– సంస్మరణ సభలో పలువురు వక్తలు
విజయవాడ, మహానాడు: సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి అమరజీవి సీతారాం ఏచూరి మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి, అభ్యుదయ లౌకిక శక్తులకు తీరనిలోటు అని, ఆయన ఆశయాలను, లక్ష్యాలను కొనసాగించాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పాశం రామారావు అన్నారు. గురువారం 2/7 బ్రాడిపేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో సీతారామ్ ఏచూరి సంస్మరణ సభలో పాల్గొని, మాట్లాడారు. పాశం రామారావు మాట్లాడుతూ పార్లమెంట్ సభ్యునిగా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా వుండి మతోన్మాద శక్తులను దాని ప్రమాదాన్ని ఎండగట్టడంలో ఎనలేని కృషి చేశారన్నారు.
శాసన మండలి మాజీ సభ్యుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ బి.జె.పి ప్రమాదానికి వ్యతిరేకంగా, మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా, దేశ వ్యాపితంగా ఇండియా కూటమి నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని ఆయన మరణం దేశ లౌకిక అభ్యుదయ శక్తులకు తీరని లోటన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ మాట్లాడుతూ దేశం గొప్ప వామపక్ష యోధున్ని కోల్పోయిందని ఆయన ఆశయాలను, లక్ష్యాలను ముందుకు తీసుకెళ్ళాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొరివి వినయ్‌కుమార్ మాట్లాడుతూ కామ్రేడ్ భారత రాజ్యాంగ రక్షణకు లౌకిక విలువల పరిరక్షణకు దళిత, గిరిజన సమస్యల పరిష్కారానికి ఎనలేని కృషి చేశారు. నేటి తరం ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె.నళినీకాంత్ మాట్లాడుతూ యేచూరి పార్టీలోకి యువకులు, మహిళలు, దళితులు, గిరిజనులను నాయకత్వ స్థానాల్లోకి తీసుకరావడానికి ఎనలేని కృషి చేశారన్నారు.
ఈ సభలో ప్రొఫెసర్ వేణుగోపాలరావు, పార్థసారథి, ఎల్, ఎస్ భారవి, సీపీఎం పల్నాడు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు వై.రాధాకృష్ణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు ఎన్.భావన్నారాయణ, ఎమ్.ఎ.చిష్టి, అజయ్‌కుమార్, బి.శ్రీనివాసరావు, కల్యాణి, బి.లక్ష్మణరావు, ఎం.డి. అక్బర్, తదితరులు పాల్గొన్నారు.