుంచి 25 స్థానాలు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో 15 స్థానాలను కలుపుకొని మొత్తంగా 40 స్థానాలు వస్తాయని ఇన్నాళ్లు భావించాం. కానీ ప్రస్తుత పరిస్థితి పరిశీలిస్తే సింగల్ డిజిట్ కు పరిమితమైన ఆశ్చర్యపోవాల్సిన పని లేదన్నారు.

వ్యూహం సినిమా ద్వారా ప్రజలు వైకాపాకు ఒక టీజర్ లాంటి షాక్ ఇచ్చారు. వైకాపా శ్రేణులు ఓటమిని తట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలని, ఓడిపోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చేపట్టనున్న ఓదార్పు యాత్రకు, ఇంకా పార్టీలో పనికిమాలిన వారు ఎవరైనా మిగిలి ఉంటే వారు సిద్ధంగా ఉండాలన్నారు. అంతలోనే రఘురామకృష్ణం రాజు గోశాలలోని గోమాత గజ్జల చప్పుడు చేయడంతో ఇది నిజమని, గోమాత కూడా నిజమనే చెబుతోందని ఆయన అన్నారు.

తాను పద్మ వ్యూహంలో చిక్కుకోవడానికి అభిమన్యుడిని కాదు… అర్జున్ రెడ్డి అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి, తన వ్యూహంలో తానే చిక్కుకొని ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పన్నిన వ్యూహంలో నుంచే బయటకు రాలేదు. ఇంకా పద్మవ్యూహంలో నుంచి బయటకు ఏమి వస్తావంటూ రఘు రామకృష్ణంరాజు అపహాస్యం చేశారు.

రాయలసీమ జిల్లాలలో వ్యూహం సినిమా కలెక్షన్లు నిల్

రాయలసీమ జిల్లాలలోని వివిధ సినిమా థియేటర్లలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బయోపిక్ గా రూపొందించిన వ్యూహం సినిమా కలెక్షన్లు ఎంత దారుణంగా ఉన్నాయో రఘురామ కృష్ణంరాజు చదివి వినిపించారు. వ్యూహం సినిమా తో పాటే విడుదలైన నటరత్న నందమూరి బాలకృష్ణ నటించిన సమరసింహారెడ్డి సినిమా అద్భుతమైన కలెక్షన్లను వసూళ్లు చేసింది. చిత్తూరు జిల్లాలోని మదనపల్లి, శ్రీకాళహస్తి లలో వ్యూహం సినిమాలను థియేటర్లలో ప్రదర్శించలేదు.

అంటే, ఈ సినిమా కోసం ఒక్క టికెట్టు కూడా ప్రేక్షకులు కొనుగోలు చేయలేదు. పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రోద్బలంతో నాలుగు షోలను వేసినప్పటికీ, కలెక్షన్లు నామమాత్రంగానే ఉన్నాయి. వ్యూహం సినిమా ద్వారా రాయలసీమ జిల్లాలలోని వివిధ సినిమా థియేటర్లలో రోజు వారి కలెక్షన్లను రఘురామ కృష్ణంరాజు చదివి వినిపించారు. పులివెందుల పులిబిడ్డ గా చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ఇలాఖా అయిన పులివెందులలోనే వ్యూహం సినిమాను ప్రదర్శించలేదు.

రాయలసీమ జిల్లాలలో జగన్మోహన్ రెడ్డి తోపు, తుర్రుమ్ ఖాన్ అని అంటుంటారు. అక్కడే వ్యూహం సినిమా డాం… ఢమాల్ అయ్యింది. రాయలసీమ జిల్లాలలో మొత్తంగా వసులైన కలెక్షన్ 6,91, 582 రూపాయలు కాగా, నెట్ 5,83,7074 రూపాయలు, నిర్మాత షేర్ 2, 91, 303 రూపాయలని పేర్కొన్నారు. క్రూ సిస్టం ఖర్చుల వరకు కూడా వ్యూహం సినిమా కలెక్షన్లు వసూలు కాలేదని, అదే గతంలో మాదిరిగా ప్రింటర్ సిస్టం ఉండి ఉంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. ఇటువంటి కలెక్షన్లు వసూళ్లు చేసే సినిమాలు బహు అరుదుగా విడుదల అవుతాయని రఘురామకృష్ణంరాజు అపహాస్యం చేశారు.

ముఖ్యమంత్రి బయోపిక్ అన్న సినిమా ఇంత దారుణమైన కలెక్షన్లు వసూళ్లు చేసిందని అంటే మూడు రోజుల క్రితమయితే బాధపడే వాడిని, ఎందుకంటే అప్పటికి నేను వైకాపా లోనే కొనసాగుతున్నాను. ఇప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేసినందు వల్ల, వ్యూహం సినిమా కలెక్షన్లను చూసి ఒకింత సంతోష పడుతున్నానన్నారు.

రెండవ షో కాదు…రెండవ రోజు కూడా థియేటర్ ఫుల్ అయితే మీసాలు తీస్తానన్నా

వ్యూహం సినిమా విడుదలైన తరువాత రెండవ షో కాదు, రెండవ రోజు కూడా థియేటర్ ఫుల్ అయితే మీసాలు తీస్తానని చెప్పానని రఘురామ కృష్ణంరాజు వెల్లడించారు. అయితే రాయలసీమలో ఎక్కడ కూడా వ్యూహం సినిమా ఒక్క థియేటర్ లో కూడా ఫుల్ అయిన దాఖలాలు లేవు. ఎంతో ప్రెస్టేజ్ కు పోయినా సినిమా డొల్ల అయిపోయింది. ఈ సినిమా కలెక్షన్లను పరిశీలించిన తర్వాత, ఇటీవల విడుదలై డిజాస్టర్ గా నిలిచిన యాత్ర 2 సినిమా కలెక్షన్లే బెటర్ అనిపిస్తుంది. వ్యూహం సినిమాను చాలా రిచ్ గా తీశారు. అయినా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. వ్యూహం తర్వాత శపథం సినిమా ఉందట.

దాన్ని ప్రీ పోన్ చేసుకొని , సోమవారమే విడుదల చేస్తే మంచిది. ఎందుకంటే వచ్చే శుక్రవారం ఇంకొక సినిమాను విడుదల చేయవచ్చు. సినిమా డిజాస్టర్ గా మిగిలిన వచ్చిన నష్టమేమీ లేదు. ఎందుకంటే పాపిష్టి సొమ్ము వారి వద్ద చాలా ఉంది. వ్యూహం సినిమా ఆంధ్ర ప్రాంత కలెక్షన్లను రేపు రచ్చబండ కార్యక్రమంలో వివరిస్తాను. కలెక్షన్ల వివరాలను కట్టడి చేయాలని చూసినా, వాటంతా టవే వచ్చేస్తాయమ్మ మదన్ మోహన అంటూ రఘురామ కృష్ణంరాజు సెటైర్ వేశారు.

సెన్సార్ బోర్డు అభ్యంతరాల నేపథ్యంలో వ్యూహం సినిమాలో ముఖ్యమంత్రి పాత్ర పేరు మదన్ మోహన్ రెడ్డిగా నామకరణం చేశారు. వ్యూహం సినిమా కలెక్షన్లను చూస్తే జగన్మోహన్ రెడ్డిని చూడడానికి ప్రజలు ఇష్టపడడం లేదని తెలిసిపోతుంది. వాలంటీరులైన చూసి ఉంటే ఈ సినిమాకు మరింత మెరుగైన కలెక్షన్లు వచ్చి ఉండేవి. రేపటి నుంచి డ్వాక్రా మహిళలను, వృద్ధాప్య పింఛను పొందే వారిని బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి, మద్యం బాటిల్ అందజేసి సినిమా థియేటర్లకు తరలిస్తారేమోనని, ఆ బాధ్యత కూడా వాలంటీర్లకే అప్ప చెబుతారేమోనని అన్నారు. మీకోసం ఎన్నో సార్లు బటన్ నొక్కాను , నా జీవిత గాధ సినిమా చూడరా? ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయని జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తారేమోనని రఘురామకృష్ణంరాజు అపహాస్యం చేశారు.

సరదాగా మీసం తీయాలనుకున్న…

వ్యూహం సినిమా విడుదల అయిన తరువాత రెండవ రోజు కూడా థియేటర్లు ప్రేక్షకులతో నిండిపోయి ఉంటే , ఈ పరీక్షలో నేను ఓడిపోయి ఉంటే సరదాగా మీసం తీయాలని అనుకున్నానని రఘురామకృష్ణంరాజు తెలిపారు. అయితే, మీసాలను మరింతగా పెంచాలనేటట్టుగా సినిమా కలెక్షన్లు ఉన్నాయి. ఇంకో పది రోజులపాటు మీసాలను కనీసం ట్రిమ్ కూడా చేయనని అన్నారు. విలన్ క్యారెక్టర్ హీరోగా చూపించాలని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రయత్నించారు.

గాడ్ ఫాదర్ సినిమాలో వర్కౌట్ అయ్యింది కానీ, పులివెందుల పులిబిడ్డ ఫ్యామిలీని హీరోయిజం కోసం ఎంత ఎలివేషన్ ఇచ్చినప్పటికీ, ప్రేక్షకులు ఆదరించలేదు. ఇది క్యారెక్టర్ ఫెయిల్యూరే తప్పితే, దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మ ఫెయిల్యూర్ కాదు. రాంగోపాల్ వర్మ నేను మంచి స్నేహితులం. తరచూ మాట్లాడుకుంటాం. ఆ విషయాన్ని రామ్ గోపాల్ వర్మ కూడా అంగీకరించారు. రాంగోపాల్ వర్మ గొప్ప దర్శకుడు. ఈ సినిమాకు ముందే, పెడ్ అవుట్ అయిన, అయిపోయిన అప్పారావును ఎవరూ చూడరని రాంగోపాల్ వర్మకు చెప్పాను.

వ్యూహం సినిమాను రాంగోపాల్ వర్మ రూపొందించారు కాబట్టే ఆమాత్రం కలెక్షన్లైనా వచ్చాయి. నాలాంటి రాము అభిమానులు ఈ సినిమా చూశారు. లేకపోతే సినిమా చూసి ఉండేవారు కాదు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత రానున్న ఎన్నికల్లో వైకాపాకు ఎన్ని ఓట్లు పడనున్నాయో ప్రజలందరికీ అర్థమయిందని రఘురామకృష్ణం రాజు అన్నారు. దర్శకుడిగా రాంగోపాల్ వర్మ ప్రతిభ వృధా అయినందుకు బాధనిపిస్తోంది. అయినా జనాలకు పెడ్ అవుట్ అయిన, అయిపోయిన అప్పారావు గురించి తెలియజేసినందుకు రాంగోపాల్ వర్మను అభినందిస్తున్నాను.

ఇప్పుడు ప్రజలకు అర్థమై ఉంటుంది వాట్ టూ డు, వాట్ నాట్ టూ డు అన్నది. రానున్న ఎన్నికల్లో కూటమి విజయం తథ్యం. పొత్తు లేదని టీవీ9 ఎంత మొత్తుకున్న తెదేపా, జనసేన తో పాటు బిజెపి కలిసి పోటీ చేయడం ఖాయం. గత రెండేళ్లుగా నేను ఇదే మాట చెబుతున్నాను. ఇప్పుడు అదే మాటకు కట్టుబడి ఉన్నాను.

వ్యూహం సినిమా అట్టర్ ఫ్లాప్ తో ఎవరైనా వైయస్ రాజశేఖర్ రెడ్డి హఠాన్మరణంతో గుండె ఆగి చనిపోయినట్లు చనిపోతే, జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర 1.0 చేస్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాగూ తిరుగుతారు కాబట్టి వారిని పరామర్శిస్తారు. ఎన్నికల అనంతరం ఓదార్పు యాత్ర 2.0 కచ్చితంగా చేయాలని మూడు రోజుల క్రితం వరకు ఆ పార్టీలో కొనసాగిన నిర్భాగ్యుడిగా చెబుతున్నానని రఘురామ కృష్ణంరాజు అన్నారు.

సీట్ ఆఫ్ గవర్నెన్స్ ను తాకట్టు పెడతారా?

పరిపాలనకు కేంద్రబిందువైన సచివాలయాన్ని, సీట్ ఆఫ్ గవర్నెన్స్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టారని, సీట్ ఆఫ్ గవర్నెన్స్ ను ఎవరైనా తాకట్టు పెడతారా? అంటూ రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. సీట్ ఆఫ్ గవర్నెన్స్ తాకట్టు పెట్టినా మాట్లాడడానికి భయపడే నిర్భాగ్యులను చూస్తే ఛీ… అని అనాలనిపిస్తోంది . సచివాలయాన్ని 700 కోట్ల రూపాయలు వెచ్చించి గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్రహ్మాండంగా నిర్మించారు.

మావాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత టూరిజం ప్రాజెక్టు పేరిట 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి విశాఖపట్నం రుషికొండపై విలాసవంతమైన ఇంద్ర భవనాన్ని నిర్మించుకున్నాడు . దీనితో, ఎవరిని ముఖ్యమంత్రిగా ఉంచాలి, ఎవర్ని ఇంటికి పంపించాలన్నది రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని ఆయన కోరారు. సచివాలయాన్ని 350 కోట్ల రూపాయలకు తాకట్టు పెడితే, రేపు ఇన్స్టాల్మెంట్స్ చెల్లించలేదని భవిష్యత్ ముఖ్యమంత్రి సమావేశం నిర్వహిస్తుండగా బ్యాంకు వారు లేపేసి, సచివాలయాన్ని స్వాధీన పరుచుకునే అవకాశం లేకపోలేదన్నారు .

ప్రస్తుతం సెక్రటేరియట్ తాకట్టు పెట్టిన జగన్మోహన్ రెడ్డి, గతంలో రాష్ట్ర రాజధాని విశాఖపట్టణమేనని చెప్పి, విశాఖలోని ప్రభుత్వ కార్యాలయాలను, పార్కులను తాకట్టు పెట్టారని గుర్తు చేశారు. ఇటువంటి దుర్మార్గమైన పాలనను ఎవరైనా సమర్ధిస్తున్నారంటే వారికి పిచ్చి పట్టినట్లేనని, అటువంటి వారి మధ్య మనము ఉండడం మన ఖర్మ అని అన్నారు. ఇటువంటి దుర్మార్గమైన పాలనకు చరమగీతం పాడడానికి మనమేమీ పెద్ద యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు.

ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించి ఒక బటన్ నొక్కితే చాలు. కూటమి అభ్యర్థి ఎవరు ఉంటే వారికి ఓటు వేయాలి. సైకిల్, గాజు గ్లాసు, కమలం పువ్వు గుర్తులలో ఏదో ఒక్క గుర్తు మాత్రమే ఈవీఎంలపై ఉంటుంది. విరిగిన ఫ్యాను రెక్కలకు దూరంగా ఉంటూ, కూటమి అభ్యర్థి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని రఘురామకృష్ణం రాజు కోరారు.

రేపు మన ఆస్తులను కూడా తాకట్టు పెట్టవచ్చు

ప్రస్తుతం రాష్ట్ర సెక్రటేరియట్ ను తాకట్టు పెట్టిన పాలకులు, రేపు మన ఆస్తులను కూడా తాకట్టు పెట్టే అవకాశం లేకపోలేదని రఘురామకృష్ణం రాజు అన్నారు. ఇప్పటికే ప్రజల వ్యక్తిగత ఆస్తి పత్రాలను ప్రస్తుత పాలకులు తమ వద్దే ఉంచుకున్న విషయం తెలిసిందే. ఏదైనా పనికిమాలిన బ్యాంకు వాడు వచ్చి ప్రజల ఆస్తులపై కూడా అప్పు ఇస్తామంటే, వాటిని కూడా తాకట్టు పెడతారన్నారు.

సెక్రటేరియట్ తాకట్టు పెట్టిన తర్వాత సోషల్ మీడియాలో ఒక పోస్టు వైరల్ గా మారిందని, బ్యాంకు వారు వచ్చి ఒక వ్యక్తిని ప్రభుత్వం తాకట్టు పెట్టిందని చెప్పి తీసుకువెళ్లి, కిడ్నీని తీసుకుంటామని అంటారు. మూడు రోజుల క్రితం వరకు ఈ తరహా సీన్ కామెడీగా అనిపించేది. కానీ ప్రస్తుతం ఇలా కూడా జరిగే అవకాశం లేకపోలేదనిపిస్తోంది . ప్రజల కిడ్నీలను ఇడ్లీ లాగా ప్రస్తుత పాలకులు విదేశీ మాఫియాకు అమ్మేస్తారన్నారు.

పాలక పక్షంలో ప్రతిపక్షంగా అప్పుడు నేనొక్కడినే… ఇప్పుడు ఎంతోమంది

గత నాలుగేళ్ల క్రితం పాలక పక్షంలో ప్రతిపక్షంగా నేనొక్కడినేనని పేర్కొన్న రఘురామకృష్ణంరాజు, ఇప్పుడు ఎంతోమంది తనతో కలిసి వచ్చారన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు తో పాటు, మా గుంట శ్రీనివాసులు రెడ్డి కూడా బయటకు వచ్చేశారన్నారు.

కుల వ్యవస్థ అన్నది ప్రస్తుత సమాజానికి అవసరం లేదు

కుల వ్యవస్థ అన్నది ప్రస్తుత సమాజానికి అవసరం లేదని, ఇప్పుడు ఏ కులం వారైనా అన్ని పనులను చేస్తున్నారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఓవర్ నైట్ కుల వ్యవస్థను నిర్మూలించడం సాధ్యం కాదు. కానీ కులరహిత సమాజం అవసరం. సనాతన ధర్మంలో భాగంగా వృత్తుల ఆధారంగా కులాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఓట్ల కోసం ఒక వ్యక్తి సమాజంలో ఎక్కువమంది ఏ కులంలో ఉన్నారో ఆ కులం వారీగా చలామణి అవుతున్నట్లు తెలిసింది.

అటువంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని రఘురామకృష్ణం రాజు కోరారు. డాక్టర్ వైఎస్ సునీతా రెడ్డి ప్రెస్ మీట్, మరి కొన్ని విషయాలను డైవర్ట్ చేయడానికి టీవీ9 ఛానల్ పదే, పదే పొత్తు లేదని వార్తా కథనాలను ప్రసారం చేసినట్లుగా కనిపిస్తోంది. త్వరలోనే పొత్తుల అంశం తేలిపోతుంది. మూడు పార్టీల మధ్య పొత్తు ఉంటుంది. కూటమి విజయాన్ని సాధిస్తుందని రఘు రామ కృష్ణంరాజు అన్నారు.